కర్నూలు(అగ్రికల్చర్) : గత ఏడాది తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొన్న రైతులు ఈ విడతలోనైనా కలిసి రాకపోతుందా అనే ఆశతో ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. సకాలంలో వర్షాలు కురిసి అదునులో విత్తనం వేసుకుంటే కష్టాలు గట్టెక్కుతాయనే కోటి ఆశలతో పొలం వైపు అడుగేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రుతు పవనాలు ఊరిస్తుండటం.. ఎల్‌నినో ప్రభావం తెరపైకి రాకవడంతో వర్షపాతం ఎలా ఉంటుందోననే బెంగ రైతన్నలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
ఖరీఫ్ మొదలై పది రోజులవుతున్నా తొలకరి పలకరించకపోవడం.. బ్యాంకులు పంట రుణాలు పంపిణీ చేయకపోవడం.. విత్తన పంపిణీ అస్తవ్యస్తంగా మారడంతో రైతులను గందరగోళానికి గురిచేస్తోంది. ఇదే సమయంలో వేరుశనగ, కొర్ర విత్తన కొరత ఏర్పడింది. తుగ్గలి, పత్తికొండ, అదోని, మద్దికెర, డోన్, ప్యాపిలి, దేవనకొండ, ఎమ్మిగనూరు మండలాల్లో వేరుశనగకు డిమాండ్ ఉన్నా పంపిణీ చేయడంలో వ్యవసాయశాఖ చేతులెత్తేసింది. జిల్లాకు 29500 క్వింటాళ్లు కేటాయించినా 15000 కి ంటాళ్లు కూడా సరపరా చేయలేని పరిస్థితి నెలకొంది. రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా పట్టించుకునే దిక్కు కరువైంది.
పంట రుణాలు ప్రశ్నార్థకం
ఈ ఖరీఫ్‌లో రూ.2074 కోట్లు, రబీలో రూ.814 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని తలపెట్టారు. ఇంత వరకు అతీగతీ లేకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇక రుణమాఫీ ప్రక్రియ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. లక్ష మందికి పైగా రైతులు రుణ మాఫీకి నోచుకోలేదు. ఫేజ్-2లో రైతుల ఖాతాలకు మాఫీ అయిన మొత్తం జమ చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది.
శిథిలమైన రెయిన్‌గేజ్‌లు
జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించి మండలానికి ఒకటి చొప్పున 54 రెయిన్‌గేజ్‌లు ఉన్నాయి. ఇవి కాక ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు 122 ఉన్నాయి. వీటి ఆధారంగానే జిల్లాలో వర్షపాతం ఎంత నమోదయిందనే విషయం తెలుస్తోంది. వర్షపాతం ఆధారంగా కరువు ప్రాంతాలను ప్రకటిస్తారు. పంటల బీమా పరిహారం అందుతుంది. వర్షాలను కొలువడానికి ఉద్దేశించిన రెయిన్‌గేజ్‌లు పకడ్బందీగా ఉండాలి. కానీ జిల్లాలోని రెయిన్‌గేజ్‌లు చాలా వరకు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
రెవెన్యూ పరిధిలోని 54 రెయిన్‌గేజ్‌లు ఉండగా.. వీటిని కూడా ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌లుగా మార్పు చేస్తున్నారు. ఇప్పటికే అరు మండలాల్లో ఈ మార్పు జరిగింది. మొత్తంగా వర్షపాతం నమోదులో ప్రామాణికత కొరవడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రైతులకు చేరని భూసార ఫలితాలు
భూసార పరీక్షలపై వ్యవసాయ శాఖ హడావుడి చేసినా.. చివరికి సకాలంలో ఫలితాలను రైతులకు అందించడంలో విఫలమైంది. 27,500 మట్టి నమూనాలు సేకరించాల్సి ఉండగా, 23,100కే పరిమితమైంది. సేకరించిన మట్టి నమూనాలను కూడా పరీక్షించడం పూర్తి కాలేదు. భూసార పరీక్ష ఫలితాలను సకాలంలో రైతులకు తెలియజేస్తే తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా ఫలితాలు రైతులకు ఎప్పటికి చేరుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేస్తామని, సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పడం ప్రకటనలకే పరిమితమైంది.
రుతు పవనం.. మందగమనం
Published Thu, Jun 18 2015 3:50 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement