తల్లివి నీవే.. జగన్మాతవూ నీవే
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి బాబా 89వ జయంత్యుత్సవాల్లో భాగంగా బుధవారం ప్రశాంతి నిలయంలో 19వ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సత్యసాయి భక్తులైన మహిళలు దేశ విదేశాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. బాబా మహాసమాధి చెంత నిర్వహించిన వేడుకల్లో పాలుపంచుకున్నారు. తల్లిగా, ఇల్లాలిగా, జగతినేలే మాతగా మహిళా ఔన్నత్యాన్ని కీర్తించారు. సత్యసాయి 70వ జన్మదిన వేడుకలలో భాగంగా తొలిసారిగా 1996 నవంబర్ 19న మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.
అప్పటి నుంచి ప్రతియేటా కొనసాగిస్తూ వస్తున్నారు. మహిళా దినోత్సవాన్ని సత్యసాయి సేవా సంస్థలలోని మహిళా విభాగమే నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం మహిళా క్యాంపస్‌కు చెందిన విద్యార్థినుల వేదమంత్రోచ్ఛారణతో వేడుకలు ప్రారంభమయ్యాయి. బ్రాస్‌బ్యాండ్ వాయిద్య బృందం సత్యసాయికి తమ హృదయ నివేదనను అర్పించింది.
వేడుకలకు ముఖ్యఅతిథిగా ముంబాయి యూనివర్సిటీ విశ్రాంత వైస్ చాన్సలర్ డాక్టర్ స్నేహలత దేశ్‌ముఖ్ హాజరయ్యారు. మహిళా దినోత్సవ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఈశ్వరాంబ ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ కేపీ సాయిలీల, ట్రస్ట్ సభ్యురాలు మాధురీ నాగానంద్, అనంతపురం మహిళా క్యాంపస్ డెరైక్టర్ ప్రొఫెసర్ మధు కపాణి తదితరులు పాల్గొన్నారు.