ధరల పెరుగుదలతో దుర్భరం
పీసీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ
ఆనందపేట (గుంటూరు)/గుంటూరు ఈస్ట్ : రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుకుని సామాన్యుడి జీవితం దుర్భరంగా మారిందని ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కేజీ రూ.60 ఉన్న కందిపప్పు, నేడు రూ.150కు చేరడం తెలుగుదేశం పార్టీ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు.
కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, నగర అధ్యక్షుడు షేక్ మస్తాన్‌వలి, మహిళ కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు బిట్రగుంట మల్లిక, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్, వణుకూరి శ్రీనివాసరెడ్డి, సవరంరోహిత్, మొగలి శివకుమార్ పాల్గొన్నారు.
పాలన దళారులకు అప్పజెప్పారు!
గుంటూరు ఈస్ట్ :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాన్యుల సమస్యలు పక్కన పెట్టి రాష్ట్రాన్ని టీడీపీ దళారులకు అప్పచెప్పారని పీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ దుయ్యబట్టారు. గుంటూరులో ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ దళారులు నిత్యావసర సరుకులను బ్లాక్ మార్కెటింగ్ చేస్తుంటే ప్రభుత్వం చూసీచూడనట్టు పోతోందని విమర్శించారు. సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి మానస్, మాజీ ఎమ్యెల్యే మస్తాన్ వలీ తదితరులు మాట్లాడారు.