వీరికి ఫీజులెప్పుడు? | there is no fees reimbursement for students! | Sakshi
Sakshi News home page

వీరికి ఫీజులెప్పుడు?

Published Wed, May 7 2014 1:42 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM

వీరికి ఫీజులెప్పుడు? - Sakshi

వీరికి ఫీజులెప్పుడు?

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పుల నిధుల విడుదలలో తీవ్ర జాప్యం
పరీక్షలు పూర్తవుతున్నా పట్టని అధికారులు
9,00,000-ఫీజులు అసలే అందని విద్యార్థులు
4,00,000-పరిశీలనకు నోచుకోని దరఖాస్తులు
5,00,000-పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు


 సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో ప్రస్తుతం అనేక కోర్సులకు పరీక్షలవుతున్నా సర్కారు నుంచి మాత్రం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఊసేలేదు. ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందన్న భరోసాతో ఉన్నత చదువుల్లో చేరిన పేద విద్యార్థులకు ఆందోళన తప్పడం లేదు. ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తికావస్తున్నప్పటికీ ఫీజులు అందక లక్షలాది మంది పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏటా జరుగుతున్నట్లే ఈసారి కూడా ఫీజుల చెల్లింపు ప్రహసనంలా మారింది. ఇప్పటికే ఇంటర్, డిగ్రీ పరీక్షలు పూర్తి కాగా, కొద్ది రోజుల్లో ఇంజనీరింగ్, మెడికల్ పరీక్షలూ ముగియనున్న తరుణంలో కూడా లక్షల సంఖ్యలో ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తులు ఇంకా పరిశీలన దశలో ఉండటమే పరిస్థితికి అద్దం పడుతోంది. ఏటా అక్టోబర్ నుంచి మార్చి లోపు రెండు విడతల్లో ప్రభుత్వం ఫీజులు చెల్లించాల్సి ఉండగా, 2013- 14 విద్యాసంవత్సరంలో ఇప్పటి వరకు మొదటి విడతే అరకొరగా అందింది. స్కాలర్‌షిప్పుల పరిస్థితీ అంతే. దరఖాస్తుల స్వీకరణ మొదలుకొని వాటి పరిశీలన, బడ్జెట్ విడుదల వరకు అధికార యంత్రాంగంలో అడుగడుగునా చూపుతున్న నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. రాష్ర్ట విభజన నేపథ్యంలో అపాయింటెడ్ డే అయిన జూన్ 2 తర్వాత రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరితే తప్ప విద్యార్థులకు ఫీజులు అందే పరిస్థితి కనిపించడం లేదు.
 
 18.73 లక్షల  మందికే మంజూరు
 
 ప్రస్తుత విద్యా సంవత్సరానికి 27.85 లక్షల మంది విద్యార్థులు ‘ఈ పాస్’ వెబ్‌సైట్ ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఇంతవరకు 23.63 లక్షల దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తయింది. పరిశీలించిన వాటిలో 4.89 లక్షల దరఖాస్తులు ఆయా జిల్లా అధికారుల వద్దే ఇంకా పెండింగ్‌లో ఉండగా మిగిలిన 18.73 లక్షల దరఖాస్తులకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్/స్కాలర్‌షిప్పులు విడుదలయ్యాయి. అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పరిశీలనకే నోచుకోని దరఖాస్తుల గురించి అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తే జిల్లాల స్థాయిలో జరగాల్సిన పనికి తామెలా బాధ్యులమవుతామని ఎదురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాల్లోని సంక్షేమ శాఖ అధికారులు మాత్రం తప్పును కళాశాలలు, విద్యార్థులపైకి నెట్టేస్తుండడం గమనార్హం.
 
 అరకొరగానే నిధుల విడుదల
 
 ప్రస్తుత విద్యా సంవత్సరానికి అందిన మొత్తం దరఖాస్తులకు గాను సర్కారు రూ. 4,714.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఫీజు రియింబర్స్‌మెంట్‌కు రూ. 3,623.31 కోట్లు కాగా, స్కాలర్‌షిప్పులకు రూ. 1,090.94 కోట్లు. కేవలం పరిశీలన పూర్తయిన 23.63 లక్షల దరఖాస్తులకైనా రూ. 4,129.72 కోట్లు అవసరం. కానీ ఇప్పటి వరకు విద్యార్థులకు చెల్లించింది కేవలం రూ. 1,811.46 కోట్లు. ఇందులో ఫీజు రీయింబర్స్‌మెంటు కింద విడుదలైన మొత్తం రూ. 1477.01 కోట్లు మాత్రమే. స్కాలర్‌షిప్పుల రూపంలో రూ. 334.45 కోట్లు విడుదలయ్యాయి. కాగా ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం కేటాయించిన బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేస్తున్నప్పటికీ, ఆ మొత్తంలో సింహభాగం పాత బకాయిల చెల్లింపులకే సరిపోతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ. 5,694.17 కోట్లు విడుదల చేయగా, మూడొంతుల భాగం పాత బకాయిల చెల్లింపులకే సరిపోయినట్లు తెలుస్తోంది. కాగా, వచ్చే విద్యా సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్ నుంచి కూడా గత నెల 24న రూ. 749.89 కోట్లు విడుదల చేయగా, అది కూడా బకాయిలు సర్దడానికే సరిపోయినట్లు సమాచారం. 2011 నుంచి అధికారులు ఏటా అంతకుముందు ఏడాది ఫీజు బకాయిలను ఇలా సర్దుతూ వస్తున్నారు. దీంతో విద్యార్థులకు సంబంధించిన ఫీజులు ఎప్పుడూ అరకొరగానే కాలేజీలకు అందుతున్నాయి. దీంతో పరీక్షల సమయంలో ఫీజుల గురించి యాజమాన్యాల నుంచి విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ సమస్య ఇప్పటికే పలుమార్లు తెరపైకి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది విద్యార్థులకు సైతం ఇక వచ్చే విద్యా సంవత్సరంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు ఉంటాయని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రం విడిపోతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌నే  రెండు రాష్ట్రాలకు సర్దాల్సిన పరిస్థితి తలెత్తనుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం అంచనాలు కూడా తయారు చేసింది.


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement