మెరుగుపెడతామంటూ.. నిలువునా మోసం | thieves escape with seven shekels gold | Sakshi
Sakshi News home page

మెరుగుపెడతామంటూ.. నిలువునా మోసం

Published Tue, Jan 28 2014 11:43 PM | Last Updated on Thu, Aug 2 2018 4:53 PM

thieves escape with seven shekels gold

శంకరాపురం (శంషాబాద్ రూరల్), న్యూస్‌లైన్:  బంగారు నగలకు మెరుగు పెడతామంటూ మహిళలను నమ్మించి ఏడు తులాల బంగారు మంగళసూత్రాలను ఎత్తుకెళ్లిన సంఘటన శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. ఇద్దరు ఆగంతకులు మంగళవారం ఉదయం బైక్‌పై మండలంలోని శంకరాపురం గ్రామానికి వచ్చారు. వెండి, బంగారు నగలకు మెరుగుపెడతామంటూ గ్రామంలో తిరిగారు. ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఊరి చివరన ఉన్న జెజ్జెల రాజు, కుమార్ సోదరుల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంటి వద్ద వారి భార్యలు సుమలత, లావణ్య ఉన్నారు.

దుండగులు తమ వద్ద ఉన్న పౌడర్‌తో ఇత్తడి వస్తువులకు మెరుగుపెడతామని చెప్పారు. వారు ఇంట్లోంచి ఇత్తడి దీపం తెచ్చిచ్చారు. పౌడర్‌తో కొద్దిసేపు కడిగి మెరిసేలా చేశారు. వెండి నగలకు కూడా మెరుగు పెడతామని చెప్పగా లావణ్య తన కాళ్ల పట్టీలు తీసిచ్చింది. వాటికీ మెరుగు పెట్టిన తర్వాత బంగారు నగలిస్తే వాటినీ మెరిసేలా చేస్తామని నమ్మబలికారు. దీంతో తోడికోడళ్లు తమ ఒంటిపై ఉన్న బంగారు మంగళ సూత్రాలను తీసిచ్చారు.

వాటిని ఇంట్లోని వంట గదిలోకి తీసుకెళ్లి ఒక చిన్న గిన్నెలో పసుపు కలిపిన నీళ్లలో వేశారు. ఆ సమయంలో ఒకరు ఇంట్లో ఉండగా మరొకరు సమీపంలో నిలిపిన బైక్ వద్దకు వెళ్లాడు. లోపలికి వెళ్లిన ఆగంతకుడు నగలను కుక్కర్‌లో వేసి పది నిమిషాలు వేడి చేస్తే ధగధగలాడతాయని నమ్మించి వాటిని కుక్కర్‌లో వేసినట్లు చేసి కాజేశాడు. ఇద్దరూ కలిసి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు.

 ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు
 గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వెళ్తుండడం చూసి స్థానికులకు అనుమానం వచ్చింది. వీరు ఎవరి ఇంటి నుంచి వస్తున్నారని ఆరా తీయడం మొదలు పెట్టారు. తాము మోసపోయామని తెలియని లావణ్య, సుమలత ఇంటి బయట నిలబడి ఉన్నారు. ఇంతలో ఓ యువతి వచ్చి మీ ఇంట్లోంచి ఎవరైనా వెళ్లారా, ఏదో ఎత్తుకెళ్లినట్లున్నారు అంది. మాకు ఓ కంపెనీ వారు పౌడర్ ఇచ్చారు.. మా ఇంట్లో నుంచి ఏమి తీసుకెళ్లలేదు అని వారు సమాధానం ఇచ్చారు.

మీ ఒంటిమీద మంగళసూత్రాలు ఏమయ్యాయని ఆ యువతి అడగ్గా వంటింట్లో కుక్కర్‌లో పెట్టి వేడి చేస్తున్నామని చెప్పారు. ఒకసారి వెళ్లి నగలు ఉన్నాయో లేదో చూసుకోండి అని యువతి సూచించింది. తోడికోడళ్లు పరుగున వెళ్లి కుక్కర్ తెరిచి చూస్తే అందులో నగలు కనిపించలేదు. దీంతో ఇద్దరూ లబోదిబోమంటూ బయటికి వచ్చారు. విషయం తెలుసుకున్న స్థానికులు బైక్‌లపై గ్రామం నలుమూలలా వెతికినా ప్రయోజనం లేకపోయింది.

సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ నర్సింహ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారం రోజుల క్రితం మొయినాబాద్ మండలం సురంగల్‌లోనూ ఇదే తరహా మోసానికి పాల్పడిన విషయం తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement