- ఈయూ మెరుపుసమ్మె
- 2వేల మంది కార్మికులు విధులకు గైర్హాజరు
ఆర్టీసీ అనంతపురం పరిధిలో సమ్మె సైరన్ మోగింది. కార్మికుల సమస్యల పరిష్కారంలో ఆర్‌ఎం వైఖరిని నిరసిస్తూ గుర్తింపు సంఘం ఎంప్లాయిస్ యూనియన్‌లో మెరుపు సమ్మె చేపట్టింది. దీని ఫలితంగా బుధవారం ఉదయం నుంచి ఈయూ పరిధిలో ఉండే సుమారు 2వేల మంది కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు.
కార్మికులకు ఓటి సమయాన్ని పెంచాలని, వన్‌మాన్ సర్వీసులను రద్దు చేయాలని, అక్రమ సస్పెన్షన్‌లను ఎత్తివేయాలని, తదితర డిమాండ్లతో ఈయూ సమ్మెలోకి వెళ్లింది. న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంతో అధికారులు విఫలమయ్యారని కార్మిక సంఘాలు విమర్శించాయి. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. సమ్మె ప్రభావంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.