ఇంటర్... భవిష్యత్ నిర్దేశించే కీలక సమయం. మూడు రోజుల్లోనే ఫైనల్ పరీక్షలు... ఆ వెంటనే ఐఐటీ- జేఈఈ, ఎంసెట్ తరుముకుంటూ వచ్చేస్తున్నాయి. ఏడాది పొడవునా కష్టపడినా కాస్తంత మెలకువలు పాటించకుంటే ఆ కష్టమంతా వృథా అయిపోతుంది. చిన్నపాటి సూచనలు పాటిస్తే మంచి మార్కులు సాధించవచ్చంటున్నారు నిపుణులు. ఇంకెందుకాలస్యం... ఆచరించండి.. మంచి ఫలితాలు సాధించండి. ఆల్ ది బెస్ట్.
- గుంటూరు ఎడ్యుకేషన్
మరో మూడు రోజుల్లో ఇంటర్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి. ఉన్నత భవితను వెతుక్కుంటూ ఏడాది పొడవునా శ్రమించిన విద్యార్థులు చదివిన అంశాలను పేపర్‌పై పెట్టే సమయం వచ్చేసింది. దీంతో పాటు ఐఐటీ-జేఈఈఈ, ఎయిమ్స్, ఎంసెట్ వంటి జాతీయ, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు పోటీ పరీక్షలకు సింహద్వారం వంటి ఇంటర్ దశలో తడబడకుండా ముందుడుగు వేయాలి.
ఐఐటీ-జేఈఈఈ, ఎంసెట్ పరీక్షల్లో ఇంటర్మీడియేట్ మార్కులకు ఉన్న వెయిటేజీ దృష్ట్యా విద్యార్థులు అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతో అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఇందుకు పాఠ్యాంశాల పునశ్చరణ, ప్రాధమిక సూత్రాలను పాటించడం ద్వారా నూరు శాతం మార్కులు సాధించవచ్చంటున్నారు సబ్జెక్టు నిపుణులు. ఈ నెల 11వ తేదీన ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు జిల్లాలో 98,090 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అత్యధిక విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్‌పైనే దృష్టిసారిస్తున్నారు. తరువాతి స్థానిలో చార్టెడ్ అకౌంటెంట్స్ కావాలన్న యోచనతో కామర్స్ ఎంచుకుంటున్నారు.
సూత్రాల అధ్యయనంతో గణితంలో విజయం
గణితం పేపర్-1లో అధిక మార్కులు సాధించేందుకు ప్రధమ సంవత్సర విద్యార్థులు సలభమైన సూత్రాలను పాటించాలి. కొత్త అంశాల జోలికి వెళ్ళకుండా చదివినవే రివిజన్ చేసుకోవాలి. సమస్యాత్మకమైన ప్రశ్నలను ముందు గా పరిష్కరించేందుకు ప్రయత్నించడం వల్ల సమయం వృధా అవుతుంది. ఫంక్షన్స్, ధీరమ్స్, డొమైన్, రేంజ్, హైపర్ బోలిక్ ఫంక్షన్స్, వెక్టార్స్ విభాగాలను గుర్తుంచుకోవాలి.
ఇన్వర్ట్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్‌లో ఉన్న ఎత్తులు, దూరాలు, పరిష్కార మార్గాలు, మ్యాట్రిస్‌లో డిఫనేషన్స్ ఉదాహరణలు, లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో ఫార్ములా బేస్డ్, ప్రాధమిక సూత్రాలను అధ్యయనం చేయాలి. తప్పులు, అంచనాలు, రోల్స్, లెగ్రైండ్, ధీరమ్స్, ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ ఫంక్షన్స్, త్రీడీలో డిసీజ్, డీఆర్సీ, ప్లేన్స్‌లో రెండు మార్కుల లెక్కలకు సమాధానాలను సిద్ధం చేసుకోవాలి. గరిష్ట మార్కుల సాధన పునశ్చరణపైనే ఆధారపడి ఉంటుంది.
పి. అంకినీడు ప్రసాద్, గణిత శాస్త్ర అధ్యాపకుడు
సీనియర్ ఇంటర్ విద్యార్థులు శ్రమించాల్సిందే
పోటీ పరీక్షలకు హాజరయ్యే సీనియర్ ఇంటర్ విద్యార్థులు గణితంపై కొద్దిగా శ్రమిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. మిగతా సబ్జెక్టుల కంటే గణితంలో నూటికి నూరు మార్కులు సాధనకు ఎక్కువ అవకాశాలున్నాయి. కాంప్లెక్స్ నంబర్స్, డీమోవర్స్, థీరంలో పోలార్ ఫామ్, లోకస్ గుర్తుంచుకోవాలి. కోడ్రాడిక్ ఈక్వేషన్స్‌లో రెసిప్రోకల్ ఈక్వేషన్స్, రేంజ్ ప్రాబ్లమ్స్, బైనామియల్ ధీరమ్‌లో కో-ఎఫిషియెంట్, న్యూమర్రీకల్లీ గ్రేటెస్ట్, ఇన్ ఫైనిట్ సిరీస్‌కు సంబంధించిన అంశాలు ముఖ్యమైనవి.
ప్రీబబుల్టీ అండ్ రాండమ్ వేరియబుల్‌లో నిర్వచనాలు, స్టాటిస్టిక్స్‌లో ఫార్ములాలు, కాలిక్యులేషన్స్ ఎక్కువగా చేయాలి. క్రానిక్స్ విభాగంలో థీరమ్స్, ఫార్ములా, ఏరియాస్‌లో డయాగ్రమ్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్లు, అర్డర్ అండ్ డిగ్రీ, మోడల్ ప్రాబ్లమ్స్, ఇంటిగ్రేషన్స్‌లో అన్ని ఫార్ములాలు చేయాలి.
వి.వెంకట్రావు, గణిత శాస్త్ర అధ్యాపకుడు
కాస్తంత కష్టపడితే బోటనీలో అధిక మార్కులు
పటాలను గీయడం ద్వారా బోటనీలో అధిక మార్కులు సాధించవచ్చు. స్వల్ప సమాధాన ప్రశ్నలను పునశ్చరణ చేసుకోవాలి. పటాలు గీసేటప్పుడు భాగాలను తప్పనిసరిగా గుర్తించాలి. జూనియర్, సీనియర్ విద్యార్థులు వేరు, కాండ రూపాంతరాలు, అనిశ్చిత పుష్ప విన్యాసం, ఫలదీకరణ, పిండాకార నిర్మాణం, వేరు, కాండం, పత్ర అంతర్నిర్మాణాలను పటాలతో సహా నేర్చుకోవాలి. ఆవరణ శాస్త్రం నుంచి ఆరు మార్కులకు రానుండటంతో అధికంగా పునశ్చరణ చేసుకోవడం మేలు.
కణజాలు, ప్రధమ దశ-1లో ఉప దశలు, క్రోమోజోముల వర్గీకరణ, సమవిభజన, అసమ విభజన, మద్యభేదాలను అధ్యయనం చేయాలి. సీనియర్ ఇంటర్ విద్యార్థులు వృక్ష శరీర ధర్మ శాస్త్రం నుంచి అతి స్వల్ప సమాధాన ప్రశ్నలను దీర్ఘ సమాధాన ప్రశ్నలను అధ్యయనం చేయాలి. కెల్విన్ వలయం, గ్లెకాలసిస్, క్రెబ్స్ వలయం, డీఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానం, కణజాల వర్ణనం తదితర అంశాలను క్షుణ్ణంగా చదవాలి.
కణజాల వర్ణనంలో ఫ్లో చార్ట్ గీయడం ద్వారా అధిక మార్కులు సాధించవచ్చు. డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ మద్య భేదాలు కనుగొనడంపై దృష్టి సారించాలి. ఏ చాప్టర్ నుంచి 8 మార్కుల ప్రశ్నలు వస్తాయో గుర్తించి, చదివిన అంశాలనే ఎక్కువగా పునశ్చరణ చేసుకోవాలి. చిత్రపటాలు, ఫ్లో చార్టులు గుర్తుంచుకోవాలి.
- ఎం. రాజేంద్రప్రసాద్, బోటనీ అధ్యాపకుడు
జీవశాస్త్రంలో ప్రతిభ చూపవచ్చు
జూనియర్ ఇంటర్‌లో 4, 7, 8 యూనిట్ల నుంచి ఎనిమిది మార్కుల ప్రశ్నలకు ఆయా యూనిట్లలో దీర్ఘరూప సమాధాన ప్రశ్నలను పటాలతో సహా అధ్యయనం చేయాలి. యూనిట్-4లో బొద్దింక గురించి ఒక పటం తప్పనిసరిగా అడుగుతారు. ప్రతి పాఠ్యాశం వెనుక ఇచ్చిన ప్రశ్నలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. 4, 8 మార్కుల ప్రశ్నలకు అనుబంధంగా పటాలు ఉంటే తప్పకుండా గీయాలి.
రెండు మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు ఒకటి నుంచి 10 వరకూ అదే వరుస క్రమంలో ఒకే చోట రాయాలి. జవాబు రాసేటప్పుడు సమయపాలన ముఖ్యం. 4 మార్కుల ప్రశ్నలకు 60 నుంచి 70 నిమిషాలు, మిగిలిన సమయాన్ని 8 మార్కుల ప్రశ్నలకు కేటాయించుకోవాలి. సీనియర్ ఇంటర్‌లో మానవ అంతర్నిర్మాణం నుంచి దీర్ఘరూప సమాధాన ప్రశ్నలు, జన్యుశాస్త్రం అధ్యయనం చేయాలి. దంతం నిలువుకోత, మూత్ర పిండం నిలువుకోత, నెఫ్రాన్ నిర్మాణం, కశస్త్రమ దండం అడ్డుకోత పటాలను ప్రాక్టీస్ చేయాలి. జన్యుశాస్త్రంలో క్రిస్-క్రాస్ అను వంశిక, బహుళ యుగ్య వికలక్షణాలు, రక్త వర్గాలు, డ్రాసోఫిలాలో లింగ నిర్ధారణ చదవాలి. జీవ పరిణామశాస్త్రంలో లామార్కిజం, డిర్వినిజం, మానవ పరిణామం గురించి అధ్యయనం చేయాలి.
- ఎ. ప్రసాద్‌బాబు, జీవశాస్త్ర అధ్యాపకుడు
మెలకువలతో ఫిజిక్స్‌లో మంచి ఫలితాలు
ఎక్కువ మంది విద్యార్థులు కష్టమని భావించే భౌతికశాస్త్రంలో మెలకువలు పాటించడం ద్వారా అధిక మార్కులు సాధించే వీలుంది. ప్రధమ సంవత్సర విద్యార్థులు సమతలంలో చలనం, గమన నియమాలు, కణాల వ్యవస్థలు, భ్రమ గమనం, గురుత్వాకర్షణ, ఘన పదార్థాల యాంత్రిక ధర్మాలు, పదార్ధ ఉష్ణ ధర్మాలు, అణుచలన సిద్ధాంతం, గమన నియమాలు, పని, సామర్ధ్యం శక్తి, డోలనాలు, ఉష్ణ గణితశాస్త్రం పాఠ్యాంశాలు చదవాలి.
ద్వితీయ సంవత్సర విద్యార్థులు దృశాశాస్త్రం, తరంగ శాస్త్రం, విద్యుదావేశాలు, క్షేత్రాలు, స్థిర విద్యుత్ పొటెన్షియల్, కెపాసిటర్స్, విద్యుత్ ప్రవాహం, అయస్కాంతత్వం, పదార్ధం, వికిరణాల ద్వంద్వ స్వభావం, పదార్ధం, ఏకముఖ విద్యుత్, అర్థవాహక పరికరాలు పాఠ్యాంశాల్లోని 4 మార్కుల ప్రశ్నలను బాగా ప్రాక్టీసు చేయాలి. తరంగాలు, ఆవేశాల చలనం, అయస్కాంతత్వం, పరమాణువులు, కేంద్రకాలు, చాప్టర్ల నుంచి 8 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు కోసం శ్రమించాలి.
- ఎస్. మస్తాన్ సాహెబ్, భౌతికశాస్త్ర అధ్యాపకుడు
మౌలిక భావనలతోనే కెమిస్ట్రీ ఈజీ
రసాయన శాస్త్రంలో మౌలిక భావనలపై దృష్టి సారించాలి. ప్రథమ సంవత్సరంలో పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక నుంచి 8 మార్కుల ప్రశ్నలు వస్తాయి. రసాయన బంధం, కర్బన రసాయ శాస్త్రంలో నామకరణం, ఒక పదార్థం నుంచి వేరొక దానిని రాబట్టటంపై దృష్టి సారించాలి. స్టాకియోమెట్రిలో మొలారిటీ నార్మాలిటీ, అను భావిక, అణుఫార్మలాతో వాయు స్థితిలో అణుమేఘాలకు సంబంధించిన సమస్యలు సాధన చేయాలి.
ద్వితీయ సంవత్సరంలో రసాయన గణితశాస్త్రం, విద్యుత్ రసాయనశాస్త్రం, కర్బన రసాయన శాస్త్రంపై అధిక దృష్టి సారించాలి. లఘు ప్రశ్నలకు దైనందిన జీవితంలో రసాయన శాస్త్రం, పరివర్తన మూలకాలు, లోహ సంగ్రహణం, జీవాణువులు, కర్బన రసాయన శాస్త్రంలో నామకరణ చర్యలపై అధిక దృష్టి సారించాలి. సమస్యలపై ద్రావణాలు, విద్యుత్ రసాయన శాస్త్రం, ఘన స్థితిపై దృష్టి నిలపాలి.
- ఫ్రాన్సిస్ జేవియర్, రసాయనశాస్త్ర అధ్యాపకుడు
కొంచెం కష్టం... ఫలితం అధికం
Published Tue, Mar 10 2015 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM
Advertisement
Advertisement