- టీటీడీ బోర్డు సభ్యుల తీరు
- దేవుడి సేవను మానేసి సొంత పనుల్లో నిమగ్నం
- చక్రం తిప్పుతున్న చెన్నై కాంట్రాక్టర్లు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : టీటీడీ పాలకమండలి సభ్యులు కొం దరు శ్రీవారి నిధులను తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. అనుయాయులు, అనుచరుల పేర్లతో బినామీ కాంట్రాక్ట్‌లు తీసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. గడువు మరో నాలుగు నెలలు మాత్రమే ఉండటంతో ఎలాగైనా తమకు అనుకూలంగా పాలక మండలి నిర్ణయాలు ఉండాలనే విధంగా ఆలోచనలు చేస్తున్నారు.
పాలకమండలిలో మొత్తం 11 మంది సభ్యులు ఉండగా, ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. చెన్నైకి చెందిన ఓ పాలకమండలి సభ్యుడు లడ్డూ ముడి సరుకుల కొనుగోలు వ్యవహారంలో చక్రం తిప్పుతున్నారు. టెండర్‌ను చేజిక్కించుకునేందుకు అన్ని వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. రూ.5.7 కోట్లతో టెండర్‌ను తమ అనుచరులకు కానుకగా ఇప్పించినట్లు సమాచారం. కేంద్ర మంత్రి చిరంజీవికి ఆయన బంధువని సమాచారం. చిరంజీవి పార్టీ స్థాపించిన రోజుల్లో చెన్నైలో ఆయన నివాసంపై ఇన్‌కంట్యాక్స్ వారు దాడులు కూడా నిర్వహించి సుమారు రూ.60 కోట్ల ధనానికి ట్యాక్స్‌లు చెల్లించలేదని నిర్ధారించారు.
ఇన్ని ఆరోపణలు ఉన్నా ప్రభుత్వం ఆయనకే పాలకమండలిలో అవకాశం కల్పించింది. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి బంధువు ఒకరు రైల్వే ఉద్యోగుల సంఘంలో కేంద్ర నాయకునిగా ఉన్నారు. ఆయనకు నెయ్యి టెండర్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. పాలకమండలిలోకి ఈ సభ్యుడిని తీసుకునేప్పుడే కొన్ని ఆరోపణలు వచ్చాయి. అయినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ప్రస్తుతం రాయ్‌బరేలి నుంచి నెయ్యి సరఫరా అవుతోంది. అయితే ఇటీవల వారు సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ ఉందని, ఆవు నెయ్యి కాకుండా గేదె నెయ్యి కూడా కలిసిందని ఆరోపణలు వచ్చాయి.
క్వాలిటీ కంట్రోల్ వారు తనిఖీ చేసి నిర్ధారించారు. కల్తీ ఉందని భావిస్తున్న నెయ్యి డబ్బాలను కొన్నింటిని వెనక్కి పంపించారు. దీనంతటి వెనుక కేంద్ర మంత్రి బంధువు హస్తం ఉందని స్పష్టమవుతోంది. ఆయన వత్తిడి మేరకే ఈ తనిఖీలు జరిగాయని, ఎంతో కాలం నుంచి చేయని తనిఖీలు టీటీడీ వారు ఇప్పుడు ఎందుకు చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. నెయ్యిని ప్రాంతీయ స్థాయిలోని కాంట్రాక్ట్ దారుల నుంచి మాత్రమే తీసుకోవాలని గతంలో పాలక మండలి తీర్మానం చేసింది.
