ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : చినిగిన చొక్కా అయిన తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అన్నారు ఓ మహాకవి. అలాంటి పుస్తకాలకు నిలయమైన గ్రంథాలయాలకు జిల్లాలో భవనాలు సొంత భవనాలు కరువయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా స్థలం సమకూరడం లేదు. జిల్లాలో 52 గ్రంథాలయాలు ఉండగా.. వీటిలో 14 సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. 36 ఉచిత అద్దె అభవనాల్లో, మరో రెండు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఉచిత అద్దె భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఇరుకైన గదుల్లో, అసౌకర్యాల మధ్య పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు.
స్థలాలు కరువు..
మండల కేంద్రాల్లో గ్రంథాలయ భవన నిర్మాణానికి రెండు గుంటల స్థలం కావాలి. ఆ మేరకు ప్రభుత్వ స్థలం గుర్తించడానికి రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వ భూమిని గుర్తించి అందజేస్తే రూ.పది లక్షల నుంచి రూ.15లక్షలు వెచ్చించి గ్రంథాలయ భవనాన్ని నిర్మించేందుకు కలకత్తాకు చెందిన రాజా రాంమోహన్‌రాయ్ ఫౌండేషన్ సిద్ధంగా ఉంది. జిల్లాలో 38 మండలాల్లో గ్రంథాలయాల భవనాలు అవసరమున్నా అధికారులు స్పందించడం లేదు. వర్షాకాలంలో పుస్తకాలు తడిసి పనికి రాకుండా పోతున్నాయి. సరైన భవనాలు లేక.. ఇరుకు గదుల్లో ప్రశాంతత కరువై పాఠకులు గ్రంథాలయం వైపు రావడం తగ్గిపోతోంది.
కలెక్టర్ గారూ చొరవ చూపరూ..
గ్రంథాలయాల భవన నిర్మాణానికి కలెక్టర్ చొరవ చూపాలని పాఠకులు కోరుతున్నారు. ఆర్డీవోలు, తహశీల్దార్లు, పంచాయతీరాజ్ అధికారులు గ్రంథాలయాలకు స్థలాలు సేకరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఁసాక్షి* దినపత్రికలో ప్రచురితమైన కథనాలకు అప్పట్లో కలెక్టర్ అహ్మద్‌బాబు స్పందించారు. స్థల సేకరణ విషయంలో చొరవ చూపాలని ఆర్డీవోలను ఆదేశించినా అధికారులు ఇప్పటివరకు ఆ దిశగా దృష్టి సారించలేదు.
భవనాలు లేని మండలాలు..
బాసర, బజార్‌హత్నూర్, బెల్లంపల్లి, భీమిని, బోథ్, దండేపల్లి, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, జైనథ్, జైనూర్, జైపూర్, జన్నారం, కడెం, కెరమెరి, ఖానాపూర్, కుభీర్, కుంటాల, కోటపల్లి, కౌటాల, లోకేశ్వరం, లక్సెట్టిపేట, మామడ, ముథోల్, నిర్మల్, నెన్నెల, నేరడిగొండ, నార్నూర్, పెంబి, రెబ్బెన, సిర్నూర్(యు), తలమడుగు, తాండూర్, తానూర్, ఉట్నూర్, వాంకిడి మండలాల్లో సొంత భవనాలు లేవు. కాసిపేట, తాంసి మండలాల్లో గ్రంథాలయాలు నిర్మాణ దశలో ఉన్నాయి.
గ్రంథాలయాలకు స్థలమేదీ..?
Published Sat, Feb 8 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement