ధర్మవరం అర్బన్:
ధర్మవరం పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురం సమీపంలోని ఓ ఇంటిలో దొంగలు సినీ ఫక్కీలో దొంగతనం చేశారు. కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేసి 11 తులాల బంగారు ఆభరణాలు, రూ.70వేల నగదును అపహరించారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ వేణుగోపాల్, రూరల్ సీఐ మురళీకృష్ణ పరిశీలించారు. పోలీసుల కథనం మేరకు, ధర్మవరం పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురం సమీపంలో నివసిస్తున్న ఎల్‌ఐసీ ఏజెంట్ లక్ష్మీనారాయణ ఇంట్లోకి మంగళవారం అర్ధరాత్రి నలుగురు ముసుగు ధరించిన దుండగులు ప్రవే శించారు. వీరు తలుపును బండరాయితో పగులగొట్టే శబ్ధం విన్న లక్ష్మీనారాయణ, భార్య లక్ష్మీకాంతమ్మ, కుమార్తె హాల్లోకి వచ్చారు. అప్పటికే లోపలికి వచ్చిన దుండగులు వారిని పట్టుకుని తాళ్లతో చేతులు కట్టేశారు. అనంతరం వారిని బెడ్‌రూంలో వేసి బంధించారు. కత్తులు చూపిస్తూ తాము నక్సలైట్లమని బెదిరించి, 11 తులాల బంగారు అభరణాలు, రూ.70వేల నగదును ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున వారు కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవారు గమనించి లక్ష్మీనారాయణ బంధువులకు తెలియజేశారు. వారు వచ్చి వారి చేతులకున్న తాళ్లను విప్పేశారు. అనంతరం పట్టణ పోలీసులకు సమాచారం అందించారు.
ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్, రూరల్ సీఐ మురళీకృష్ణ, పట్టణ ఎస్‌ఐ సుబ్బరామయ్య సంఘటనా స్థలాన్ని బుధవారం ఉదయం పరిశీలించారు. క్లూస్‌టీంను పిలిపించి వేలిముద్రలను తనిఖీ చేశారు. డాగ్‌స్క్వాడ్‌ను పిలిపించి చుట్టుపక్కల తనిఖీ చేశారు. బాధితుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తన కూతురికి ఇంజనీరింగ్ కళాశాలలో కౌన్సెలింగ్ ఉందని ఫీజు కట్టేందుకు రూ.70వేలు అవసరమంటే ఇంట్లో పెట్టుకున్నానని ఇంతలో దొంగలు పడ్డారని పోలీసుల ఎదుట వాపోయాడు. ప్రధాన రోడ్డులో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగలు ఎవరన్నది తెలియలేదని పోలీసులు తెలిపారు.