చినగంజాం, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలకు రాష్ట్రం బలైపోతోందని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా చినగంజాంలో రెండో రోజు ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన బుధవారం సందర్శించి దీక్షాధారులకు సంఘీభావం తెలిపారు. అనంతరం బాలాజీ మాట్లాడుతూ సోనియా రాజకీయ అవసరాల కోసం, రాహుల్ ను ప్రధానిని చేయాలనే స్వార్థంతో కలసి ఉన్న రాష్ట్రాన్ని రెండుగా చీల్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో రెండు రాష్ట్రాల్లో సాగు, తాగునీరు, మౌలిక వసతుల గురించి ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదన్నారు.
విజయమ్మను విమర్శించే అర్హత బొత్సకు లేదు:
వైఎస్ విజయమ్మను విమర్శించే అర్హత పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు ఏమాత్రం లేదని నూకసాని బాలాజీ అన్నారు. విజయమ్మ రాజకీయ నాటకానికి తెరలేపారని బొత్స విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్‌ఆర్ దయాదాక్షిణ్యాలపై బతికి బట్టకట్టిన బొత్సకు నేడు వైఎస్ సతీమణి విజయమ్మ చేసే దీక్ష గురించి విమర్శించే హక్కులేదన్నారు. బ్రాందీ షాపుల దగ్గర తాగి మాట్లాడే తాగుబోతు మాదిరిగా ఉదయం ఒక మాట, సాయంత్రం ఇంకోమాట సంబంధం లేకుండా మాట్లాడితే ప్రజలు నాలుక చీలుస్తారని హెచ్చరించారు. వైఎస్ విజయమ్మ గురించి బొత్స మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బుధవారం దీక్షా శిబిరంలో కూర్చొన్న వారిలో రంగని సుబ్బారెడ్డి, కొల్లాటి ఏడుకొండ లు, కుక్కల బురఖాయలు రెడ్డి, కోట రామకృష్ణారెడ్డి, దున్నా ఏడుకొండలు, బక్కా వెంకటేశ్వర్లు రెడ్డి, రాజు శ్రీనివాసరెడ్డి, పల్లెబోయిన అంకిరెడ్డి, ఆసోది నాగార్జున రెడ్డి, కుక్కల పిచ్చిరెడ్డిలను ఆయన కలిసి సంఘీభావం తెలిపారు. సాయంత్రం సంతరావూరు ఎంపీటీసీ సభ్యుడు కల్లి శ్రీనివాసరెడ్డి దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కోట విజయభాస్కర్ రెడ్డి, ఉప్పు కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ షేక్ జిలాని, అక్కల రామకృష్ణారెడ్డి, రత్నారెడ్డి, ధనరాజులు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ కుటిల రాజకీయాలకు రాష్ట్రం బలి
Published Thu, Aug 22 2013 7:00 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement