మహబూబ్‌నగర్ కల్చరల్, న్యూస్‌లైన్: సీమాంధ్ర పాలకుల చేతుల్లో కులవృత్తులు కనుమరుగయ్యాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే వాటికి మహర్దశ వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ గజిటెడ్ ఆఫీసర్స్ అసోషియేషన్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.
జిల్లా గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రూపొందించిన 2014 క్యాలెండర్‌ను ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల వృత్తులకు ఆదరణ లేనందున గ్రామీణ ప్రాంతాల్లో శ్రమైక జీవనానికి ప్రతి బంధకాలు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో గొర్రెలు, మేకల పెంపకంపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
గొర్రెల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ ఘటనలపై పోలీసులు సత్వర విచారణచేసి, దొంగలను కఠినంగా శిక్షించాలని కోరారు. పంట పొలాల్లో, కొండలు, గుట్టల్లో తలదాచుకొని జీవాలను సంరక్షించుకునే కాపరులకు భద్రత కలిగించడానికి జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.దేవేందర్, ప్రధాన కార్యదర్శి కార్తీక్ యాదవ్, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.ప్రభాకర్, నాయకులు చందూయాదవ్, గొండ్యాల రమేశ్ యాదవ్, గోపాల్ యాదవ్, రాముయాదవ్ పాల్గొన్నారు.
తెలంగాణలో కులవృత్తులకు మహర్దశ
Published Mon, Jan 13 2014 3:29 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement