- మరొకరి గల్లంతు
- వారి స్వగ్రామం కేసరపల్లి శివారు దుర్గాపురం
- శోకసంద్రంలో కుటుంబసభ్యులు
గన్నవరం/బాపట్ల, న్యూస్‌లైన్ : మండలంలోని కేసరపల్లి శివారు దుర్గాపురం కాలనీకి చెందిన ఇద్దరు విద్యార్థులు గుంటూరు జిల్లా బాపట్లకు సముద్ర స్నానం కోసం వెళ్లి గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభించగా, మరొకరి ఆచూకీ తెలియలేదు. దీంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లలు అనుకోని ప్రమాదంలో చిక్కుకోవడంతో ఆ రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి.
వివరాలిలా ఉన్నాయి. దుర్గాపురం కాలనీకి చెందిన అసిలేటి రత్నాకర్ కుమారుడైన దినేష్ (14) స్థానిక వీఎస్ సెయింట్‌జాన్స్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. గుంటూరు జిల్లా బాపట్లలో జరగనున్న ఓ శుభకార్యానికి తన బాబాయి రమేష్ కుటుంబసభ్యులతో కలసి బుధవారం వెళ్లాడు. తనతో పాటు తన స్నేహితుడైన అదే ప్రాంతానికి ఇంటర్మీడియెట్ విద్యార్థి వీర్ల నాగరాజును కూడా తీసుకెళ్లాడు.
గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి దినేష్, నాగరాజు సముద్ర స్నానానికి వెళ్లారు. కేరింతలు కొడుతూ స్నానం చేస్తున్న సమయంలో పెద్ద అల తాకిడికి నాగరాజు, దినేష్ సముద్రంలో గల్లంతయ్యారు. దీంతో వారు పెద్దగా కేకలు వేయడంతో పక్కనే స్నానం చేస్తున్న దినేష్ బాబాయి రమేష్ గమనించి వారిని రక్షించేందుకు యత్నించాడు.
రెండు చేతులతో వారిని పట్టుకున్నప్పటికీ ఆలల ఉధృ తికి రమేష్ యత్నం విఫలమైంది. వెంటనే తీర ప్రాంతంలోని మత్స్యకారులకు సమాచారం చెప్పడంతో వారితో పాటు, పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న దినేష్, నాగరాజు కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన బాపట్ల బయలుదేరి వెళ్లారు.
ఒక్కగానొక్క కుమారుడు...
సముద్రంలో గల్లంతైన దినేష్‌కు ఒక సోదరి ఉంది. ఒక్కడే కుమారుడు కావడంతో తల్లిదండ్రులు రత్నాకర్, రామాబాయ్‌లు అల్లారుముద్దుగా పెంచుతున్నారు. తొమ్మిదో తరగతి పూర్తవడంతో పదో తరగతిలో చేరాల్సి ఉంది. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తునప్పటికీ కుమారుడిని బాగా చదివిస్తే తమ ఆశలు నెరవేరతాయనుకున్నానని తండ్రి రత్నాకర్ ఆవేదన వ్యక్తంచేశాడు. వేసవి కారణంగా సముద్ర స్నానానికి వెళ్లి వస్తామని చెబితే పంపించామని.. ఇప్పుడు మీ అమ్మకు నీ గురించి ఏమి చెప్పాలంటూ ఆ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు.
చెట్టంత కొడుకును సముద్రం పాలు చేశా...
కూలీనాలీ చేసుకుని కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులమిద్దరం కష్టపడుతున్నాం... చెట్టంత కొడుకును సముద్రంపాలు చేశానంటూ నాగరాజు తండ్రి తిరుపతయ్య విలపించాడు. తిరుపతయ్య, నాగేశ్వరమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. నాగరాజు రెండో కుమారుడు. స్నేహితుడితో సముద్రస్నానానికి వెళుతున్నానంటే పంపానంటూ తిరుపతయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
ముమ్మరంగా గాలింపు చర్యలు..
సముద్రంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతుకావడంతో పోలీసులు, మత్స్యకారులు సముద్రంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అడవిపల్లిపాలెం వద్ద సముద్రంలో మునిగిపోయిన నేపథ్యంలో గత అనుభవాల దృష్ట్యా చీరాల వైపు ఒక బృందం, సూర్యలంక వైపు మరో బృందం వెళ్లి గాలింపు చర్యలను చేపట్టింది.
గాలింపునకు మేకనైజ్డ్ బోట్లు, వలలు ఉపయోగించారు. గురువారం రాత్రి సమయానికి దినేష్ మృతదేహం లభించినట్లు బాపట్ల పోలీసులు తెలిపారు. నాగరాజు ఆచూకీ కోసం మత్స్యకారుల సాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు.
తీరని విషాదం...
తన కుమారుడు గల్లంతైన విషయం తెలుసుకున్న నాగరాజు తల్లి నాగేశ్వరమ్మ స్వగ్రామంలో సొమ్మసిల్లిపోయింది. తన ముగ్గురు కుమారులలో అల్లారుముద్దుగా పెంచుకున్న నాగరాజు కనిపించడం లేదంటూ భోరున విలపించింది.