
వందకు బదులు వెయ్యి రూపాయలు
ఇది ఎస్‌బీఐ ఏటిఎం. ఐదు వందల రూపాయలు కావాలంటే ఐదు వేలు వస్తున్నాయి.
కొత్తవలస: ఇది ఎస్‌బీఐ ఏటిఎం. ఐదు వందల రూపాయలు కావాలంటే ఐదు వేలు వస్తున్నాయి. ఇంకేముంది. తెలిసిన వాళ్లంతా ఎగబడి మరీ లాగేశారు. ఇలా రూ. 5 లక్షల వరకూ నొక్కేశారట. విజయనగరం జిల్లా కొత్తవలస-సబ్బవరం రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ వింత చోటుచేసుకుంది. స్థానిక విజయనగరం రోడ్డులో ఉన్న ఒక ప్రైవేట్ హోటల్ యజమాని ఒక్కరే రూ. 30 వేలు విత్‌డ్రా చేసినట్లు భోగట్టా.
నాలిక్కరుచుకున్న స్థానిక ఎస్‌బీఐ సిబ్బంది వెంటనే ఏటీఎం మిషన్‌ను సరిచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మిషన్‌లో మూడు బాక్సులుంటాయని, వాటిలో వంద, ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు అమర్చాల్సి ఉంటుందన్నారు. అయితే వంద రూపాయల నోట్ల స్థానంలో వెయ్యి రూపాయలు ఉంచడం వల్ల ఈ సమస్య ఏర్పడిందన్నారు. ఏఏ అకౌంట్‌ల ద్వారా డబ్బులు విత్‌డ్రా అయ్యాయో తెలుస్తుందని, వారి నుంచి నగదు మళ్లీ లాగేస్తామని తెలిపారు.