ఇంకొల్లు మండలం సుబ్బారెడ్డిపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచిపట్టున్న గ్రామం. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ బలపరచిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
చీరాల, పర్చూరు, న్యూస్‌లైన్: ఇంకొల్లు మండలం సుబ్బారెడ్డిపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచిపట్టున్న గ్రామం. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ బలపరచిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో మొత్తం 640 మంది ఓటర్లున్నారు. అయితే తాజాగా గ్రామంలోని పోలింగ్ కేంద్రం నం.175 పరిధిలో ఏకంగా 159 ఓట్లు తొలగించారు. వీరి తొలగింపునకు సంబంధించి ఎలాంటి దరఖాస్తులు చేయలేదు. బీఎల్వో విచారణ కూడా చేపట్టలేదు. అయినా జాబితాలో ఓట్లు మాత్రం తీసేశారు. ఈ జాబితా చూసిన గ్రామస్తులు అవాక్కయ్యారు. అన్ని విధాలా
అర్హత ఉన్నా ఓట్లు తొలగించడంపై పోలింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. బుధవారం పర్చూరు తహసీల్దార్ కార్యాలయానికి గుర్తింపు కార్డులతో వచ్చి నిరసనకు దిగారు.
వేటపాలెం మండలం వడ్డెరసంఘం, ప్రసాద్‌నగరంలోని 141వ నంబరులోని పోలింగ్ బూత్‌లో మొత్తం 948 ఓట్లు ఉండగా ఎలాంటి కారణం చూపకుండా వరుసగా 470 మంది ఓట్లను తొలగించారు.
చీరాల రూరల్ మండలం గవినివారిపాలెం గ్రామంలో గత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన 350 మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయి.
చీరాల పట్టణంలోని పదో వార్డుకు చెందిన షేక్ సుబాని రెండుసార్లు మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశాడు. అతని ఓటును తీసేశారు.
పాపాయిపాలేనికి చెందిన వార్డు సభ్యుడు ఆతిని చినవెంకటేశ్వర్లు ఓటూ జాబితాలో గల్లంతైంది. అదే గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ భర్త గవిని పోతురాజు గత పంచాయతీ ఎన్నికల్లో ఓటువేశాడు. ప్రస్తుతం ఓట్ల జాబితాలో ఆయన పేరు లేదు.
ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా పల్లె..పట్నం అన్న తేడా లేకుండా బతికున్న వారిని చనిపోయినట్లుగా చూపడంతో పాటు ఏ కారణం లేకుండా వేలాది ఓట్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. అధికార పార్టీకి అనుకూలంగా లేని వారి ఓట్లనే ఎక్కువగా తీసేశారు. అధికార పార్టీ అండదండలున్న అధికారులు, సిబ్బంది ప్రమేయంతోనే ఈ ఓట్లు తొలగించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఓట్ల తొలగింపుపై అధికారులు, బూత్‌లెవల్ ఆఫీసర్లు చెబుతున్న మాటలు వింటే ఎవరైనా విస్తుపోవాల్సిందే. గవినివారిపాలెంలోని 23వ బూత్‌కు బూత్‌లెవల్ అధికారిగా ఉన్న ప్రేమ్‌కుమార్ ఏం చెబుతున్నారంటే తన బూత్ పరిధిలో కేవలం నాలుగు ఓట్లు మాత్రమే తిరస్కరించినట్లు నివేదిక ఇచ్చానని, కానీ జాబితా వచ్చాక చూస్తే 20 ఓట్లు తిరస్కరించినట్లు ఉందని చెప్పారు. ఓట్ల తొలగింపునకు, తనకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు.
