విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
సాక్షి, అనంతపురం : ‘‘గత ఐదేళ్లూ మంత్రిగా ఉన్న మీరు రాప్తాడు పంచాయతీలోని గంగలకుంట చెరువుకూ నీళ్లెందుకు ఇవ్వలేక పోయారు..?, ధనదాహంతో జంగాలపల్లి ఎఫ్‌సీఐ గోదామును మీరే మూయించింది నిజం కాదా..? అక్కడ పని చేస్తున్న కార్మికుల పొట్ట కొట్టింది మీరు కాదా..?, కక్కలపల్లి సమీపంలో ప్రైవేట్ టమాట మండీలో తిష్టవేసిన మీ బంధువులు, అనచరులు రైతుల నుంచి పదిశాతం పన్ను వసూళ్లు చేస్తూ దోచుకున్నది వాస్తవం కాదా..?, 2016 నుంచి నీళ్లొస్తున్నా మీ సొంత మండలంలోని పేరూరు డ్యాంకు ఎందుకు నీళ్లివ్వలేకపోయారు...?’’ అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాజీ మంత్రి పరిటాల సునీతను ప్రశ్నించారు.
ఆదివారం సాయంత్రం ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వంద రోజుల్లో రాప్తాడు నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు వేశామనీ. గంగలకుంట చెరువుకు నీళ్లు ఇచ్చేందుకు ఇప్పటికే సర్వే పూర్తి చేయించామన్నారు. పీఏబీఆర్ కుడికాలువకు నీళ్లివ్వగానే గంగలకుంట చెరువుకు నీళ్లిస్తామన్నారు. పరిటాల సునీత మూసివేయించిన ఎఫ్‌సీఐ గోదామును తెలిపించి కార్మికులకు ఉపాధి కల్పించేందుకు డిల్లీకి వెళ్లి ఎఫ్‌సీఐ సీఎండీని కలిసి విన్నవించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇస్తే అక్కడే కొనసాగిస్తామని వారు చెప్పగా... ఇదే విషయాన్ని అధికారులతో కలిసి విన్నవించగా... సానుకూలంగా స్పందించారన్నారు.
టమాటా మండీతో దోచుకున్నారు
అనంతపురం రూరల్ కక్కలపల్లి సమీపంలో ప్రైవేట్ టమాట మండీని పరిటాల సునీత బంధువులు, అనచరులు నడుపుతున్నారనీ, పదిశాతం పన్ను రైతుల నుంచి వసూళ్లు చేస్తూ దోచుకుంటున్నా సునీత, అప్పటి ప్రభుత్వం కళ్లు మూసుకుందని ప్రకాష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో జిల్లా వ్యాప్తంగా టమాట పండించిన రైతులు ధరలు లేక కోట్లాది రూపాయలు నష్టపోయారన్నారు. అసలు మండీ నడపడానికి ఎలాంటి అనుమతులు లేవని, దీన్ని సుమోటా తీసుకుని కలెక్టర్, ఎస్పీ కేసులు నమోదు చేయొచ్చన్నారు. ఈ మండీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరామన్నారు. ఇక సునీత సొంత మండలంలోని పేరూరు డ్యాంకు అతి తక్కువ ఖర్చుతో నీళ్లివచ్చని తాము చెబితే నవ్వారనీ, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో సర్వే పూర్తి చేయించామన్నారు. త్వరలోనే జీఓ కూడా విడుదలవుతుందన్నారు.
డిసెంబరు 31లోపు పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చి డ్యాం కింద ఉన్న 10 వేల ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకొస్తామన్నారు. అనంతపురం రూరల్ పాపంపేట, కక్కలపల్లికాలనీ పంచాయతీలకు పీఏబీఆర్ తాగునీరు అందించేందుకు ప్రభుత్వం జీఓ విడుదల చేసిందనీ, పైపులైను పనులు పూర్తికాగానే నీటి సరఫరా ప్రారంభమవుతుందన్నారు. పరిటాల సునీత ఐదేళ్లు ఎమ్మెల్యేగా, మరో ఐదేళ్లు మంత్రిగా పని చేసినా పరిష్కరించలేని సమస్యను తాము 60 రోజుల్లోనే పరిష్కరించామని చెప్పేందుకు గర్వపడుతున్నామన్నారు. అలాగే నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు ఇచ్చే ప్రక్రియ మొదలైందని, రెండేళ్లలో నియోజకవర్గ రూపురేఖలు మార్చేస్తామని ప్రకాష్‌రెడ్డి స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా సీఎం పరితపిస్తున్నారనీ, వందరోజుల పాలనలో అభివృద్ధికి బీజం పడిందన్నారు. రానున్న రోజుల్లో సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందుతాయన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మహానందరెడ్డి, ముక్తాపురం లక్ష్మీనారాయణరెడ్డి, శ్రీనివాసులు, రామాంజనేయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment