నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి రిజర్వాయర్ లో శవమై తేలిన ఘటన అనంతపురం జిల్లా లో జరిగింది. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం మండలం కాపర్లపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. కాగా.. శనివారం రోజు జీడిపల్లి రిజర్వాయర్ లో మృతి చెంది కనిపించాడు.
మృతుడిని గ్రామానికి చెందిన ఎర్రస్వామి(45)గా గుర్తించారు. మృతుడిని గుర్తు తెలియని దుండగులు హతమార్చి.. గోనెసంచిలో పెట్టి జీడిపల్లి రిజర్వాయర్ లో పడేశారు. నీటిలో గోనె సంచి గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. మృతుడి హత్యకు గల కారణాలు తెలియరాలేదు.