కుక్కకు భయపడి...
► భవనంపై నుంచి దూకిన ముగ్గురు కూలీలు
► ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు
► ఏపీ మంత్రి అయ్యన్న వియ్యంకుడి ఇంట్లో ఘటన
ద్వారకానగర్ (విశాఖ): ఓ పెంపుడు కుక్క రెండు నిండు ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడి వియ్యంకుడు, ఉత్తరాంధ్ర వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరవ రాంబాబు ఏపీలోని విశాఖలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటిలో గురువారం ఈ దారుణం జరిగింది. నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అక్కయ్యపాలెం లలితానగర్‌లో రాంబాబు మూడంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. అక్కయ్యపాలెం చెన్నూరు మసీద్ సెంటర్‌కు చెందిన నాచి గోపి(27), ఎమ్‌డీ హుస్సేన్ వలీ(44), విజయనగరం జిల్లా కోనాడ గ్రామానికి చెందిన బొండా శ్రీనులు పది రోజులుగా అందులో ఇంటీరియర్ పనులు చేస్తున్నారు. రోజూ మాదిరిగానే గురువారం వచ్చి పనులు చేసుకుంటున్నారు.
మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాంబాబు ఇంటిలో ఉన్న జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్క ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. దాన్ని చూసి కింద పని చేస్తున్న కూలీలు భయపడి, కుక్కా కుక్కా అని అరుస్తూ రెండో అంతస్తులోకి పరిగెత్తారు. ఈ అరుపులు విని అక్కడ పనిచేస్తున్న ముగ్గురు కూలీలు భయంతో కిందికి దూకేశారు. తీవ్ర గాయాలతో గోపీ అక్కడికక్కడే మరణించాడు. హుస్సేన్ వలీ, శ్రీనులను స్థానికులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హుస్సేన్ చనిపోయాడు. తీవ్ర గాయాలతో శ్రీను చికిత్స పొందుతున్నాడు. ఈస్ట్ జోన్ ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు.
నాలుగో పట్టణ ఎస్సై గణేష్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రాంబాబు పెంచుకుంటున్న ఈ కుక్క కొద్ది రోజుల క్రితం ఓ మేస్త్రిని కరిచినట్లు క్షతగాత్రుడు శ్రీను వెల్లడించాడు. అప్పటి నుంచి ఇంటిలో పని జరుగుతున్నంతసేపూ కుక్కను గొలుసులతో కట్టి ఉంచుతున్నారు. ఆ గొలుసు తెగిపోవడంతో కుక్క బయటకు వచ్చింది. అకస్మాత్తుగా దాన్ని చూసిన కూ లీలు కిందకు దూకేశారు.