- ఉద్యమకారులను తిట్టిన నోటితోనే సమైక్యాంధ్ర నినాదం
- చింతామోహన్ వైఖరితో కాంగ్రెస్ కార్యకర్తల విస్మయం
సాక్షి, తిరుపతి: విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, రాజకీయపార్టీల మొదలు జిల్లాలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు సమైక్యాంధ్ర కోసం ఏడు నెలలుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. సమైక్య ఉద్యమంతో గతంలో జిల్లా యావత్తు కొన్ని నెలలపాటు స్తంభించిపోయింది. సాధారణ జనజీవనానికి ఆటంకం కలిగింది. ఇంత జరిగినా అప్పట్లో స్పందించని ఒకే ఒక్క వ్యక్తి తిరుపతి ఎంపీ చింతా మోహన్. ఉద్యమకారులు పలుమార్లు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలంటూ ఎంపీ ఇంటిముందు ధర్నాకు దిగారు.
ఓ సందర్భంలో ఆయనను అడ్డుకున్నందుకు సమైక్యవాదులపై ఎంపీ పోలీసు కేసులు సైతం నమోదు చేయించారు. అయితే ఆయన హఠాత్తుగా తన వైఖరిని మార్చుకున్నారు. ఇప్పుడు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ మొసలిక న్నీరు కారుస్తున్నారు. రెండు రోజుల కిందట ఆయన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు వందమందితో ఆందోళన నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు.
దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం నివ్వెరపోయాయి. సమైక్యాంధ్ర ఉద్యమానికి సహకరించాలని కోరిన రోజుల్లో పత్తా లేకుండా పోయిన ఎంపీ, ఇప్పుడు ఉన్నట్టుండి జనంలోకి రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ రాజకీయాల్లో తనకంటూ లాబీయింగ్ కలిగిన చింతా మోహన్ హఠాత్తుగా సమైక్యాంధ్ర నినాదాన్ని చేపట్టడం వెనుక మతలబు ఏమిటని గుసగుసలుపోతున్నారు. ఏపని అయినా సొంత ప్రయోజనం లేకుండా చేయరని ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు.
రాజకీయ ప్రయోజనాలు ఆశించే సమైక్యాంధ్ర అంటూ నినదించారని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏ రకంగా తీసుకున్నా సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎదుర్కోక తప్పదు. ప్రజల్లో పార్టీపై ఉన్న చెడు అభిప్రాయం తనపై పడకుండా చూసుకునేందుకు వేసిన ఎత్తుగడ అని ఆ పార్టీ కార్యకర్తలు కొందరు విశ్లేషిస్తున్నారు.