వైఎస్సార్‌సీపీ నేత హఠాన్మరణం
కోవూరు: అందరితో కలివిడిగా మెలుగుతూ, మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకోవడంతో పాటు వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌గా పార్టీకి ఎనలేని సేవలందిం చిన ములుమూడి వినోద్‌రెడ్డి(43) మంగళవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కుటుంబసభ్యుల కథనం మేరకు..కోవూరులోని శాంతినగర్‌లో నివాసం ఉండే వినోద్‌రెడ్డి రోజూ తమ పొలంలోకి వెళ్లి పశువుల పాలు తీసి నెల్లూరులోని సోదరి ఇంట్లో ఇచ్చొస్తారు. అందులో భాగంగానే ఉద యం ఇనమడుగురోడ్డులోని పొలానికి బయలుదేరిన ఆయన మార్గంమధ్యలో పలువురు నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించారు.
తమ పొలంలోనే జామాయిల్ చెట్లు కొడుతున్న చోటుకు వెళ్లి పరిశీలించారు. అనంతరం పశువుల వద్దకు వచ్చి పాలుతీస్తుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆయన వద్ద పనిచేసే వారు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పాటు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఆటోలో తీసుకుని నెల్లూరుకు బయలుదేరారు. పెన్నాబ్రిడ్జి వద్దకు వెళ్లేసరికే విగతజీవి గా మారాడు. అయినా నెల్లూరులోని సింహపురి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ములుమూడి రామచంద్రారెడ్డి కొడుకైన వినోద్‌రెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు.
పలువురి సంతాపం
వినోద్‌రెడ్డి మృతితో కుటుంబసభ్యుడిని కోల్పోయినంత బాధగా ఉందని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఆయన సింహపురి హాస్పిటల్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి మృతదేహంతో కోవూరు శాంతినగర్‌లోని వినోద్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. వినోద్‌రెడ్డి కుటుంబ సభ్యులను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
వివాదరహితుడైన వినోద్‌రెడ్డి తమ మధ్య లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని అన్నారు.
సాయంత్రం వినోద్‌రెడ్డి మృతదేహానికి సమీప బంధువు, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డితో పాటు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్ పి.రూప్‌కుమార్‌యాదవ్ నివాళుర్పించారు.
వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, ఇందుకూరుపేట మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి, కోవూరు జెడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్వర్లురెడ్డి, నాయకులు రాధాకృష్ణారెడ్డి, మల్లికార్జునరెడ్డి, సుబ్బరామిరెడ్డి, నరసింహులురెడ్డి, సుబ్బారెడ్డి, పడుగుపాడు సర్పంచ్ గడ్డం రమణమ్మ, కోవూరు ఉపసర్పంచ్ ఇంతా మల్లారెడ్డితో పాటు పలు గ్రామాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు వినోద్‌రెడ్డి మృతదేహాన్ని కడసారి దర్శించుకున్నారు. ఆయన మృతిపై వైఎస్సార్ టీచర్ ఫెడరేషన్ కోవూరు ప్రధాన కార్యదర్శి ఆత్మకూరు రవీంద్రబాబు సంతాపం తెలిపారు.