ఉద్రిక్తత
నందిగామ : బకాయిలు చెల్లించాలని కోరుతూ సుబాబుల్ రైతులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌పీఎం పేపరు పరిశ్రమ కార్యాలయం ప్రధాన గేటు వద్ద సుబాబుల్ రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. ఉదయం 11 గంటల నుంచి రైతులు, పలు రాజకీయ పార్టీల నాయకులు కంపెనీ కార్యాలయాన్ని ముట్టడించారు. ధర్నా విరమించాలంటూ రైతులపై పోలీసులు ఒత్తిడితెచ్చారు. రైతులు అంగీకరించలేదు. దీంతో ఎస్‌ఐ తులసీరామ్ నేతృత్వంలో పోలీసులు కొంతమంది రైతు నాయకులను అరెస్టు చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయినప్పటికీ మిగిలిన రైతులు ధర్నా కొనసాగించారు.
పోలీసులతో ఘర్షణ పడిన అనంతరం ధర్నాలో పాల్గొన్న నవాబుపేట గ్రామానికి చెందిన రైతు యర్రం శ్రీనివాసరావుకు బీపీ పెరిగి స్పృహకోల్పోయారు. శిబిరంలో ప్రథమచికిత్స చేసిన అనంతరం ఆయన్ను ప్రైవేటు ఆస్పత్రికి తరలిం చారు. రైతు నాయకుల అరెస్టును నిరసిస్తూ రైతులు 65 నంబరు జాతీయ రహదారిపై కొద్దిసేపు బైఠాయించారు. రైతులకు మద్దతు తెలుపుతూ వైఎస్సార్ సీపీ ఆందోళనలో పాల్గొన్నారు.
బకాయిలు రూ.9.50 కోట్లు
తొలుత రైతు ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ యార్లగడ్డ జోయ మాట్లాడుతూ 281 మంది రైతులకు ఎస్‌పీఎం కంపెనీ రూ.10.80 కోట్ల మేర బకాయిపడిందని తెలిపారు. గత ఏడాది మే 22న రైతులు చేసిన ఉద్యమం వల్ల రూ.1.30 కోట్లు మాత్రమే చెల్లించిన కంపెనీ మిగిలిన రూ.9.50 కోట్ల బకాయిలను నిలిపివేసిందని గుర్తుచేశారు. బకాయిల విడుదల విషయంలో ఏఎంసీ అధికారులు చేపట్టిన చర్యలకు ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లేకపోవడంతో కంపెనీ ప్రతినిధులు హైకోర్టుకు వెళ్లారని వివరిం చారు.
కాగితపు పరిశ్రమలకు ఏఎంసీ హామీగా ఉండి సుబాబుల్ కర్ర కొనుగోలు చేసినందున రైతులకు చెల్లించాల్సిన బకాయిలను సెంట్రల్ మార్కెట్ కమిటీ ఫండ్ ద్వారా ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఎస్‌సీఎం కంపెనీ 13 జిల్లాల రైతులకు రూ.22 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని వివరించారు. అన్ని మార్కెట్ కమిటీలు ైరె తు బకాయిలను సెంట్రల్ మర్కెట్ కమిటీ ఫండ్ ద్వారా ఇవ్వాలని తీర్మానం చేశాయని గుర్తుచేశారు. ఆ ప్రకారం ైరె తులకు బకాయిలు చెల్లించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేశామని తెలిపారు.
వివిధ రాజకీయ పార్టీల రైతు నాయకులు సయ్యద్‌ఖాసీం, చనుమోలు సైదులు, గోపాల్, చుండూరి సుబ్బారావు, జర బన నాగేశ్వరరావు, మంగునూరి కొండారెడ్డి, చిరుమామిళ్ల అశోక్‌బాబు, సత్యనారాయణ, నెలకుర్తి శివనాగేశ్వరరావు, పలువురు రైతు నాయకులు పాల్గొన్నారు. సీపీఐ నాయకులు అక్కినేని వనజ, కె.రామచంద్రయ్య, ప్రసాదు మద్దతు తెలిపారు.
మార్కెటింగ్ శాఖ జేడీ దృష్టికి తీసుకెళ్లాం
రైతుల ఆందోళనను మార్కెటింగ్ శాఖ జేడీ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన మంత్రితో సమావేశంలో ఉన్నందున తర్వాత మాట్లాడుతామన్నారు. బకాయిలపై హామీ ఇవ్వందే ఆందోళన విరమించమని రైతు నాయకులు చెప్పారు.
- ఏఎంసీ కార్యదర్శి గోపాలకృష్ణ