చీరాల తహసీల్దార్ బీ సాంబశివరావు నియోజకవర్గంలో 4,500 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయని, అందులో 2 వేల ఓట్లను బూత్‌లెవల్ అధికారులు, వీఆర్వోలు ఇచ్చిన నివేదికల మేరకే తొలగించామని చెప్పారు. మిగిలిన ఓట్లు తాము తొలగించకపోయినా జాబితాలో తొలగించినట్లుగా రావడం తమకే అర్థం కావడం లేదన్నారు. కంప్యూటర్‌లో సాంకేతిక లోపం కావచ్చని అనడం చూస్తే ఓట్ల వ్యవహారంలో జరిగిన అక్రమాలు ఇట్టే స్పష్టమవుతున్నాయి. చీరాల రూరల్ గ్రామాలైన అక్కాయిపాలెం, గవినివారిపాలెం, పాపాయిపాలెం, బోయినవారిపాలెం, దేవినూతల, దేశాయిపేటల్లో అధికంగా ఓట్లు గల్లంతయ్యాయి.
చీరాల నియోజకవర్గంలో చీరాల పట్టణంతో పాటు చీరాల రూరల్, వేటపాలెం మండలాల్లో మొత్తం 198 పోలింగ్ కేంద్రాలున్నాయి. నియోజకవర్గంలో 1,78,502 మంది ఓటర్లున్నారు. పంచాయతీ ఎన్నికల అనంతరం ఎన్నికల కమిషన్ కొత్త ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఓట్ల నమోదు కార్యక్రమం డిసెంబర్‌తో ముగిసింది. అయితే కొత్త ఓటరు జాబితాను స్థానిక అధికారులు బయట పెట్టడంలేదు. కేవలం ప్రతిపక్ష పార్టీలకు హైదరాబాద్ నుంచి ఓటర్ల జాబితాలు అందాయి. వీటిని పరిశీలించిన నాయకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తల ఓట్లతో పాటు అక్కడక్కడా టీడీపీకి చెందిన వారి ఓట్లు సైతం తొలగించారు. అయితే మొత్తం ఎన్ని వేల ఓట్లు తొలగించారని అధికారికంగా తేలకపోయినా పది వేలకు పైగా ఓట్లు తొలగించినట్లు సమాచారం. ముఖ్యంగా గత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలకు వ్యతిరేకంగా ఓట్లు వేసిన వారి ఓట్లు తొలగించిన జాబితాలో అధికంగా ఉన్నాయి. దీంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన లకు సిద్ధమవుతోంది. కేవలం అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ ఓట్ల జాబితా రూపొందిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ వ్యవహారంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పాలేటి రామారావు, కార్యకర్తలు ఇప్పటికే మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు ఉడ్‌నగర్‌లోని స్థానిక తహశీల్దార్ ఇంటిని ముట్టడించి ఆందోళన నిర్వహించారు. తమ ఓట్లను ఎందుకు తొలగించారో చెప్పాలని మాజీ మంత్రి పాలేటి రామారావు డిమాండ్ చేశారు. అలానే నియోజకవర్గంలో జరిగిన ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్‌తో పాటు కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు.
వైఎస్సార్ సీపీ కార్యకర్తలే లక్ష్యంగా...
పర్చూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఓట్లే లక్ష్యంగా తొలగించినట్లు తేటతెల్లమవుతోంది. 500 ఓటర్లకు మించి లేని గ్రామాల్లో సైతం వంద ఓట్లకుపైగా తొలగించడం..పంచాయతీల్లో ఉన్న ఓట్లలో కూడా వందల సంఖ్యలో ఓట్లు జాబితాల్లో మాయం కావడంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఆగ్రహం పెళ్లుబికింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కలిపి మొత్తం 1828 ఓట్లు తొలగించారు. వీటిల్లో అధిక శాతం వైఎస్సార్ సీపీకి పట్టున్న గ్రామాలే కావడం గమనార్హం. దళితుల ఓట్లు కూడా అధిక సంఖ్యలో తొలగింపుల జాబితాలో చేరాయి.
