
కానిస్టేబుల్ శ్రీపతి హఠాన్మరణం
ఎస్పీ సతీమణి, డీఎస్పీ, ఇతర పోలీసు అధికారుల సంతాపం
అనంతపురం క్రైం :
నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రీపతి(45) హఠాన్మరణం చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మంగళవారం ఉదయం శ్రీపతి ఇంటి నుంచి విధులకు స్టేషన్‌కు వెళ్లాడు. మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి ఇంటికొచ్చాడు. భోంచేసిన అనంతరం విశ్రాం తి తీసుకుంటానని భార్య పావనికి చెప్పి నిద్రకు ఉపక్రమించాడు.
అరగంట తర్వాత పెద్దగా గురక వినిపిస్తుండడంతో భార్య వెళ్లి చూసింది. ఒళ్లంతా చెమటలు పట్టి వణుకుతుండడంతో ఆందోళనగా బంధువులు, చుట్టుపక్కల వారికి సమాచారం చేర వేసి వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా మారింది. వైద్యం ప్రారంభించిన కొద్ది సేపటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి కుమారులు మధు ప్రభాదిత్య(పదో తరగతి), అరుణాదిత్య(4వ తరగతి) ఉన్నారు.
నిమిషాల వ్యవధిలో కళ్లెదుటే భర్తను మృత్యువు కాటేయడాన్ని పావని జీర్ణించుకోలేక పోయింది. ‘ఎంత అన్యా యం చేశావు దేవుడా... ఇంక మాకు దిక్కెవరురా..సామీ...ఇలా వదిలి వెళ్లి పోతి వే...’ అంటూ విలపించడాన్ని చూసిన వారు కన్నీరు పెట్టారు. ఎస్పీ సతీమణి మంజుల, వారి కుమారుడు విష్ణుప్రభాస్, డీఎస్పీ నాగరాజ, టూ టౌన్ సీఐ మన్సూరుద్దీన్, ఎస్‌ఐలు సుబ్బరాయు డు, రవిశంకర్‌రెడ్డి, సిబ్బంది, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
కేసు విషయమై ఎస్‌ఐతో పాటు కలియదిరిగి...
ఎస్‌ఐ సుబ్బరాయుడు, కానిస్టేబుల్ శ్రీపతి ఉదయం నుంచి ఓ చోరీ కేసు విషయమై కలియదిరిగారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో శ్రీపతి ఇంటికెళ్తానని ఎస్‌ఐకి చెప్పి వచ్చాడు. 2.30 గంటల సమయంలో ఎస్‌ఐకి కొందరు ఫోన్లు చేసి శ్రీపతి చనిపోయాడని చెప్పారు. దీంతో ఆయన విస్తుపోయారు. శ్రీపతి భౌతికకాయాన్ని సందర్శించి కంట తడి పెట్టారు. ‘ఇద్దరం ఉదయం నుంచి కలిసి తిరిగాం...ఇంతలోనే ఇలా జరిగింది’ అంటూ ఎస్‌ఐ వాపోయారు.
మంత్రి సునీత చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్న శ్రీపతి
ఇటీవల డీఎస్పీ పార్టీలో పని చేసిన శ్రీపతి సేవలను గుర్తించి ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నాడు. విధుల్లోనూ నిక్కచ్చిగా వ్యవహరించేవాడని, మంచి పోలీసును కోల్పోయామని సహచర సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.