కొత్త కూర్పు.. భారీ కుదుపు! | The new version is a huge jerk ..! | Sakshi
Sakshi News home page

కొత్త కూర్పు.. భారీ కుదుపు!

Published Fri, Apr 1 2016 11:42 PM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM

కొత్త కూర్పు..   భారీ కుదుపు!

కొత్త కూర్పు.. భారీ కుదుపు!

ఏపీఈపీడీసీఎల్ సీజీఎంల బాధ్యతల్లో మార్పులు
ఒకే రోజు కదిలిన నలుగురు ఉన్నతాధికారుల కుర్చీలు
జీఎం స్థాయి అధికారికి సీజీఎంగా పదోన్నతి.. కీలక బాధ్యతలు
పలు వివాదాలు, పనితీరు కారణమనే అనుమానాలు
మార్పులపై డిస్కమ్ పరిధిలో విస్తృత చర్చ

 


డిస్కమ్ కేంద్రస్థానంలో అత్యంత కీలకమైన బాధ్యతలు కొత్తగా పదోన్నతి పొందిన అధికారికి అప్పగింత.. నలుగురు సీజీఎంలకు ఉన్నపళంగా బాధ్యతల మార్పు.. ఒకేరోజు జరిగిన ఈ భారీ మార్పులు తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్)ను కుదిపేశాయి. ఎందుకిలా ఒక్కసారి భారీ మార్పులని ఆరా తీస్తే.. ఆరోపణలు, వివాదాలు ముసురుకోవడమే కారణమని స్పష్టమవుతోంది. భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు వంటి కీలక ప్రాజెక్టులు చేపట్టనున్న తరుణంలో జరిగిన ఈ భారీ మార్పులు సంస్థలో చర్చనీయాంశమయ్యాయి.

 

విశాఖపట్నం : ఈపీడీసీఎల్ ఉన్నతాధికారుల బాధ్యతల్లో భారీ మార్పులు జరిగాయి. ఉన్నతాధికారుల పనితీరు, వారిపై ఉన్న వివాదాల నేపథ్యంలో భవిష్యత్ ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకుని సంస్థ సీఎండీ ఆర్.ముత్యాలరాజు భారీ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. నలుగురు చీఫ్ జనరల్ మేనేజర్ల(సీజీఎం)ను వారు ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతల నుంచి తప్పించి కొత్త బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో కార్పొరేట్ కార్యాలయం జనరల్ మేనేజర్‌కు సీజీఎంగా పదోన్నతి కల్పించడంతోపాటు అత్యంత కీలక బాధ్యతలు అప్పగించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ మార్పులు డిస్కమ్‌లో కలకలం సృష్టించాయి.

 
ఆరోపణలు.. వివాదాలు

ఈపీడీసీఎల్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 54,11,997 మంది వినియోగదారులున్నారు. ఏటా వేల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే అంతే స్థాయిలో అవినీతి పెరుగుతోందన్న ఆరోపణలూ ఉన్నాయి. కింది స్థాయి లైన్‌మెన్ నుంచి, ఏఈ, ఏడీఈ, డీఈ, జీఎం, సీజీఎం వరకూ అన్ని స్థాయిల వారిపై ఆరోపణలకు కొదవ లేదు. అయితే సీజీఎం స్థాయి అధికారులపై ఆరోపణలు రావడం అరుదుగా జరుగుతుంటుంది. కానీ ప్రస్తుతం స్థానచలనం పొందిన నలుగురిలో ఒక సీజీఎం నిత్యం వివాదాల్లోనే ఉంటుంటారు. గతంలో సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా పనిచేసిన చోట కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాంటి వ్యక్తి ఏడాదిన్నరగా సీజీఎం హోదాలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనపై తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొన్ని విద్యుత్ ఉద్యోగుల సంఘాలు ఆరోపణలు చేశాయి. ఓ మహిళా అధికారి విషయంలో ఆయన అనుచితంగా కల్పించుకున్నారనే ఆరోపణల నేపధ్యంలో పలు విచారణలు కూడా జరిగాయి. ఆయన ఇంకా ఆ పదవిలో ఉంటే భవిష్యత్‌లో విశాఖలో చేపట్టబోయే భూగర్భ విద్యుత్ కేబుల్ ప్రాజెక్టుపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించినట్లు సమాచారం. ఆయన స్థానంలో ఓ జీఎంకు సీజీఎంగా పదోన్నతి కల్పించి నియమించారు. డిస్కమ్ కేంద్ర కార్యాలయంలో అత్యంత కీలక స్థానంగా భావించే చోట సీనియర్లను కాదని కొత్త వ్యక్తిని తెచ్చిపెట్టడం చర్చనీయాంశమైంది. ఇక మరో సీజీఎంపైనా ఇటీవల పలు ఆరోపణలు వచ్చాయి. విద్యుత్ చార్జీల పెంపుపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆయనపై పరోక్షంగా ప్రజాసంఘాలు విరుచుకుపడ్డాయి. దీంతో ఆయనను కూడా ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించారు. అన్ని విషయాల్లోనూ అత్యంత పక్కాగా వ్యవహరించే ప్రపంచ బ్యాంకు బాధ్యతలను ఆయనకు అప్పగించారు. పెద్దగా ప్రాధాన్యం లేని మరో బాధ్యత కూడా ఇచ్చారు. దీంతో ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేసినట్లయ్యింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై వస్తున్న అనేక ఆరోపణల నేపథ్యంలో ఆ బాధ్యతలను ప్రస్తుతం ప్లానింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీజీఎంకు అదనంగా ఇచ్చారు. ఇక ఎప్పుడూ అప్రధాన్య బాధ్యతల్లోనే ఉండే మరో సీజీఎంకు మళ్లీ అలాంటి పనినే అప్పగించారు.

 

‘ఏపీఈపీడీసీఎల్’ పదోన్నతులు

ఏపీఈపీడీసీఎల్‌లో ముగ్గురు అధికారులకు పదోన్నతి కల్పిస్తూ సీఎండీ ఆర్.ముత్యాలరాజు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమర్షియల్ విభాగంలో జనరల్ మేనేజర్‌గా ఉన్న పీవీవీ సత్యనారాయణకు చీఫ్ జనరల్ మేనేజర్‌గా పదోన్నతి ఇచ్చి ఐదు జిల్లాల ఆపరేషన్స్ బాధ్యతలు అప్పగించారు. రామగుండం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 1984లో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా బాధ్యతలు చేపట్టి విద్యుత్ విభాగంలో అడుగుపెట్టిన ఆయన పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో వివిధ స్థాయుల్లో విధులు నిర్వర్తించారు. రెండేళ్లుగా జీఎంగా ఉన్నారు. ఇక విశాఖ కార్పొరేట్ కార్యాలయంలో డీఈగా ఉన్న పి.సంజీవరావుకు సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా పదోన్నతి లభించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో డీపీఈ-1 ఏడీఈగా పనిచేస్తున్న బి.వీరభద్రరావుకు డీఈగా పదోన్నతి కల్పించి విశాఖ కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ చేశారు. కార్పొరేట్ కార్యాలయంలో సీజీఎంలు, జీఎంల ప్రస్తుత బాధ్యతల్లో మార్పులు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement