నిలదీతలు... నీళ్లు నమలడాలు!
గార మండల సర్వసభ్య సమావేశంలో అధికారులను నిలదీసిన వైఎస్‌ఆర్ సీపీ సభ్యులు
వైఎస్‌ఆర్ సీపీ సభ్యులతో గొంతు కలిపిన పలువురు టీడీపీ సభ్యులు
గార: ఈ పాస్ విధానంపై మండల సర్వసభ్య సమావేశంలో విపక్ష సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీటీసీలు పలు సమస్యలను లేవనెత్తగా టీడీపీ సభ్యులు సైతం గొంతు కలపడం విశేషం. ఎంపీపీ గుండ అమ్మలు భా స్కరరావు అధ్యక్షతన ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అ నుసంధానం చేయాలనే తీర్మానంతో పాటు వైఎస్సార్‌సీపీ లేవనెత్తిన నీటి తీరువా పన్ను వసూళ్లు నిలిపివేయాలన్న అంశంపై చర్చ జరిగింది. సమావేశంలో ఎంపీడీఎ ఆర్.స్వరూపారాణి, సర్పంచ్‌లు బరాటం రామశేషు, అంబటి అంబి క, మైలపల్లి లక్ష్మీజనార్ధనరావు, అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో ఈపాస్ విధానం అమలు సరిగా లేదని తూలుగు ఎంపీటీసీ కొయ్యాన సంధ్యానాగభూషణం తెలి పారు. అయితే ఆధార్ అనుసంధానమే అసలు సమస్య అని తహశీల్దార్ సమాధానం చెప్పగా... అదే ఆధార్‌తో పింఛన్లు ఇస్తున్నారు కదా అని వమరవల్లి సర్పంచ్ లోపింటి భవాని రాధాకృష్ణారెడ్డి ప్రశ్నించగా సమాధానం కరువైంది. దీనిపై వైఎస్‌ఆర్ సీపీతో పాటు టీడీపీ సభ్యులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణాలకు బిల్లులు చెల్లించని విషయాన్ని కళింగపట్నం సర్పంచ్ పొట్నూరు కృష్ణమూర్తి సభ దృష్టికి తీసుకువచ్చారు.
అలాగే గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో మండలంలోని ఆరు పంచాయతీల్లో పంటలు పండలేదని, వీటికి సంబంధించి నీటి తీరువా పన్ను కట్టాలనడం భావ్యం కాదని మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్, కొర్లాం సర్పంచ్ పీస శ్రీహరిరావు సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తీ ర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని కోరారు.