ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రైతుల సంక్షేమార్థం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని నగదు బదిలీ పేరుతో నీరుగార్చేందుకు ప్రభుత్వం సన్నద్ధంకావడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని యూనిట్ల వరకే ఉచిత విద్యుత్‌ను పరిమితం చేసి రైతులపైనా భారం మోపడంతోపాటు అంతిమంగా వ్యవసాయ కనెక్షన్లకూ మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నూతన విధానం అమలులోకి వస్తే.. వ్యవసాయానికి వినియోగించుకున్న కరెంటులో నిర్ణీత యూనిట్ల మేరకే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అది కూడా రైతులు ముందుగా బిల్లు మొత్తం కట్టేశాక సబ్సిడీ సొమ్మును బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉండడంతో రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే రైతులు ఏటా వ్యవసాయంలో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. దీనికితోడు గిట్టుబాటు ధరలు లేక ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఈ నేపథ్యంలో సాగు చేయలేమని చేతులెత్తేసే పరిస్థితి ఉండగా ఆదుకోవాల్సిన సర్కారు ఉచిత విద్యుత్‌నూ లాగేసే ప్రయత్నం చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రైతులపై భారం వేసేందుకే..
జిల్లాలో 89,102వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 79,031 వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ పథకం అమలవుతోంది. ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు లేవు. జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్‌ఫార్మర్లకు 318శాంపుల్ మీటరింగ్ ఏర్పాటుచేసి రైతులు ఎన్ని యూనిట్లు వినియోగిస్తున్నారో అంచనా వేస్తున్నారు. ఎంత విద్యుత్‌ను వ్యవసాయానికి సరఫరా చేస్తున్నారో లెక్కించి.. ఆ మేరకు ఎన్‌పీడీసీఎల్‌కు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అయితే నగదు బదిలీ పథకం అమలుకు ఇది ఆమోదయోగ్యంకాదని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయవిద్యుత్‌కు మీటర్లు లేకపోవడంతో ఫలాన రైతు కచ్చితంగా ఎంత విద్యుత్ వినియోగించాడనే విషయం తెలుసుకోవడం కష్టం.
లెక్కింపు ఇలా..
ప్రస్తుతం ఉచిత విద్యుత్ వినియోగాన్ని ఈ విధంగా లెక్కిస్తున్నారు. 5హార్స్ పవర్ (హెచ్‌పీ) మోటార్ రోజుకు 7 గంట లు విద్యుత్ వినియోగిస్తే 5.25 యూనిట్ల కరెంట్ కాలుతుం దని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 300 రోజులకు 1575 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుందని అంచనా కట్టా రు. ఇన్ని యూనిట్లకు విద్యుత్ ఉత్పత్తి అయ్యే ఖర్చును లె క్కించి ఆ సబ్సిడీని విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం ఇవ్వనుం ది. తద్వారా కొన్ని యూనిట్ల వరకు మాత్రమే సబ్సిడీ ఇచ్చి అంతకుమించితే మొత్తం బిల్లులు రైతులే చెల్లించాలన్న ని బంధన విధించనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రభుత్వ నిర్ణయూన్ని రైతులంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. లేనిపక్షంలో వ్యవసాయం ఇక కష్టమేనని పేర్కొంటున్నారు.
ఎత్తివేయడానికి కుట్ర
మాంగ్‌రుడ్ శివారులో నాకు పదెకరాల చేనుంది. నా సర్వీస్ నంబర్ 149. ఉచిత విద్యుత్‌పై ఆధారపడి రెండు కాలాల్లో వ్యవసాయం చేసుకుంటున్న. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నగదు బదిలీ పేరిట మీటర్లు బిగించాలనుకోవడం సరికాదు. ఇది వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్ ఎత్తివేయడానికి జరుగుతున్న కుట్రనే. దీన్ని ప్రభుత్వం విరమించుకోవాలి. లేకపోతే వ్యవసాయం చేయడం కష్టం.
- టాక్రే మంగేశ్, మాంగ్‌రుడ్, బేల మండలం
ఇప్పుడున్న విధానమే బాగుంది
నాకు జైనథ్‌లో రెండున్నర ఎకరాల భూమి ఉంది. చేన్లకు ఇచ్చే కరెంటు కనెక్షన్ విషయంలో ఇప్పుడున్న విధానమే బాగుంది. ఇప్పు డు కొత్తగా ఈ కనెక్షన్లకు గవర్నమెంటు మీటర్లు ఇస్తారని అంటున్నారు. మీటర్లో వచ్చిన రీడింగ్ ప్రకారం రైతులు ముందుగా కరెంటు బిల్లు చెల్లిస్తే తర్వాత రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు గవర్నమెంటు జమచేస్తుందని చెబుతున్నారు. ఈ విధానంతో రైతులకూ మస్తు కష్టమైతది. ఇదంతా చూస్తుంటే మెల్లమెల్లగాఉచిత కరెంటు ఎత్తేస్తారేమోనని భయంగా ఉంది.
- రాళ్లబండి నారాయణ, జైనథ్ మండలం
ఆలోచన విరమించుకోవాలి
ఉచిత విద్యుత్‌ను ఎత్తేయడానికే ప్రభుత్వం నగదు బదిలీ పథకం అమలు చేయడానికి పూనుకుంది. ఇప్పటికే పంటల దిగుబడి రాక, విద్యుత్ సరిగా సరఫరా కాక ఇబ్బందులు పడుతున్న రైతులను ఈ విధానం మరింత కష్టాల్లోకి నెట్టనుంది. నగదు బదిలీ అమలు చేస్తే సాగుకు పెట్టే పెట్టుబడులకు తోడు ముందుగానే బిల్లులు చెల్లించడంతో మరింత భారం మా మీద పడుతుంది. ప్రభుత్వం ఈ ఆలోచన విరమించుకోవాలి.
- భూమారెడ్డి, యాకర్‌పెల్లి, సారంగాపూర్ మండలం
ఉచిత విద్యుత్ పై నీలినీడలు
Published Sat, Oct 26 2013 4:44 AM | Last Updated on Wed, Sep 5 2018 1:47 PM
Advertisement
Advertisement