పహాడీషరీఫ్(హైదరాబాద్): సినీ నటుడు మంచు మోహన్‌బాబు ఇంట్లో చోరీ జరిగిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ గురువారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..జల్‌పల్లి గ్రామ శివారులో మోహన్‌బాబుకు నివాసం (మంచు టౌన్‌షిప్) ఉంది. ఇంటి ఆవరణలోనే వ్యక్తిగత కార్యదర్శులు, సెక్యూరిటీ సిబ్బంది, పనివారి కోసం వేర్వేరు గదులు సైతం ఉన్నాయి. ఈ నెల 22న మోహన్‌బాబు ఆదేశాల మేరకు పర్సనల్ సెక్రటరీ (పీఎస్) కిరణ్‌కుమార్ తిరుపతిలోని ఎంబీయూ యూనివర్సిటీ నుంచి రూ.10 లక్షల నగదు తీసుకొని రాత్రికి మంచు టౌన్‌షిప్‌కు చేరుకున్నాడు.
రాత్రి కావడంతో ఉదయాన్నే డబ్బులు మోహన్‌బాబుకు ఇద్దామని భావించి తన గదిలో ఉంచాడు. ఈ టౌన్‌షిప్‌లోనే అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఎర్రవంకపల్లి గ్రామానికి చెందిన గణేశ్ నాయక్ (24) హౌజ్ బాయ్‌గా పని చేస్తున్నాడు. కిరణ్ డబ్బులు తెచ్చిన విషయం ముందే తెలుసుకున్న గణేశ్ అతడు నిద్రపోయాక, తలుపు నెట్టి డబ్బులు కాజేసి పరారయ్యాడు.
ఉదయాన్నే లేచి చూడగా డబ్బుతో పాటు గణేష్ కూడా కనిపించలేదు. సీసీ కెమెరాలు పరిశీలించగా అతడే డబ్బు తీసుకెళ్లినట్లు నిర్ధారణ అయ్యింది. మోహన్‌బాబు సూచన మేరకు కిరణ్ 23వ తేదీన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రాచకొండ సీపీ సుదీర్‌బాబు సూచనలతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు తిరుపతిలో ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపి బుధవారం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అతని వద్ద నుంచి రూ.7,36,400ల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment