దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచింది శ్రీకాళహస్తి. ముక్కంటీశుని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే ఇక్కడ కనీస సదుపాయాలు లేకపోవడం భక్తులను ఇబ్బందులకు గురి చేస్తోంది.
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. విదేశాలకు చెందిన భక్తులు సైతం వస్తున్నారు. ఏడాదికి రూ.80 కోట్లకుపైగా ఆదాయం ఆలయానికి సమకూరుతోంది. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వెంట లగేజీ ఉంటోంది. దీనిని అధికారులు ఆలయంలోకి అనుమతించడం లేదు. అదే సమయంలో ఆలయం తరపున సదుపాయాలు కల్పించడం లేదు.
దీంతో భక్తులు లగేజీ, సెల్‌ఫోన్లు, చెప్పులు భద్రపరుచుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. దీనికితోడు ఆలయ సమాచార కేంద్రం మూతపడడంతో భక్తుల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఈ క్రమంలో దళారులు పనితనం చూపుతున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి నాలుగు ప్రవేశ గోపుర ద్వారాలు ఉన్నాయి. భక్తులు భిక్షాలగోపురం, శివయ్య గోపురం, తిరుమంజన గోపురం, దక్షిణ గోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తుంటారు.
భిక్షాలగోపురం
ప్రధానంగా బస్సుల్లో వచ్చే భక్తులు భిక్షాల గోపురం ద్వారా ఆలయం లోపలకు ప్రవేశిస్తుంటారు. చెప్పులను భద్రపరచుకోవాలంటే ఆ గోపురాన్ని దాటి బాలజ్ఞానాంబ గోపురం వద్దకు రావాలి. అక్కడ చెప్పులు పెట్టుకునే సదుపాయం ఉన్నట్లు యాత్రికులకు తెలియదు. ఎలాగైనా తెలుసుకుని వస్తే లగేజీ పెట్టుకోమని సిబ్బంది చెబుతారు. దీంతో భిక్షాల గోపురం వద్దనే కొందరు దుకాణదారుల వద్ద లగేజీ, చెప్పులు పెట్టుకోవాల్సి వస్తుంది.
ఈ క్రమంలోవారు అవసరం లేని పూజా సామగ్రిని అంటగట్టి 300 నుంచి 350 రూపాయల వరకు పిండుకుంటున్నారు. భిక్షాలగోపురం ఒక్కచోటే ఆలయ సమాచార కేంద్రం ఉన్నప్పటికీ అందులో ఎవరూ విధులు నిర్వహించడం లేదు. వీరికి రాజకీయ అండదండలు ఉండడంతో అధికారులు పట్టించుకోవడ లేదు. దీంతో భక్తులు సమాచారం తెలుసుకోవాలంటే దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది.
తిరుమంజన గోపురం
ఈ గోపురం సన్నిధివీధిలోని జల వినాయకుడి ఆలయం వద్ద ఉంది. వాహనాల ద్వారా వచ్చే భక్తులు దాదాపుగా ఈ మార్గం గుండానే ఆలయంలోకి ప్రవేశిస్తుంటారు. ఈ గోపురం కింద నూతనంగా సెల్‌ఫోన్, లగేజీ పెట్టుకునే ఏర్పాట్లు చేశారు. అయితే ఈ మార్గంలో చెప్పులు పెట్టుకోవడానికి అవకాశం లేదు. దీంతో భక్తులు గోపురం ముందే చెప్పులను కుప్పలు కుప్పలుగా వదిలి వెళుతున్నారు. దర్శనం తర్వాత వచ్చేసరికి వారి చెప్పులు మాయమవుతున్నాయి.
శివయ్య గోపురం
లాడ్జీల్లో బస చేసిన భక్తులు, ఆటో వాళ్లు తీసుకొచ్చిన వారు ఈ గోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తుంటారు. ఇక్కడ లగేజీ, చెప్పులు భద్రపరుచుకునే సదుపాయం లేదు. దీంతో వ్యాపారుల వద్ద చెప్పులు, లగేజీ పెట్టుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో వారు అడిగినంత సొమ్ము సమర్పించుకుంటున్నారు.
దక్షిణ గోపురం
ఈ గోపురం గుండా అత్యధికంగా భక్తులు ఆలయానికి వస్తుంటారు. ప్రధానంగా వీఐపీలు ఇదే మార్గంలో ఆలయానికి చేరుకుంటారు. ఈ గోపురం వద్ద సెల్‌ఫోన్ కౌంటర్ మాత్రమే ఉంది. లగేజీ, చెప్పులు పెట్టుకునే సదుపాయం లేదు. దీంతో ఎక్కడపడితే అక్కడ చెప్పులు వదిలిపెట్టి వెళుతుంటారు. కొందరు సుపథ మండపంలోని స్తంభాల మధ్య వదిలి వెళుతున్నారు. తమ ఇబ్బందుల పట్ల ఆలయాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం
నాలుగు గోపుర మార్గాలను పరిశీలించి భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం. భిక్షాలగోపురం వద్ద, సమాచారం కేంద్రంలో సిబ్బంది పనిచేయని విషయం మా దృష్టికి రాలేదు. విచారించి చర్యలు తీసుకుంటాం.
-శ్రీరామచంద్రమూర్తి, ఆలయ ఈవో
ముక్కంటీశా.. ఎన్నాళ్లీ అవస్థ..
Published Mon, Nov 25 2013 2:04 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
Advertisement