- తండ్రి మృతి.. చావుబతుకుల మధ్య తల్ల్లీకుమారుడు
- ఎస్‌ఐబీ వేధింపులే కారణమని సూసైడ్ నోట్‌లో వెల్లడి
హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : అజ్ఞాతం వీడి జనారణ్యంలో కలిసినా అతడిని పోలీసులు వదలలేదు. అరెస్టయిన ఓ మాజీ మావోయిస్టును స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్‌ఐబీ) పోలీసులు వెంటాడి వేటాడారు. కుట్ర చేసి మావోయిస్టు అగ్రనేతలను హతమార్చాలని హింసించారు. పోలీసుల ఒత్తిళ్లకు లొంగిపోలేక, ఉద్యమానికి ద్రోహం చేయలేక అతడు తల్లిదండ్రులకు విషమిచ్చి తాను తాగాడు. చికిత్సపొందుతూ తండ్రి మృతి చెందగా, తల్లి, కుమారుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మండలంలోని మునిపల్లిలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
మునిపల్లికి చెందిన దార వీరయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు సారయ్య సీపీఐ(మావోయిస్ట్)తో గతంలో ప్రత్యక్ష, పరోక్షంగా సంబంధాలు కలిగి ఉన్నాడు. ఆయన పార్టీలో 1997 నుంచి 2004 వరకు పనిచేసి లొంగిపోయూడు. రెండేళ్లపాటు సారయ్య పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే 2006లో దేవన్నపేటకు చెందిన ఆవుల కట్టయ్యను మావోయిస్టులు హతమార్చారు. ఈ హత్య తర్వాత పోలీసుల వేధింపులు పెరగడం తో సారయ్య అజ్ఞాతంలోకి వెళ్లాడు. మళ్లీ 2009లో పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తు తం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే అతడు మళ్లీ మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నాడనే నెపంతో ఎస్‌ఐబీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిసింది. విచారణ సందర్భంగా వారు చిత్రహింసలకు గురిచేయడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం. అనంతరం అతడిని వదిలేయడంతో రెండు రోజులక్రితం సారయ్య వైన్‌షాపులో మద్యం కొనుగోలు చేశాడు. అందులో క్రిమిసంహారక మందు కలిపాడు.
నేరుగా ఇంటికి వెళ్లి గ్లాసులు తీసుకుని ముందుగా ఒక గ్లాస్‌లో మందు పోసి తండ్రికి, అ తర్వాత తల్లికి ఇచ్చాడు. అనంతరం తాను తాగాడు. కొద్దిసేపటికి ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చుట్టుపక్కలవారు గమనించి వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన సేవల కోసం నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ తండ్రి వీరయ్య మృతిచెందగా, తల్లి, కూతురు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
పార్టీకి ద్రోహం చేయలేక... ఆత్మహత్య
లేఖలో దార సారయ్య వెల్లడి
ఈనెల 7న ఎస్‌ఐబీ పోలీసులు సారయ్యను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఎస్‌ఐబీ ఐజీ, ఎస్‌ఐబీ ఎస్పీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సారయ్యను చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిసింది. మావోయిస్ట్ నేతలు హరిభూషణ్, దామోదర్, ప్రభాకర్‌ను హతమార్చాలని బెదిరింపులకు గురిచేశారు. ముగ్గురు నేతలు నిన్ను బాగా నమ్ముతారు. విషం కలిపిన లడ్డూలు తీసుకెళ్లి వారికి తినిపించు. లేకుంటే నిన్ను కూడా గంటి ప్రసాద్, ఆకుల భూమయ్యలాగా చంపుతామని బెదిరించినట్లు సారయ్య రాసిన సూసైడ్ నోట్‌లో వివరించాడు.
పోలీసుల చిత్రహింసలతో కాలికి బలమైన గాయమైనట్లు లేఖలో పేర్కొన్నాడు. చిత్రహింసలకు తట్టుకోలేక పార్టీకి ద్రోహం చేయలేక తల్లిదండ్రులతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించినట్లు సారయ్య వివరించాడు. తమ చావుకు ఎస్‌ఐబీ పోలీసులే కారకులని అందులో పేర్కొన్నారు.