విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం జిల్లాపై తీవ్రంగా చూపుతోంది. చిన్న దుకాణాల నుంచి షాపింగ్ మాల్స్ వరకు అన్నింటికి పెద్ద దెబ్బ తగిలింది. వ్యాపారులకు రౌ. కోట్లలో నష్టం వాటిల్లుతోంది. రెండు నెలలుగా జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల పండగల నెలల్లో కూడా వ్యాపారాలు వెలవెలబోతున్నాయి. ఉద్యోగులకు జీతాలు లేకపోవడంతో వారి కుటుంబ పోషణ కష్టంగా మారింది. రోజూ నిరసనలు, ఆందోళనలు, బంద్‌లు ప్రభావం ప్రైవేటు ఉద్యోగులపై కూడా పడింది.
దీంతో జిల్లాలో దసరా పండగ సందడి కనిపించడం లేదు. సాధారణంగా ఏటా దసరాకు రెండు వారాల ముందు నుంచే పండగ వాతావరణం కనిపిస్తుంటుంది. విశాఖతోపాటు జిల్లాలోని ప్రధాన జంక్షన్లు, షాపింగ్ మాల్స్ కొనుగోలుదారులతో కళకళలాడుతుండేవి. కానీ ఈ ఏడాది మాత్రం అటువంటి పరిస్థితులు లేవు. పండగకు పది రోజులే ఉన్నప్పటికీ షాపింగ్ సందడి లేకుండా పోయింది.
వెయ్యి కోట్లు లావాదేవీలకు దెబ్బ
ఉద్యమాల కారణంగా జిల్లాలో రూ.వెయ్యి కోట్లు లావాదేవీలకు దెబ్బ తగిలినట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఏటా దసరా పండగ సమయంలో ప్రధానంగా బంగారం, వస్త్ర, గృహోపకరణాల వ్యాపారం రూ.కోట్లలో జరుగుతుంది. రెండు వారాల్లో రూ.వెయ్యి కోట్లు మేర వ్యాపారం జరుగుతుందన్నది వ్యాపారుల అంచనా. కానీ ఈ ఏడాది మాత్రం 50 శాతం కూడా వ్యాపారాలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. జిల్లాలో సుమారుగా 35 వేల మంది ఉద్యోగులకు జీతాలు లేకపోవడంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో ఏటా మాదిరిగా ఈసారి మాత్రం ఆర్భాటంగా పండగను చేసుకొనే పరిస్థితులు లేవని చెబుతున్నారు. ప్రయివేట్ ఉద్యోగులు కూడా ఈ ఏడాది ఆర్భాటాలకు దూరంగా ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాలో వ్యాపారాలు పూర్తిగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. రూ.కోట్లలో నష్టాలు వాటిల్లుతున్నా సమైక్యాంధ్ర ఉద్యమంలో వ్యాపారులు కూడా పాల్గొంటున్నారు. అసోసియేషన్ల వారీగా వస్త్ర, బంగారం, చిల్లర వర్తకులు, ఇలా అన్ని రకాల వ్యాపారులు బంద్‌లు నిర్వహిస్తున్నారు. దీంతో పెద్దగా వ్యాపారాలు జరగడం లేదు. జిల్లాలో ప్రతి చోటా ఉద్యమాలు జరుగుతుండడంతో ప్రజలు కూడా షాపింగ్‌లపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
పడిపోయిన పసిడి అమ్మకాలు
జిల్లా వ్యాప్తంగా ఉన్న బంగారు, వెండి దుకాణాల్లో రోజుకు రూ.50 కోట్లకుపైగా అమ్మకాలు జరుగుతుంటాయి. కానీ ఉద్యమాల కారణంగా వ్యాపారాలు బాగా పడిపోయిన్నట్లు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ సమయంలో బంగారం వ్యాపారులు సమ్మె చేయడం, ప్రస్తుతం సీజన్ లేకపోవడంతో రూ.100 కోట్లు వరకు అమ్మకాలు నిలిచిపోయాయని వర్తకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన బ్రాండెడ్ బంగారు దుకాణాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రోజుకు ఆరేడు కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లుతోందని ఈ రంగంపై ఆధారపడిన వారు అంచనా వేస్తున్నారు.
వెలవెలబోతున్న వస్త్ర వ్యాపారం
జిల్లాలో వస్త్ర వ్యాపారం కూడా డీలాపడింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 5 వేలకుపైగా వస్త్ర వ్యాపార దుకాణాలున్నాయి. భారీ షాపింగ్ మాల్స్ సైతం ఉన్నాయి. రోజుకు రూ.5 కోట్లు వరకు అమ్మకాలు జరుగుతుంటాయి. దసరా సమయంలో రెట్టింపు వ్యాపారాలు జరుగుతాయి. ప్రస్తుతం కనీస వ్యాపారం కూడా జరగడం లేదు. దసరా దగ్గర పడుతున్నా ఇప్పటికీ వ్యాపారాలు పుంజుకోవడం లేదు. సాధారణంగా దసరా పండగకు రెండు వారాల ముందు నుంచే అన్ని షాపులు ఆఫర్లు ఇస్తుంటాయి. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు భారీ స్థాయిలో ఆఫర్లు గానీ, సందడి గాని లేదు. అమ్మకాలు అంతంత మాత్రంగానే జరుగుతుండడంతో వ్యాపారులు కూడా ఆర్భాటాల ఖర్చును తగ్గించుకోవాలన్న భావనలో ఉన్నారు. దసరాకు ఇంకా పది రోజులు సమయం ఉండడంతో వ్యాపారాలు పుంజుకోవచ్చని వ్యాపారులు ఆశాభావంతో ఉన్నారు.
దసరా ఢమాల్
Published Fri, Oct 4 2013 2:03 AM | Last Updated on Sat, Sep 29 2018 5:52 PM
Advertisement
Advertisement