చదువు‘కొనే’ మాసంపెట్టు‘బడి’
- 12న పాఠశాలల పునః ప్రారంభం
- భారీగా పెరిగిన ఫీజులు, పుస్తకాల ధరలు
- పిల్లలకు పెట్టు‘బడి’ పెట్టాల్సిందే
- జూన్ అంటే హడలుతున్న తల్లిదండ్రులు
ప్రతి ఏటా జూన్ నెలలో పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. విద్యా వ్యాపారం జోరందుకుంటుంది. అదే సందర్భంలో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలవుతుంది. భారీగా పెరిగిన ఫీజులు, చదువుకు అవసరమైన వస్తువుల ధరలు చూసి సాధారణ, మధ్యతరగతి తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈసారి ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, షూలు, బ్యాగులు తదితరాల ధరలు భారీగానే పెరిగాయి. పట్టణ వాసులే కాకుండా గ్రామీణ ప్రాంతంలోని తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లోనే చదివిస్తున్నారు.
ప్రైవేటు పాఠశాలల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. మొత్తం మీద వీరి ఆసక్తిని గుర్తించిన ప్రైవేటు యాజమాన్యాలు ఏటా ఫీజులు మోత మోగిస్తున్నాయి. ఇంట్లో ఇద్దరు పిల్లల్ని చదివించాలంటే ఏడాదికి రూ.50 వేలకు పైగా అవసరమవుతోంది. సామాన్యుడికి ఇది చాలా భారమైనప్పటికీ పిల్లల భవిష్యత్తు కోసం అన్ని కష్టాలను మోస్తూనే ఉన్నారు.
ఈసారి 20 వేల కొత్త అడ్మిషన్లు
విద్యాశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు 824 ఉన్నా యి. గత ఏడాది ఈ పాఠశాలల్లో 2.5 లక్షల మంది విద్యను అభ్యసించారు. ఈసారి మరో 20 వేల కొత్త అడ్మిషన్లు ఖాయంగా కనిపి స్తోంది. ఆ లెక్కన 2.7 లక్షల మంది విద్యార్థు లు ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేటు విద్య ను అభ్యసించనున్నట్టు అంచనా. ఈ లెక్కల తో గణన చేస్తే జిల్లాలో విద్యా వ్యాపారం కోట్లలో జరుగుతున్నట్టు తెలుస్తోంది.
పెరిగిన ఫీజులు
స్కూళ్లను బట్టి ఎల్‌కేజీకి రూ.5 వేల నుంచి 25 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక అడ్మిషన్ ఫీజులైతే భారీగానే ఉన్నాయి. 7 నుంచి 10 తరగతులకు రూ.20 వేల నుంచి రూ. 50 వేలకు పైగా ఫీజు వసూలు చేస్తున్నా రు. గత టెన్త్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన పాఠశాలల్లో అయితే ఈసారి భారీగా ఫీజులు పెంచేశారు. స్కూల్ వ్యాను ఫీజులు ఓ విద్యార్థికి నెలకు రూ.2వేల పైమాటే. ఆ లెక్కన ఓ విద్యార్థికి సగటున అయ్యే ఖర్చు ఏడాదికి రూ. 30 నుంచి 50 వేల వరకు అవుతోంది.
రైతన్నలకు పెద్ద భారం
ఓ వైపు ఖరీఫ్ సీజన్‌లో పంట సాగుకు పెట్టుబడి పెట్టాలి. మరోవైదు పాఠశాల లు తెరుస్తుండడంతో పిల్లల చదువులకు వ్యయం చేయాలి. రైతులకు ఈనెల పెద్ద భారంగా మారింది. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న రైతులకు ఈ కష్టాలు మరింత పెరిగాయి. పిల్లల చదువు, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రైతులు కొత్త అప్పులకు సైతం వెళ్లాల్సిన పరిస్థితి. ఏదేమైనా అందరికంటే ఎక్కువగా నలిగి పోతున్నది సామాన్య రైతన్నలే.