నత్తనడకన కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం
► కోర్టు ఆవరణలో ఎండిపోయిన బోర్లు
► ట్యాంకర్ల ద్వారా తెప్పిస్తున్న కాంట్రాక్టర్
► మొక్కుబడిగా క్యూరింగ్ చేస్తున్న వైనం
వరంగల్ : న్యాయస్థానాలన్నీ ఒకే ప్రాంగణంలో ఉండాలన్న ప్రభుత్వ అశయం నెరవేరకుండా పోతోంది. హన్మకొండ నక్కలగుట్టలోని జిల్లా న్యాయ స్థానం ప్రాంగణంలో అన్ని స్థాయిల కోర్టులు ఒకే భవనంలో ఉండేలా కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ పనులు ఏడాదిన్నర క్రితం ప్రారంభమయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.18.50కోట్లు కేటాయించగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం ఈ పనుల నిర్మాణ బాధ్యతలను ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించింది.
ఈ కాంప్లెక్స్ భవనాన్ని రెండు దశల్లో నిర్మించేందుకు అధికారులు అంచనాలు రూపొందించారు. మొదటి దశ పనుల్లో నాలుగు అంతస్తుల భవనంతో పాటు, గ్రౌండ్ ఫ్లోర్‌లో కొంత పార్కింగ్‌కు పోగా మిగిలిన భాగంతో పాటు మొదటి ఫ్లోర్ పనుల కోసం రూ.9.30కోట్లు, మిగిలిన రెండు అంతస్తుల్లో కోర్టుల నిర్మాణాలకు రూ.9.20కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించగా ప్రభుత్వం పరిపాలన మంజూరు ఇచ్చింది. మొదటి దశ పనులను వారుణ్య కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ 5.30శాతం లెస్‌లతో పనులు దక్కించుకుంది. ఏడాదిన్నర క్రితం చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఎప్పుడో నాలుగు అంతస్తులు పూర్తి చేసి రెండవ దశ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులు పొందిన ఏజెన్సీ వివిధ కారణాలతో జాప్యం చేస్తున్నారు.
క్యూరింగ్ లేక ఎండిన ఫ్లోర్
జిల్లా కోర్టుల ప్రాంగణంలో కోర్టు కాంప్లెక్స్‌లోని సిమెంట్ నిర్మాణాలకు సరిగా క్యూరింగ్ చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మాణం మొదలు పెట్టిన నాటి నుండి ఇదే పరిస్థితులు ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు ప్రస్తుతం వేసవి కాలం కావడంతో కోర్టు ప్రాంగణంలోని బోర్లు ఎండిపోయాయి. ఫలితంగా భవన నిర్మాణ పనులకు మొక్కుబడిగా క్యూరింగ్ చేయడం వల్ల నాణ్యత ప్రమాణాలు దెబ్బతినే అవకాశాలున్నట్లు నిర్మాణరంగ నిపుణులు అంటున్నారు కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా నాలుగవ అంతస్తులో కొంత భాగం ఇటీవల స్లాబ్ వేశారు. సెంట్రింగ్ తీసివేసేంత వరకు వేసిన స్లాబ్‌పై ఏర్పాటు చేసిన మడుల్లో నీళ్లు సమృద్దిగా ఉండాలి. కానీ ట్యాంకర్లతో అప్పడప్పుడు నీళ్లు తీసుకువచ్చి భవనం అడుగున ఉన్న సంప్ నింపి వాటితో క్యూరింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో లీకేజీలు ఏర్పడే అవకాశాలున్నాయి. నీటి ఎద్దడి కారణంగా కాంట్రాక్టర్ క్యూరింగ్ పనులపై పెద్దగా దృష్టి పెట్టడడం లేదన్న అరోపణలు వినిపిస్తున్నాయి.
ట్యాంకర్లతో నీరు తెప్పిస్తున్నాం...
కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ పనులు, క్యూరింగ్ కోసం ట్యాంకర్లతో నీరు తెప్పిస్తున్నాం. వేసవి కావడంతో బోర్లు ఎండిపోయాయి. నాలుగవ అంతస్తు స్లాబ్ పనులు సాగుతున్నాయి. పూర్తి కాగానే కింది ఫ్లోర్‌లో కోర్టు భవనాల నిర్మాణం చేపడుతాం. - రామకృష్ణ, ఆర్‌అండ్‌బీ, డీఈఈ, హన్మకొండ.