ఏ ఏటికాఏడు రైతులకు కష్టాలు తప్పడంలేదు. ఆదుకోవాల్సిన సర్కారు చేతులెత్తేస్తోంది. ఫలితంగా పుడమి బిడ్డ రోజురోజుకు అప్పుల్లో కూరుకుపోతున్నాడు. ఇటీవల కేంద్రం ధాన్యం మద్దతు ధర పెంచింది. కానీ, రాష్ట్రం సన్నరకం ధాన్యానికి ప్రోత్సాహక ధర పెంచలేక పోయింది. పెరిగిన పెట్టుబడులు, సాగు ఖర్చులు రైతుపై పెనుభారాన్ని మోపాయి. అయినా ప్రోత్సాహక ధర లేకపోవడంతో నిరాశలో కూరుకుపోతున్నారు.
సాక్షి, నల్లగొండ: జిల్లాలో ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. జిల్లావ్యాప్తంగా ఇంచుమించు 1.44 లక్షల హెక్టార్లలో రైతులు సాగుచేశారు. దాదాపు 8లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుం దని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. ఇందులో ఆరు లక్షల టన్నుల వరకు సన్నరకం ధాన్యమే ఉంటుందని పేర్కొంటున్నారు.
ఇదీ పరిస్థితి....
గత ఖరీఫ్‌లో ఏ-గ్రేడు ధాన్యం క్వింటాకు రూ.1280, సాధారణరకానికి రూ.1250 కేంద్రం చెల్లించింది. అయితే, బీపీటీ ధాన్యం పండించే రైతులను ప్రోత్సహిం చాలన్న ఉద్దేశంతో మద్దతుధర కంటే రాష్ట్రం అధికంగా చెల్లించింది. క్వింటాపై రూ.220 ప్రోత్సాహకంగా ప్రకటించి రూ.1500కు రైతుల నుంచి కొనుగోలు చేసింది.
అయితే అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించలేదు. అయితే, కొనుగోళ్లపై తీవ్ర పోటీ ఉండడంతో బహిరంగ మార్కెట్‌లో ఇంతకన్నా అధిక ధర చెల్లించారు. వ్యాపారులు, మిల్లర్లు ఒక్కో క్వింటా రూ.1800 వరకు కొనుగోలు చేశారు. అయితే ప్రస్తుత ఖరీఫ్‌లో ధాన్యం మద్దతు ధరను కేంద్రం నామమాత్రంగా పెంచింది. ఏ-గ్రేడు ధాన్యానికి రూ.65, సాధారణ రకంపై రూ.60 పెంచింది. అంటే పెంపు తర్వాత ఏ - గ్రేడు ధాన్యం రూ.1345కు, సాధారణ రకం రూ.1310కు చేరుకుంది.
ప్రోత్సాహం ఏదీ..?
గతేడాది క్వింటా సన్నరకం ధాన్యంపై ప్రోత్సాహకంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది రూ.220. అప్పుడు క్వింటా ధాన్యం ధర రూ.1280 పలికింది. ప్రస్తుతం పెంపుతో రూ.1345కు ఎగబాకింది. ఈ పెంపుతో ఒక్కో క్వింటాపై రూ.65 భారం రాష్ట్ర ప్రభుత్వంపై తగ్గింది. అయినా, ఈ ఏడాది ప్రోత్సాహంగా ఇచ్చే డబ్బు మొత్తాన్ని పెంచకపోవడం గమనార్హం. పెంచలేమని కూడా స్పష్టం చేసింది. గత ఖరీఫ్‌లో దొడ్డు రకం.. సన్నరకం ధరలకు మధ్య కొనుగోలు ధర వ్యత్యాసం రూ.220. ఈ ఏడాది వ్యత్యాసం రూ.155కు పడిపోయిందని బీపీటీ రైతులు వాపోతున్నారు.
పెరిగిన పెట్టుబడులు...
పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది సాగు భారం రైతులపై అధికంగా పడింది. దున్నడం నుంచి వరికోత వరకు అన్ని ఖర్చులు రెట్టింపయ్యాయి. ముఖ్యంగా ఎరువులు, పురుగుమందుల ధరలు దాదాపు 20 శాతం ఎగబాకాయి. విత్తనాల ధరలూ పెరిగాయి. అంతేగాక దొడ్డు రకం పంట కంటే సన్నరకం పంటకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. 15 రోజులు ఆలస్యంగా దిగుబడి వస్తుంది.
పైగా దొడ్డు రకంతో పోల్చుకుంటే దిగుబడి కూడా తక్కువే. ఈ విధంగానూ రైతుకు కొంత నష్టమే. సాగర్ ఆయకట్టు ప్రాంతంలోని రైతులు వరుసగా మూడు సీజన్లు వరిసాగుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. సాగర్ రిజర్వాయర్‌లో సరిపడా నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడం, సాగర్ జలాయశంలో నీరు సమృద్ధిగా ఉండడంతో వరి విస్తీర్ణం భారీగా పెరిగింది. ఎంతో ఆశతో రైతులు సన్నరకం పంటకు ఉపక్రమించారు. ఇంతటి వ్యయప్రయాసాలకు ఓర్చి సాగు చేస్తే ప్రభుత్వం ప్రోత్సాహక ధరను పెంచకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సన్నగిల్లిన ఆశలు
Published Wed, Oct 23 2013 1:43 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement