సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలి
Published Thu, Aug 22 2013 3:43 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
కాసిపేట, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరించాలని, కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం(ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం సోమగూడెం కొమురయ్య భవన్‌లో నిర్వహించిన సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నిర్మాణ రంగంలో 60లక్షల మంది కార్మికులు ఉన్నారని, వీరి సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. సంక్షేమ పథకాల అమలు, నష్టపరిహారం, చదువులు, పింఛన్, వైద్య సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం 1996లో సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ఆదేశాలిచ్చిందని చెప్పారు. 2007లో కమిటీ ఏర్పాటు చేసి పారదర్శకత లేకుండా అధికారులను చైర్మన్‌గా నియమించి నామమాత్రంగా బోర్డు నిర్వహిస్తున్నారని తెలిపారు.
మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్మిక సంఘాలను బాధ్యులుగా చేస్తూ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. కార్మికులు, కుటుంబ సభ్యులకు ఆస్పత్రి సౌకర్యం కల్పించే పథకం అమలు చేయాలని పేర్కొన్నారు. రూ.పది లక్షలకు పైగా వ్యయంతో చేపట్టే నిర్మాణాలకు ఒక శాతం చొప్పున సెస్ వసూలు చేసి రూ.1350 కోట్లు సంక్షేమ బోర్డుకు సమకూర్చిందని పేర్కొన్నారు. ఆ నిధులను కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సి ఉండగా ప్రభుత్వం రూ.438 కోట్లు ఇతర అవసరాలకు వెచ్చించిందని ఆరోపించారు. అంతకుముందు కార్యాలయం ఎదుట పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జాడి పోశం. ప్రధాన కార్యదర్శి గజంగుల రాజు, నియోజకవర్గ ఇన్‌చార్జి దాగం మల్లేష్, మండల ప్రధాన కార్యదర్శి అంకులు, నాయకులు కల్వల లక్ష్మణ్, రమేష్ పాల్గొన్నారు.
Advertisement