అయితే ఇటీవల కొత్తగా నెయ్యి సరఫరా చేసే సంస్థలు, కాంట్రాక్ట్ కంపెనీలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉండాలని తీర్మానించారు. దీని వెనుక మంత్రి బంధువు కుట్ర దాగి ఉందనేది స్పష్టమైంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆయనకు ఒక కాంట్రాక్ట్ సంస్థ ఉంది. ఈ సంస్థ పేరుతో బినామీ దారుని ద్వారా తీసుకునేందుకు సిద్ధం చేశారు. ఇందుకు పాలక మండలి కూడా పచ్చ జెండా ఊపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
బెంగళూరులో ఉంటున్న మరో పాలకమండలి సభ్యుడు కూడా వస్త్రాలకు సంబంధించిన టెండరు చేజిక్కించుకునేందుకు అన్ని వ్యూహాలు రూపొందించారు. ఈ సభ్యునికి వస్త్రాల అంతర్జాతీయ ఎక్స్‌పోర్ట్ వ్యాపారం ఉంది. ప్రస్తుతం శ్రీవారికి ఉపయోగించే వస్త్రాల ఖర్చు నెలకు రూ. 40 లక్షల వరకు ఉంటుంది. ఈ వస్త్రాల్లో నాణ్యత లేదని ఇటీవల జరిగిన బోర్ట్ మీటింగ్‌లో ఈయన ప్రస్తావించారు. అందువల్ల కాంట్రాక్ట్ మార్చాలనే సూచనలు చేశారు. ఎక్స్‌పోర్ట్ వ్యాపారాన్ని అడ్డం పెట్టుకుని ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్‌ను రద్దుచేసి తన బినామీదారునికి ఇప్పిం చేందుకు రంగం సిద్ధమైంది. కొత్తగా వస్త్రాల కోసం టెండర్లు పిలిచేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకుంది.
పాలకమండలి సభ్యులందరూ కలసి తమ ప్రాంతాల్లో, నియోజకవర్గాల్లో పూర్వ ఆలయాల జీర్ణోద్ధరణ, ఆయా ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి కోసం రూ.50.30 కోట్లు తీసుకున్నారు. చైర్మన్ కనుమూరి బాపిరాజు ఒక్కరే తన నియోజకవర్గంలో ధార్మిక ప్రచారానికి, ఆలయాల జీర్ణోద్ధరణకు ఇందులో రూ.6.40 కోట్లు తీసుకున్నారు. రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన ప్రయోజనాల కోసం వెంగమాంబ ట్రస్ట్ అభివృద్ధికి రూ.30.70 కోట్లు కేటాయింప చేయించుకున్నారు. అప్పటి నుంచి నిధుల మళ్లింపు ఊపందుకుంది.
ధార్మిక ప్రచారాలకు వచ్చిన వినతులు పరిశీలించి, టీటీడీ బృందాలు అక్కడ పరిశీలించి, ఇవ్వాల్సిన అవసరం ఉందనుకుంటే తప్పకుండా ఇవ్వవచ్చు. ప్రచారాలకే కాకుండా ఆలయాల జీర్ణోద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణాలకు సైతం నిధులు ఇవ్వవచ్చు. అయితే ఆ కోణంలో నిధుల వినియోగం జరగటం లేదు. స్వార్థంతో మాత్రమే నిధుల వినియోగం జరుగుతోంది. దీనిని ప్రశ్నించేందుకు ఎవరు ప్రయత్నించినా దేవుడి డబ్బుల విషయంలో రాజకీయాలు చేస్తున్నారంటూ పాలక మండలి సభ్యులు ప్రతి దాడికి దిగుతుండటం విశేషం. పాలకమండలి ప్రమాణ స్వీకారం చేసి రెండున్నరేళ్లయింది.
ఈ రెండున్నర ఏళ్లలో భక్తులకు ఉపయోగపడే పనులు రెండే రెండు చేశారు. తిరుమల, తిరుపతిలోని స్థానికులకు ప్రతి నెలలో ఒకరోజు శ్రీనివాసుని దర్శన భాగ్యం కల్పించేందుకు ముందుగానే టిక్కెట్లు ఇస్తున్నారు. ఇక కాలినడకన వస్తున్న భక్తులకు గత నెల వైకుంఠ ఏకాదశి రోజు నుంచి ఉచితంగా ఒక లడ్డూ ఇస్తున్నారు. కరుణాకరరెడ్డి గతంలో పాలకమండలి చైర్మన్‌గా ఉండగా కాలినడక భక్తులకు ఉచితంగా లడ్లు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. దాన్ని ప్రస్తుతపాలకవర్గం అమలుచేసింది. ఈ రెండు తప్ప పాలక మం డలి భక్తుల కోసం తీసుకున్న చర్యలు లేవు.