ఇంటికి కూత వేటుదూరంలో ఉన్న కృష్ణానదిలోకి మిత్రులతో కలసి స్నానాలకు వెళ్లిన ఇద్దరు యువకుల ప్రాణాలను మృత్యువు కబళించింది.
చందర్లపాడు : ఇంటికి కూత వేటుదూరంలో ఉన్న కృష్ణానదిలోకి మిత్రులతో కలసి స్నానాలకు వెళ్లిన ఇద్దరు యువకుల ప్రాణాలను మృత్యువు కబళించింది. దీంతో ఇద్దరి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. కాసరబాదలో శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన పలువురిని కలచివేసింది. గ్రామానికి చెందిన వాసిరెడ్డి వెంకట కమల ప్రవీణ్(18), అరవపల్లి ఫణిశేఖర్(32) ఒకే వీధిలో పక్కపక్క ఇళ్లలో నివశిస్తుంటారు. ప్రవీణ్ గుంటూరు జిల్లా చేబ్రోలు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్(ఈసీఈ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
ఫణిశేఖర్ ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్‌లో టాక్స్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలసి దీపావళి పండుగను చేసుకునేందుకు స్వగ్రామానికి వచ్చారు. శుక్రవారం ఉదయం వీరిద్దరూ గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న కృష్ణానదిలోకి మిత్రులైన గోకర ్లయోగానందం, ఉదయ్‌తో కలసి స్నానానికి వెళ్లారు. వీరితో పాటు ప్రవీణ్ తమ్ముడు కార్తీక్ ఉన్నాడు. నదిలో స్నానం చేస్తుండగా ప్రవీణ్ లోతుగా ఉండే ప్రదేశంలోకి వెళ్లాడు. నీటిలో మునిగిపోతున్న అతడిని కాపాడేందుకు ఫణిశేఖర్ వెళ్లాడు. అక్కడ ఇద్దరూ నీట మునిగి ఊపిరాడక మరణంచాడు.
దీనిని గమనించిన కార్తీక్ ఒడ్డుకు వచ్చి తండ్రి చంద్రశేఖర్‌కు ఫోన్ ద్వారా సమాచారమందించాడు. వెంటనే కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలసి హుటాహుటిన వచ్చారు. జాలర్ల సాయంతో గాలించి, ఇద్దరి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ శర్మ, ఎస్‌ఐ రమేష్ సంఘటన స్థలానికి చేరున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నందిగామ తరలించారు.
కాయకష్టంతో పిల్లలను చదివించారు..
చంద్రశేఖర్, సుభద్ర దంపతులకు ప్రవీణ్, కార్తీక్ సంతానం. చంద్రశేఖర్ తనకున్న రెండెకరాల పొలాన్ని సాగుచేస్తూ, ప్రైవేటు పాల డెయిరీకి ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. సుభద్ర అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. సీతారామయ్య, శ్రీలక్ష్మి దంపతులకు ఫణీంద్ర, సంకీర్తన సంతానం. సీతారామయ్యకు 1.50 సెంట్ల భూమి ఉంది. తమ పొలాన్ని సాగుచేసుకుంటూనే సీతారామయ్య దంపతులు కూలి పనులు చేసుకుని పిల్లలను చదివించారు.
ఫణిశేఖర్‌ను ఎంసీఏ వరకు చదివించారు. చదువు పూర్తయిన తరువాత ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఫణిశేఖర్‌కు ఇన్‌కంటాక్స్ డిపార్టుమెంటులో టాక్స్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. గత రెండేళ్లుగా ఉద్యోగం చేస్తూ కుటుంబసభ్యులకు చేదోడు వాదోడుగా ఉంటూ చెల్లెలు పెళ్లి చేయాలనుకున్నాడు. ఇటీవల నిర్వహించిన గ్రూప్స్ పరీక్షలు కూడా రాశాడు. ఇద్దరి మరణంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.