ఇలాంటి సంఘటనే పర్చూరు మండలం రమణాయపాలెంలో కూడా చోటుచేసుకుంది. ఈ గ్రామంలో 485 మంది ఓటర్లకు గాను 121 ఓట్లు ఎలాంటి దరఖాస్తులు, విచారణ లేకుండా తొలగించారు. వాటిలో పది ఓట్లు మరణించిన వారివి కాగా మిగతా ఓటర్లందరూ నూరుశాతం అర్హులే. చిన్న గ్రామంలో ఒకేసారి 111 మందిని జాబితాలో తొలగించడాన్ని బట్టి చూస్తే సైబర్ నేరం ఏ స్థాయిలో జరిగిందో తేటతెల్లమవుతోంది.
ఇదే విధంగా పర్చూరు మండలంలోని నూతలపాడు, బోడవాడ, ఉప్పుటూరు, ఇంకొల్లు మండలంలోని భీమవరం, ఇడుపులపాడు, గొల్లపాలెం, ఇంకొల్లు, మార్టూరు మండలంలోని కోలలపూడి, కోనంకి, నాగరాజుపల్లి, ఇసుకదర్శి, మార్టూరు, వలపర్ల, యద్దనపూడి మండలంలోని యద్దనపూడి, జాగర్లమూడి, చినగంజాం మండలంలో మున్నంవారిపాలెం, రాజుబంగారుపాలెం, కారంచేడు మండలంలోని స్వర్ణ, యర్రంవారిపాలెం గ్రామాల్లో ఓటర్ల జాబితాల్లో భారీగా ఓట్లు తొలగించారు.
అసలేం జరిగిందంటే...
ఆన్‌లైన్ ఓటరు తొలగింపులు, సవరణలు, చేర్పులకు సంబంధించిన పాస్‌వర్డ్ ఆధారంగానే ఈ తతంగం జరిగినట్లు నిర్ధారణవుతోంది. కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ సిబ్బంది ద్వారానే అక్రమాలు జరిగాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 23 నాటికి వచ్చిన దరఖాస్తులన్నింటినీ బీఎల్వోలు విచారించి ఇచ్చిన జాబితాపై 31న తుదిజాబితా రూపొందించారు. ఈ మధ్యకాలంలో దరఖాస్తులు, బీఎల్వోల విచారణతో పనిలేకుండానే ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించారు. కొన్ని చోట్ల చేర్పులు కూడా జరిగాయి.
ఇప్పటికే అధికారులు నిర్ధారించిన దాని ప్రకా రం మార్టూరు మండలంలో 715, యద్దనపూడి మండలంలో 30, పర్చూ రు మండలంలో 178, కారంచేడు మండలంలో 50, ఇంకొల్లు మండలంలో 624, చినగంజాం మండలంలో 231 ఓట్ల చొప్పున సైబర్ నేరం ద్వారా తొలగించినట్లు ధ్రువీకరించారు.
లోపాలు జరిగిన మాట వాస్తవమే...
జిల్లా ఎలక్ట్రోరల్ అధికారి కే మోహన్‌కుమార్
ఎన్నికల జాబితాల్లో లోపాలు జరిగిన మాట వాస్తవమేనని జిల్లా ఎలక్ట్రోరల్ అధికారి కే.మోహన్‌కుమార్ పేర్కొన్నారు. కేంద్రరాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లామని, లోపాలను వీలైనంత త్వరగా సవరిస్తామని చెప్పారు. వీటిపై ఇప్పటికే విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. మోసానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి వారిపై చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
అన్ని రాజకీయ పార్టీల నుంచి వివరాలు సేకరిస్తున్నామని ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా అర్హులందరికీ ఓటు హక్కు కల్పిస్తామన్నారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే అద్దంకి, పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్తలు గొట్టిపాటి రవికుమార్, గొట్టిపాటి భరత్‌లు కలెక్టరును కలిసి వివరించారు. బుధవారం హైదరాబాద్‌లో గొట్టిపాటి భరత్ ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను కలిసి జరిగిన అక్రమాన్ని వివరించారు.