
వణుకు
► టాప్-10 అవినీతిపరుల జాబితా
► ఎవరెవరు ఎంత తిన్నారనే విషయంపై ఆరా
► వివరాలు సేకరిస్తున్న ఇంటెలిజెన్స్
► ప్రధానంగా జిల్లా అధికారులపైనే దృష్టి
► త్వరలో ప్రభుత్వానికి నివేదిక
► ఇప్పటికే అవినీతి శాఖల జాబితా సిద్ధం
అవినీతిలో అగ్రగాములు ఎవరంటే.. ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. ఇక టాప్-10 విషయానికొస్తే.. ఠాగూర్ సినిమాను తలపింపక మానదు. ఒకరు పది లక్షలు అంటే.. మరొకరు ఇరవై లక్షలు. నువ్వు అక్కడ తిన్నావంటే.. నువ్వేం తక్కువా అనే ప్రశ్న. ఎవరికి వారు ఈ కళలో ఆరితేరిన వారే. తాజాగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇలాంటి జాబితా ఒకటి సిద్ధం చేస్తుండటం ప్రభుత్వ ఉద్యోగుల్లో చర్చనీయాంశమవుతోంది. వాళ్లతో పోల్చుకుంటే నేను తిన్నదెంత అనే అంచనాల్లో తలమునకలవుతున్నారు. అచ్చం సినిమా తరహాలోనే.. జాబితాలో ఎవరి పేర్లు ఉండొచ్చనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో ఏయే అధికారి ఎంత మొత్తం లంచాల రూపంలో గుంజుతున్నారు? అత్యంత అవినీతిపరుడైన అధికారి ఎవరు? ఈ వివరాలతో కూడిన టాప్-10 జాబితాను ఇంటెలిజెన్స్ వర్గాలు సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ జాబితాను త్వరలో ప్రభుత్వానికి పంపనున్నట్టు సమాచారం. విషయం ఆనోటా ఈనోటా బయటకు రావడంతో జిల్లాలోని అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ జాబితాలో అవినీతిని కట్టడి చేయాల్సిన శాఖ అధికారి పేరు కూడా ఉందనే విషయం తాజాగా చర్చనీయాంశమవుతోంది. ప్రధానంగా జిల్లా అధికారులపైనే దృష్టి కేంద్రీకరించి ఈ జాబితాను ఇంటెలిజెన్స్ వర్గాలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే అత్యంత అవినీతి ప్రభుత్వ శాఖల జాబితాను ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి పంపినట్టు తెలుస్తోంది. తాజాగా అధికారులపై నేరుగా పేర్లతో సహా జాబితా ప్రభుత్వానికి చేరనుండటంతో వ్యవహారం కాస్తా హాట్ టాపిక్‌గా మారింది.
ఆధారాలతో సహా...
కేవలం అవినీతి అధికారుల జాబితాను సిద్ధం చేస్తే.. ఈ జాబితాకు సాధికారత ఉండదని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే.. ఫలానా అధికారి ఏయే వ్యవహారాలలో ఎలా వ్యవహరించారు? ఫలానా డీల్‌లో ఎంత మొత్తం గుంజారనే వివరాలను కూడా జాబితాలో పొందుపరచనున్నట్టు సమాచారం. అదేవిధంగా ఇలా సంపాదించిన అవినీతి డబ్బును ఎక్కడెక్కడకు మళ్లించారనే విషయాన్ని పూర్తి వివరాలతో జాబితా సిద్ధం కాబోతున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తద్వారా తాము అందించే నివేదికకు సార్థకత చేకూరుతుందనేది ఇంటెలిజెన్స్ వర్గాల భావనగా ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే అత్యంత అవినీతి అధికారుల జాబితాపై ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం.
ప్రాథమిక నిర్ధారణకు..
టాప్-10 అవినీతి అధికారుల జాబితా తయారు చేసేందుకు సిద్ధమైన ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే ప్రాథమికంగా ఏయే అధికారులు ఎక్కువగా అవినీతికి పాల్పడుతున్నారనే వివరాలను సేకరించినట్టు సమాచారం. అయితే, ఇక్కడితో ఆగకుండా ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరించే పనిలో పడ్డారు. అయితే, టాప్-10 అవినీతి అధికారుల జాబితాలో ప్రధానంగా పోలీసు అధికారులు ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఇందులో ఉన్నట్టు సమాచారం.
ప్రధానంగా కర్నూలు నగరానికి కొద్దిదూరంలో ఉన్న మండలం.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న మండలంలో పనిచేసే ఒక డిప్యూటీ తహశీల్దారు(డీటీ) పేరు ఇందులో ఉన్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సదరు డీటీ భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారని తెలుస్తోంది. ఇక కర్నూలు కార్పొరేషన్‌లో పనిచేసే ఒక ఇంజనీరు ఆస్తులపైనా వీరు కన్నేసినట్టు సమాచారం. పంచాయతీరాజ్ శాఖలోని మరో అధికారి పేరు కూడా ఈ జాబితాలో ఉన్నట్టు వినిపిస్తోంది. మొత్తంగా జాబితా వ్యవహారం అవినీతి అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది.
కొసమెరుపు:
జిల్లాలో అవినీతి పరుల గుండెల్లో దడ పుట్టించాల్సిన అవినీతి నిరోధక శాఖ అధికారుల పేర్లు కూడా ఈ జాబితాలో ఉండనుండటం గమనార్హం.