ఇళ్ల మధ్యన మద్యం దుకాణాలు వద్దు
విజయనగరం గంటస్తంభం: జనావాసాల మధ్య మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటు తగవంటూ పలువురు కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్ వద్ద సోమవారం ధర్నా చేశారు. విజయనగరం పట్టణం 34వ వార్డులోని మద్యం దుకాణాన్ని ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్ రామపండు ఆధ్వర్యంలో కలెక్టర్ వివేక్‌యాదవ్‌కు వినతిపత్రం అందజేశారు. ఉడాకాలనీలో కవిత బార్ ఏర్పాటుపై స్థానిక మహిళలు ఫిర్యాదు చేశారు.
ఇక్కడ ఇప్పటికే మద్యం దుకాణం ఉండగా బార్ ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు. తోటపాలెం 22వ వార్డులో కాలేజీలు, స్కూల్స్, దేవాలాయాలు, మసీదు, చర్చిలు ఉన్న చోట మద్యం దుకాణం ఏర్పాటు చేస్తున్నారని, తక్షణం తొలిగించాలని మాలమహనాడు ప్రధాన కార్యదర్శి గొండేల ప్రకాశరావు కోరారు. గ్రీవెన్స్‌సెల్‌కు మొత్తం 188 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో కొన్ని పరిశీలిస్తే..
జన్మభూమి కమిటీలు రాజకీయం చేసి తమ పింఛన్లు తొలిగించారని గరివిడి మండలం కోనూరుకు చెందిన పల్లి పరిశి నాయుడు, పూడి నారాయణ ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఏకంగా 70 మంది ఫించన్లు తొలిగించారని, పోరాడితే 50 మంది పింఛన్లు పునరుద్ధరించారని తెలిపారు. అర్హులందరికీ పింఛన్లు మంజూరయ్యేలా చూడాలని కలెక్టర్‌కు విన్నవించారు.
దత్తిరాజేరు మండలం కోరపుకొత్తవలస వద్ద ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించాలని ఎస్.బూర్జవలస సర్పంచి పొట్నూరు రమణ కలెక్టర్‌కు విజ్ఞప్తిచేశారు.
బ్యాటరీ ట్రైసైకిళ్లు మంజూరు చేయాలని పార్వతీపురం మండలం పెదబొండపల్లికి చెందిన ఉర్లాప్ ప్రకాశ్, జె.సింహాచలం, జె.సీమమ్మ, గుంట పైడియ్య తదితరులు కోరారు.
దత్తిరాజేరు మండలం బోజరాజపురం వీఆర్యే లేకపోవడం వల్ల తమకు సరైన సమాచారం అందడం లేదని, తక్షణమే ఆ పోస్టు మంజూరు చేయాలని గ్రామానికి చెందిన సారిపల్లి చంద్రుడు కోరారు.
పింఛన్లు మంజూరు చేయాలని కొందరు... భూసమస్యలు పరిష్కరించాలని మరికొందరు... రుణాలు మంజూరు చేయాలని ఇంకొందరు... ఇలా అనేక సమస్యలపై పలువురు వినతిపత్రాలు సమర్పించారు.