అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : జడివానలోనూ జనం పోటెత్తారు. ‘సమైక్య’ సంకల్పంతో కదం తొక్కారు. ‘ఒకే భాష... ఒకే రాష్ట్రం’ అంటూ సమర నినాదం చేశారు. ప్రాణాలర్పించైనా రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని శపథం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కడంతో 43వ రోజైన బుధవారం కూడా జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం ఉప్పెనలా కొనసాగింది. ఎప్పటిలాగే ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతబడ్డాయి. పాలన పూర్తిగా స్తంభించిపోయింది.
అనంతపురం నగరంలో వాణిజ్య పన్నుల శాఖ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగిస్తూనే... సమైక్యాంధ్రకు మద్దతు పలకని రాజకీయ పార్టీల దిష్టిబొమ్మకు పాడెకట్టి శవయాత్ర నిర్వహించారు. స్థానిక రఘువీరా టవర్స్ ఎదురుగా సమాధి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ, విద్యుత్ ఉద్యోగులు, న్యాయవాదులు, పంచాయతీరాజ్ జేఏసీ, హౌసింగ్, మున్సిపల్ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఎన్‌జీఓల దీక్షా శిబిరంలో సాంఘిక సంక్షేమ, ప్రణాళిక శాఖల ఉద్యోగులు కూర్చున్నారు. ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ డ్రైవర్లు ర్యాలీ చేశారు. ఐఎంఎల్ డిపో కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు.
జాక్టో నేతలు అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. చెవిలో పూలు పెట్టుకుని ర్యాలీ నిర్వహించి, మానవహారం నిర్మించి... సమైక్యాంధ్ర నినాదాలు మార్మోగించారు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసే క్రమంలో విద్యుత్ ఉద్యోగులు తమ సిమ్ కార్డులను ఆ శాఖ ఎస్‌ఈకి ఇచ్చేశారు. ఎస్కేయూ విద్యార్థి, ఉద్యోగ జేఏసీ నేతలు ఇటుకలపల్లి చెక్‌డ్యాం దగ్గర నీటిలో నిలబడి సమైక్య నినాదాలు చేశారు. ధర్మవరం, తాడిమర్రి, ముదిగుబ్బలో ఎన్‌జీవో, ప్రజాసంఘాల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు బైక్ ర్యాలీ, మానవహారం, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ, జేఏసీ, టీడీపీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
గుత్తిలో సమైక్యవాదులు నిర్వహించిన 2-కే రన్ విజయవంతమైంది. హిందూపురంలో ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కదిరిలో వివిధ ప్రభుత్వ శాఖల ఇంజనీర్లు రిలే దీక్షలకు కూర్చున్నారు. విద్యుత్ ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. తలుపుల, అమరాపురం, అమడగూరు, పామిడి, పెనుకొండ, సోమందేపల్లిలో దీక్షలు కొనసాగుతున్నాయి. తనకల్లులో సమైక్యవాదులు ధర్నా చేశారు. కళ్యాణదుర్గంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ, మడకశిరలో ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. రొద్దంలో సమైక్యవాదులు జల దీక్ష చేశారు. రాయదుర్గంలో ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవుల ర్యాలీలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. కణేకల్లులో సమైక్యవాదుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రాప్తాడులో ఉపాధ్యాయులు భిక్షాటన చేశారు. తాడిపత్రిలో ట్రాన్స్‌కో ఉద్యోగులు, మహిళా సంఘాల సభ్యులు, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు వేర్వేరుగా రిలే దీక్షలు చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. పెద్దవడుగూరులో బందార్లపల్లి గ్రామస్తులు బైక్ ర్యాలీ చేశారు. ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలే దీక్షలు చేపట్టారు. యాడికిలో టైలర్లు రిలే దీక్షలకు కూర్చున్నారు. కూడేరులో సమైక్యవాదులు మోకాళ్లపై నిరసన తెలిపారు. శింగనమలలో సమైక్యవాదులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. గార్లదిన్నె మండలం కల్లూరులో గొర్రెలతో కాపరులు నిరసన తెలిపారు.
వానలోనూ అదే హోరు
Published Thu, Sep 12 2013 2:56 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement