పుట్టగొడుగుల పెంపకం ఇలా..
పుట్టగొడుగులను వరిగడ్డి, చిట్టు, తవుడు, చెరకు దవ్వ, జొన్నచొప్ప లాంటి ఏ రరమైన వ్యవసాయ పదార్థాల పైనైనా పెంచవచ్చు. వీటిలో లిగ్నిస్, సెల్యులోజ్ అధికంగా ఉంటుంది. పెంచే పద్ధతి కూడా చాలా సులువైనది. ప్రారంభ పెట్టుబడి తక్కువగానే ఉంటుంది.
ఏమేం సామగ్రి కావాలంటే..
పూరిపాక, గది లేక పక్కా షెడ్, వినియోగంలోని కోళ్ల షెడ్ అయినా ఫర్వాలేదు. గడ్డి కత్తిరించడానికి కట్టర్, వేలాడదీయడానికి ఏర్పాటు అంటే పైకప్పుకు కడ్డీలు లేక కొక్కేలు లేక 3-4 అరలున్న చెక్క ర్యాక్, గడ్డిని ఉడకబెట్టడానికి పెద్ద పాత్ర, నాణ్యమైన స్పాన్(పుట్టగొడుగుల విత్తనం) బెడ్స్‌పై గదిలో ఇసుక, గోనె సంచులపై నీరు చల్లడానికి స్ప్రేయర్లు, మంచి ఎండుగడ్డి, జొన్పచొప్ప, వరి ఊక, బెడ్స్ తయారీకి పాలిథిన్ సంచులు, సంచుల మూతులు కట్టడానికి దారం లేక రబ్బరు బ్యాండ్లు, థర్మామీటర్, హైగ్రోమీటర్(ఆర్ధ్రతా మాపకం), చేతులు శుభ్రం చేసుకునేందుకు దూది, స్పిరిట్ లేదా డెటాల్, ఫార్మాలిన్ ద్రావణం అవసరమవుతాయి.
సబ్‌స్ట్రాట్(ఆధారం) తయారు చేసే పద్ధతి
నీటిలో ఉడకబెట్టడం ద్వారా సబ్‌స్ట్రాట్‌ని స్టెరిలైజ్ చేయవచ్చు. తాజా వరిగడ్డి లేక మరే ఇతర వ్యవసాయ వ్యర్థాన్ని తీసుకుని 2-3 అంగుళాల పొడవున్న ముక్కలుగా కత్తిరించాలి. ఆ ముక్కలను 12-18 గంటల పాటు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత శుభ్రమైన నీటిలో కడగాలి. గడ్డి ముక్కలను స్టెరిలైజ్ చేసేందుకు.. మరుగుతున్న నీరున్న పాత్రలో 30 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అనంతరం వాటిని తీసి చాపలపై పరచాలి.
బెడ్స్ తయారీ..
బెడ్స్ తయారీకి పాలిథిన్ సంచులు వాడాలి. 12ఁ18 అంగుళాలు లేదా 100జీ మందంతో 14ఁ24 అంగుళాలు ఉండాలి. గాలి వెళ్లేందుకు వీలుగా పాలీథిన్ సంచులకు 9-15 రంధ్రాలు చేయాలి. చేతులను డెట్టాల్ లేదా స్పిరిట్‌తో శుభ్రం చేసుకోవాలి. స్టెరిలైజ్ చేసిన గడ్డిముక్కలను పొరలు పొరలుగా బ్యాగ్‌లో నింపాలి. ఎక్కడా ఖాళీ లేకుండా గుండ్రంగా ఉండేలా గడ్డిని నొక్కాలి. గుప్పెడు విత్తనాలను(40 గ్రాములు) బెడ్ ఉపరితలంపై ఒకే రీతిలో చల్లాలి. ఈ విధంగా 4-5 పొరలు తయారు చేయాలి. బ్యాగ్ మూడొంతులు నిండాక విత్తనాలను మరోసారి ఉపరితలమంతటా సమంగా చల్లాలి. తర్వాత బ్యాగును దారం లేదా రబ్బరు బ్యాండుతో బిగించి కట్టి, తేదీ రాసిన లేబుల్ అతికించాలి.
ఇంక్యుబేషన్, క్రాపింగ్
బెడ్స్‌తో కూడిన సంచులను చీకటిగా ఉన్న గదిలో వేలాడదీయడమో లేదా షెల్ఫ్ పై పెట్టడమో చేయాలి. ఆ విధంగా ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. వ్యాధులు, పురుగులను నివారించవచ్చు. ఇంటిలో ఒకమూల భాగాన్నయినా ఇందుకోసం వాడుకోవచ్చు. బెడ్స్‌పై ఉన్న సంచులను ర్యాక్‌లపై ఉంచాలి లేదా కొక్కేలకు వేలాడదీయాలి. 18-25 రోజులపాటు బెడ్స్‌ను ఉంచాలి. ఇంక్యుబేషన్ కాలంలో పాలిథిన్ సంచులలోని బెడ్స్‌పై తెల్లని నూలుదారాల వంటి మైసీలియంలు పెరగడం కనిపిస్తుంది.
అప్పుడు ప్లాస్టిక్ కవరును తొలగిస్తే పుట్టగొడుగులు పెరగడానికి వీలుంటుంది. బెడ్స్‌లో తేమ ఉండేలా అప్పుడప్పుడు నీరు చిలకరిస్తూ ఉండాలి. 5-6 రోజుల తర్వాత బెడ్స్ అంతటా సూదిమొనంత ఉన్న పుట్టగొడుగులు కనిపిస్తాయి. 7 నుంచి 10 రోజుల్లో మొదటి పంట కోతకు సిద్ధంగా ఉంటుంది. రేకులు పూర్తిగా విచ్చుకుని అంచులు పలచబడితే ఆ పుట్టగొడుగులు కోతకు వచ్చినట్లే. వాటిని అడుగున కొద్దిగా మెలితిప్పి కాండంతో సహా గిల్లివేయాలి. ఒక్కో దిగుబడిని ప్లస్ అంటారు. వారానికి ఒకసారి కోయాలి. ఒక్కో బెడ్ నుంచి కనీసం 2-3 పంటలను తీయవచ్చు. ఒక్కో బెడ్ నుంచి 500 నుంచి 800 గ్రాముల పుట్టగొడుగులను పొందవచ్చు. తర్వాత బెడ్‌ను తీసివేసి మొక్కలకు ఎరువుగా ఉపయోగించుకోవచ్చు.
పుట్టగొడుగుల్లో రకాలు
పుట్టగొడుగుల్లో తినేందుకు వీలైన జాతులు దాదాపు 2 వేల వరకు ఉన్నాయి. వాటిలో మూడు జాతులను మనదేశంలో పెంచుతున్నారు. అవి వైట్ బటన్(అగారికస్ స్పీషిస్), అయిస్టర్ లేక థింగ్రీ(ఫెయిరోటస్ స్పీషిస్), చైనీస్(ఓల్వోరిల్లా స్పీషిస్).
వైట్ బటన్ : దీనిని యూరోపియన్ లేక సమశీతోష్ణ(టెంపరేట్) పుట్టగొడుగులు అని కూడా అంటారు. వీటి పెంపకానికి 15-18 డిగ్రీల సెంటిగ్రేడ్ నియంత్రిత ఉష్ణోగ్రత కావాలి. అందుకోసం ఇన్సులేటెడ్ గదులు, ఏసీ ఫ్లాంట్, హ్యుమిడిఫైయర్, ఏహెచ్‌యూ లాంటి యంత్రాలు అవసరం. అందువల్ల పెట్టుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. పెంపకానికి సాంకేతిక నైపుణ్యం అవసరం. ఈ రకాన్ని సాధారణంగా చల్లగా ఉండే కొండ ప్రాంతాల్లో పెంచుతారు. మన రాష్ర్టంలో మైదాన ప్రాంతాల్లో శీతాకాలంలో పెంచుతుంటారు.
అయిస్టర్(ముత్యపుచిప్ప) : ఈ రకం పుట్టగొడుగులను చౌకగా లభించే రకరకాల వ్యవసాయ వ్యర్థ పదార్థాలపై పెంచవచ్చు. ఉష్ణోగ్రత 25-32 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండాలి. తేమ శాతం 75-85 ఉండాలి. ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఈ రకాలను మన రాష్ట్రంలో పెంచుకోవచ్చు.
చైనీస్ : ఈ రకానికి 35-38 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత, 80-90 శాతం తేమ అవసరం. అత్యధిక ఉష్ణోగ్రత అవసరమైనందున ఈ రకాన్ని వేసవిలో పెంచుకోవచ్చు.
పుట్టగొడుగులు పెంచుదామా..
Published Thu, Nov 27 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM
Advertisement
Advertisement