
ఛీ ఛీ కెమెరాలు..
తిరుమలలో సీసీ కెమెరాల పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
► సీసీ కెమెరాల పనితీరు అంతంత మాత్రమే
► తిరుమల భద్రతపై ఆందోళన
► హెచ్చరికలున్నా పట్టని టీటీడీ
► తాజా కిడ్నాప్‌తో సీసీ కెమెరాల తీరుపై అందరి దృష్టి
► కొండపై రూ.62 కోట్ల ప్రాజెక్టు ఏమైనట్టు?
నిత్యం 70వేలకు పైగా భక్తులు సందర్శించే తిరుమలలో భద్రత కొరవడిందా.. నిఘా పర్యవేక్షణ లోపించిందా.. ఇక్కడున్న సీసీ కెమెరాల పని తీరు అంతంతమాత్రమేనా.. ఈ ప్రశ్నలకు తరచూ ఎదురవుతున్న సంఘటనలు ఔననే సమాధానం చెబుతున్నాయి. అతి పెద్ద హిందూ ధార్మిక సంస్థ పరిధిలో సాదాసీదా కెమెరాలు ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా బుధవారం పసిబిడ్డ కిడ్నాప్ ఘటనతో వీటి డొల్ల్లతనం మరోసారి బయటపడింది.
సాక్షి,తిరుమల: తిరుమలలో సీసీ కెమెరాల పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. భద్రతలో కీలక భూమిక పోషించాల్సిన ఈ పరికరాలు మొక్కుబడిగా నిలుస్తున్నాయి. తిరుమలకు రోజూ వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఇప్పటికే పలు ఉగ్రవాద సంస్థల కన్ను దీనిపై ఉందని కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈనేపథ్యంలోనే యువ కమాండోలతో కూడిన ఆక్టోపస్ యూనిట్‌ను నెలకొల్పారు. ఆర్మ్‌డ్ రిజర్వు బలగాలు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు (ఎస్‌పీఎఫ్) సిబ్బంది సంఖ్యను కూడా పెంచారు. ఆలయం చుట్టూ ఇన్నర్‌సెక్యూరిటీ కార్డాన్ పూర్తి చేశారు. అటవీ మార్గాలను కలుపుతూ ఔటర్ సెక్యూరిటీ కార్డాన్ పనులు సర్వే దశలో ఉన్నాయి.
ఈ చర్యలు బాగానే ఉన్నా భద్రత విషయంలో తరచూ ఆందోళన వ్యక్తమవుతోంది. కోట్లు ఖర్చుచేస్తున్నా ఫలితాలు మాత్రం కనిపించడంలేదు. ఆలయం, పురవీధులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లు, కల్యాణకట్ట, అన్నప్రసాద భవనం, యాత్రిసదన్లలో ప్రస్తుతం 600 సీసీ కెమెరాలున్నాయి. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం, విష్ణునివాసం, శ్రీనివాసం, ఇతర ప్రాంతాల్లో మరో 400 ఉన్నాయి. ఇవన్నీ ఆన్ ఇంటెర్నెట్ ప్రోటోకాల్ (ఐపీ కెమెరా) సాంకేతిక పద్ధతుల్లో రూపొందించిన కెమెరాలే. ఇవి రికార్డు చేసే దృశ్యాలు విస్తరించాల్సి వస్తే స్పష్టత లోపిస్తోంది. వీటిపరిధి సామర్థ్యం తక్కు వ. 360 డిగ్రీల పరిధిలో ఉన్న దృశ్యాలను మాత్రమే రికార్డు చేయగలవు.
రూ.62 కోట్లతో 1720 సీసీ కెమెరాల ప్రాజెక్టు ఏమైంది?
రూ.62 కోట్లతో 1720 అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2012లోనే టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఫేసియల్ రికగ్నేషన్ సిస్టం, సస్పీషియస్ అల్లారింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ నంబర్‌ప్లేట్ రికగ్నేషన్‌సిస్టం(ఏఎన్‌ఆర్‌పీ), సిట్యువేషన్ మేనేజ్‌మెంట్‌సిస్టంతో అనుసంధానమైన కెమెరాలు ఏర్పాటు చేయాలన్నదే ఈ ప్రాజెక్టు లక్ష్యం. తిరుమల, తిరుపతిలోని అన్ని సీసీ కెమెరాలనూ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి భద్రతను కట్టుదిట్టం చేయాలని సంకల్పించారు. అప్పటి ఈవో ఎల్‌వీ సుబ్రమణ్యం, సీవీఎస్‌వో జీవీజీ అశోక్‌కుమార్ ముంబయి, ఢిల్లీలో పర్యటించి ప్రాజెక్టును సిద్ధం చేశారు. తర్వాత ఎవరూ ఈ ప్రతిపాదనలను పట్టించుకోలేదు.
అస్పష్టంగా చెన్నకేశవులు కిడ్నాప్ సీసీ కెమెరా దృశ్యాలు
బుధవారం ఉదయం ఆలయం వద్దే ఓ జంట ఏడునెలల వయసున్న బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారు. కన్నవారి ఫిర్యాదుతో పోలీసులు రంగంలో దిగారు. సీసీ కెమెరా ఫుటేజీలో కిడ్నాప్ దృశ్యాలు గుర్తించారు. అయితే కిడ్నాప్ చేసిన జంట ఎవరు? అనేది ఆ దృశ్యాలు స్పష్టత ఇవ్వలేకపోయాయి. కిడ్నాపర్లు దర్జాగా చంటిబిడ్డను ఎత్తుకుని ఆలయం నుంచి కల్యాణకట్ట మీదుగా బస్టాండ్ వరకు నడుచుకుని వెళ్లి బస్సుద్వారా తిరుపతికి వెళ్లినట్లు తేలింది. ఈ క్రమంలో ఆలయం, రావిచెట్టు, బస్టాండ్ వద్ద మాత్రమే సీసీ కెమెరా దృశ్యాలు అస్పష్టంగా రికార్డయ్యాయి. నిందితులు ఎవరనేది పోలీసులు గుర్తించలేకపోయారు. జనవరి 29వ తేదీన యాత్రిసదన్ 2లో నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారి నవ్యశ్రీని అపహరించుకుని వెళ్లిన దృశ్యాలు కూడా ఇదే తరహాలోనే అస్పష్టంగా కనిపించాయి. అనుకోని ఘటన జరిగితే? నిందితులనెలా గుర్తిస్తారనేది భద్రతాధికారులకే తెలియాలి.