ఆ నాలుగు రోజులూ పెళ్లి సందడే
అమలాపురం :వచ్చేది శూన్యమాసం.. నాలుగు నెలల పాటు శుభకార్యాలు నిర్వహించే అవకాశం లేదు. అందుబాటులో రెండు బ్రహ్మాండమైన ముహూర్తాలు. ఇం కేం.. ముందుగా కుదుర్చుకున్నవారే కాకుండా ఇప్పటికిప్పుడు సంబంధాలు కుదుర్చుకున్నవారూ తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో వచ్చే వారంలో జిల్లాలో పెళ్లి భాజాలు ఘనంగా మోగనున్నాయి. ఈనెల 13, 14,15,19 తేదీల్లో శుభముహూర్తాలు రావడంతో జిల్లాలో వేలాది పెళ్లిళ్లు జరగనున్నాయి. పెళ్లిళ్లే కాదు.. గృహప్రవేశాలు, కొత్త వ్యాపార సంస్థలు, దుకాణాల ఆరంభం వంటి కార్యక్రమాలు జోరుగా సాగనున్నాయి.
13వ తేదీన రాత్రి 7.54 గంటలకు, 12.33 గంటలకు, 14న రాత్రి 7.54, అర్ధరాత్రి 12.36, తిరిగి తెల్లవారు జామున 3.21కి, 15న రాత్రి 12.29కి, 19న తెల్లవారు జామున నాలుగు గంటలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. వీటిలో 14న తెల్లవారుజామున 3.21, 15న అర్ధరాత్రి 12.29 గంటల ముహూర్తాలు మిథునలగ్నంలో రావడంతో ఈ రెండు రోజులు జిల్లా వ్యాప్తంగా వేలాది పెళ్లిళ్లు, గృహప్రవేశాలు జరగనున్నాయి. ఈ నెల 25 నుంచి శూన్య మాసం మొదలవుతోంది. దీంతో డిసెంబర్ వరకూ ముహూర్తాలు లేవు. డిసెంబరులో ముహూర్తాలున్నా అవి చెప్పుకునేంత పెద్దవి కావు. బలమైన ముహూర్తాలు కావాలంటే ఫిబ్రవరి, మార్చి వరకూ వేచి చూడాల్సిందే.
ఈ కారణాల వల్లే ఈ నాలుగు రోజుల్లో పెళ్లిళ్లు గృహప్రవేశాలు పూర్తి చేస్తున్నారు. 14న ఒక్కరోజే జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని సన్నిధిలో వెయ్యి వరకు వివాహాలు జరగనున్నాయి. మిగిలిన ముహూర్తాల సమయంలో కూడా భారీగానే పెళ్లిళ్లు జరిగే అవకాశముంది. జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. అమలాపురం శ్రీభూసమేత వెంకటేశ్వరరావు ఆలయంలో 150 వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశముంది. సమయం దగ్గర పడే నాటికి వీటి సంఖ్య ఇంకా పెరుగుతుందని దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
అన్నీ గిరాకీనే
అటు పెళ్లిళ్లు.. ఇటు గృహప్రవేశాలు.. వేలాది సంఖ్యలో జరుగుతుండడంతో పురోహితుల వద్ద నుంచి వంట మేస్త్రుల వరకు, లైటింగ్ నుంచి పూల డెకరేషన్ వరకు గిరాకీ ఏర్పడింది. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం వంటి పట్టణాలతోపాటు మున్సిపాలిటీలు, మేజర్ పంచాయతీలు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే కల్యాణమంటపాలు బుక్కయ్యాయి. ఇప్పుడు ముహూర్తాలు పెట్టుకుంటున్నవారు ప్రైవేట్ పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలపై ఆధారపడుతున్నారు. మిగిలినవారికి ఖాళీస్థలాలు.. ఇంటి ముందు రోడ్లే వివాహ వేదికలు కానున్నాయి. అయితే వర్షాకాలం కావడం వల్ల ఎక్కువ మంది కల్యాణ మంటపాలకే మొగ్గు చూపుతున్నారు. పురోహితులకు, వంటవారికి చేతి నిండా పనే అన్నట్టుగా ఉంది. లైటింగ్, బ్యాం డ్ మేళాల వారు సైతం ఇప్పటికే శ్రావణమాసం కారణంగా అరటి, పువ్వుల ధరలకు రెక్కలొచ్చాయి. ముహూర్తాలు దగ్గర పడే కొద్దీ వీటి రేటు పెరుగుతుందని వ్యాపారులు అంచనా.