నీటిచుక్కకు నోచుకోని పల్లెలున్నాయి... మద్యం దొరకని ప్రాంతమే లేదు. అనధికారికంగా నెలకొల్పిన బెల్టు దుకాణాలు వేలల్లో ఉన్నాయి... వాటిని అడ్డుకునే ప్రయత్నాలు కానరావడంలేదు. నిర్దేశించిన గరిష్ట విక్రయధరకు మించి అమ్మకాలు సాగుతున్నాయి... అదుపు చేసేందుకు చర్యలు లేవు. మన్యంలోనే కాకుండా మైదానంలోనూ సారా ప్రవహిస్తోంది... కట్టుదిట్టంగా నియంత్రిస్తున్న దాఖలాల్లేవు. ఇదీ విజయనగరం జిల్లా పరిస్థితి. గడచిన ఆరేళ్లుగా రోజురోజుకూ మద్యం విక్రయాలు పెరుగుతున్నాయంటే అదంతా బార్లా తెరచుకున్న బెల్టుషాపులవల్లేనన్న వాస్తవాలు తెలిసినా పాలకులు పట్టించుకోవడంలేదు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ‘బెల్ట్‌షాపులను పూర్తిగా నియంత్రిస్తాం....మద్యమే పరమావధిగా వ్యవహరించం.’ ఇదీ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయడు చేసిన వాగ్దానం. అధికారానికి వచ్చాక ప్రమాణస్వీకార వేదికపై చేసిన తొలి సంతకాల్లోనూ బెల్టు నియంత్రణ ఫైల్ ఉంది. కానీ అవేవీ అమలుకు నోచుకోలేదు. ఎక్కడికక్కడ దర్శనమిస్తున్న బెల్ట్‌షాపులే ఈ వాస్తవానికి సజీవ సాక్ష్యాలు. గతంలో చాటు మాటుగా నిర్వహించే బెల్టు విక్రయాలు నేడు బార్లా తెరచుకుంటున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలుండటం వల్ల అధికారులు సైతం వాటిపై కన్నెత్తయినా చూడటం లేదు. ఫలితంగా టీడీపీ అధికారంలోకి వచ్చాక విక్రయాలు భారీగా పెరిగాయి.
అద్దు... అదుపు లేని సారా
ప్రభుత్వ మద్యమే ఏరులై పారుతుందనుకుంటే దానికి సారా తోడైంది. ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ సారా విచ్చల విడిగా తయారవుతోంది. ఎక్కడికక్కడ రవాణా జరుగుతోంది. ఇప్పుడీ నాటుసారా ఎంతమంది ప్రాణాలు తీసేస్తుందో ఎవరికీ తెలియడం లేదు. మొత్తానికి అటు ప్రభుత్వ మద్యానికి, ఇటు సారాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. తినడానికి తిండి లేకపోయినా, చేయడానికి పనిలేకపోయినా తాగడానికి మద్యం మాత్రం దొరుకుతుండటంతో ఎంతోమంది ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడుతున్నారు. విచ్చలవిడిగా ఏర్పాటైన బెల్టుషాపుల్లో కల్తీ మద్యం విక్రయాలు చేపడితే ఎంతమంది ప్రాణాలు గాలిలో కలసిపోతాయో వేరే చెప్పనవసరం లేదు. అప్పుడు ప్రభుత్వమే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
నాటి పోరాటం ఏమైందో...
గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో మద్యం ఏరులై పారుతుందని, సిండికేట్లు చెలరేగిపోతున్నారని సాక్షాత్తూ చంద్రబాబునాయుడే ప్రతిపక్ష నేత హోదాలో జిల్లా కొచ్చి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. నాడు పెద్ద హైడ్రామాయే సృష్టించారు. ఇప్పుడాయనే ముఖ్యమంత్రి అయ్యాక వాడవాడలా పెద్ద ఎత్తున ఏర్పాటైన బెల్టుదుకాణాలను నిలువరించలేకపోతున్నారు. దీనికి కారణం తమ్ముళ్ల ఒత్తిళ్లేనా.. అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఎంఆర్‌పీకి మించి విక్రయాలు
దీనికి తోడు గరిష్ట విక్రయ ధరకు మించి అమ్మకాలు సాగిస్తోంది. ఒక్కో బాటిల్‌పై రూ. 10 నుంచి రూ. 15వరకు పెంచి విక్రయించడంతో మద్యంబాబులు దోపిడీకి గురవుతున్నారు. గతేడాది ఎంఆర్‌పీకి మించి చేపట్టిన విక్రయాలపై మంత్రి మృణాళిని ఎక్సైజ్ అధికారులు సమావేశం పెట్టి నానా రాద్ధాంతం చేశారు. ఈ సారి ఏమైందో తెలియదు గానీ యథేచ్ఛగా వాటిని ఉల్లంఘిస్తున్నా నోరుమెదపడంలేదు. అధికారికంగా ఏర్పాటైన దుకాణాల్లోనే దోపిడీ ఇలా సాగుతుంటే... ఇక బెల్టు షాపుల్లో ఎంతలా దోచేస్తున్నారో వేరే చెప్పనవసరం లేదు.
బెల్టు బార్లా...
Published Thu, Apr 28 2016 12:00 AM | Last Updated on Fri, Aug 17 2018 7:44 PM
Advertisement
Advertisement