నిర్బంధ ఉద్యోగ విరమణ వెనుక ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ప్రమేయం: రిటైర్డ్ జడ్జి ఎం.కృష్ణప్ప
నెల్లూరు(లీగల్): న్యాయవ్యవస్థలో కొన్ని మీడియా సంస్థలు మితిమీరిన జోక్యం చేసుకుంటున్నాయని, ఇది తగదని నెల్లూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ స్పెషల్ (5వ అదనపు) జడ్జి ఎం.కృష్ణప్ప అన్నారు. ఆయన ఉద్యోగ విరమణ సందర్భంగా స్థానిక న్యాయవాదుల సమావేశ మందిరంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కృష్ణప్ప మాట్లాడుతూ తాను నిరుపేద కుటుంబంలో జన్మించి పలువురి ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగానని, బాధ్యతల నిర్వహణలో ప్రలోభాలకు తలొగ్గక నీతి, నిజాయితీలతో పనిచేశానని తెలిపారు.
ఫలితంగా పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అనంతపురం సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు వచ్చిన ఓ పరువునష్టం కేసులో అన్ని ఆధారాలు ఉండటంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చానన్నారు. దీంతో అప్పటి నుంచి ఆ విషయం మనసులో పెట్టుకొని తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టాడన్నారు. తనపై గతంలో అసత్య ఆరోపణలు చేస్తూ పత్రికల్లో వాటిని ప్రచురించి హైకోర్టు ద్వారా తనను సస్పెండ్ చేయించారని తెలిపారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తులు విచారణ జరిపి తనకు క్లీన్ చిట్ ఇచ్చారన్నారు. తనను నిర్బంధ ఉద్యోగ విరమణ చేయించడం వెనుక రాధాకృష్ణతో పాటు కొన్ని శక్తులు పనిచేశాయని ఆరోపించారు. ఈ విషయంపై ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణతో ఏ వేదికపైన అయినా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దమ్మున్న చానల్ అని చెప్పుకుంటున్న ఏబీఎన్ యజమాని దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు.
న్యాయవ్యవస్థలో మీడియా జోక్యం తగదు
Published Sat, Oct 1 2016 3:15 AM | Last Updated on Sat, Aug 18 2018 4:06 PM
Advertisement