సాక్షి, మచిలీపట్నం/విజయవాడ క్రైం, న్యూస్‌లైన్:
బందరుకు చెందిన శింగవరపు ఎస్తేర్ అనూహ్య (23) హత్యోదంతం పోలీసులు, పాలకుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ముంబైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ అనూహ్యంగా నరరూప రాక్షసుల చేతికి చిక్కి దారుణహత్యకు గురికావడంతో జిల్లాలో గతంలో జరిగిన ఘోరాలు గుర్తుకొస్తున్నాయి. అనూహ్య ఘటనతో కన్నీరుపెట్టిన జిల్లావాసులు గతం తాలూకు మానని అకృత్యాల గాయాలను ఒకమారు తరచిచూస్తున్నారు. గతంలో శ్రీలక్ష్మి, ఆయేషామీరా వంటి ఎంతోమంది యువతులపై జరిగిన దురాగతాలపై జనం పోలీసులు, పాలకుల తీరును తప్పుబడుతున్నారు. గత ఘటనలు ఒకమారు పరికిస్తే కిరాతకుల అడుగుజాడలు ఊడల మాదిరిగా పాతుకుపోతున్న వైనం కనిపిస్తుంది.
మరెన్నో మానని గాయాలు..
ఏడాది కాలంగా జిల్లాలో ఎంతో మంది మహిళలు అనేక కారణాలతో హత్యకు గురయ్యారు. గత ఏడాది ఫిబ్రవరి ఏడున భట్లపెనుమర్రులో వివాహిత చాముండేశ్వరి హత్యకు గురైంది. మార్చి 10న ఇబ్రహీంపట్నం కొండపల్లిలో అనుమానంతో భార్య కుమారిని భర్తే హత్యచేశాడు. మార్చి 24న గుంటూరులో వార్డెన్‌గా ఉద్యోగం చేస్తున్న మైలవరానికి చెందిన యువతి సూర్యలంక బీచ్‌లో హత్యకు గురైంది. జూన్ 9న చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామంలో కొమ్ము శకుంతల (55) దారుణ హత్యకు గురైంది. సెప్టెంబర్ 4న హనుమాన్‌జంక్షన్‌లో వరలక్ష్మిని చంపేశారు. సెప్టెంబర్ 7న మైలవరానికి చెందిన శ్రీలతను భర్తే హత్య చేశాడు. నవంబర్ 6న కలిదిండిలో కృష్ణకుమారిని కట్టుకున్నవాడే చంపేశాడు.
ఆగని మృగాళ్ల అకృత్యాలు ..
నిర్భయ వంటి కఠినమైన చట్టాలు వచ్చినా మృగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడలేదు. గత ఏడాది జనవరి మూడో తేదీన హాస్టల్‌లో చదువుతున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థినులను తీసుకుపోయిన ముగ్గురు యువకులను జనవరి 20న మైలవరం పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 10న మచిలీపట్నంలో 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశారంటూ నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 24న మచిలీపట్నంలో బాలికపై లైంగిక దాడికి ఒక రిక్షాపుల్లర్ ప్రయత్నించాడు. మే 3న చాట్రాయి మండలంలో వివాహితపై లైంగికదాడికి యత్నం జరిగింది. గత ఏడాది డిసెంబర్ 14 ఉయ్యూరులో 19 ఏళ్ల యువతిపై అత్యాచారయత్నం జరిగింది. పోలీసుల రికార్డులకు ఎక్కిన మృగాళ్ల అకృత్యాలు గమనిస్తే 2011లో 76మంది, 2012లో 66 మంది, 2013లో 51మంది మహిళలపై అత్యాచారాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
శ్రీలక్ష్మి నుంచి అనూహ్య వరకు...
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన రావూరి శ్రీలక్ష్మి కేసులో పోలీసులు ముందుగా స్పందించి ఉంటే ఆమె దక్కేది. విజయవాడ నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదివే శ్రీలక్ష్మిని అదే తరగతి చదివే మనోహర్ ప్రేమపేరిట వేధించాడు. దీంతో ఆమె అప్పట్లో యాంటీగూండా స్క్వాడ్ (ఏజీఎస్) పోలీసులను ఆశ్రయించింది. అయినా పోలీసులు పెద్దగా స్పందించలేదు. 2004 జూన్ 21న పరీక్షలు రాసేందుకు కాలేజీకి వెళ్లిన శ్రీలక్ష్మిని మనోహర్ కత్తితో దారుణంగా నరికి చంపాడు.
పటమటకు చెందిన కోనేరు నాగశ్రీ (15) 2006 సెప్టెంబర్ 11న దారుణ హత్యకు గురైంది. తొమ్మిదో తరగతి చదివే నాగశ్రీని అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు బలవంతంగా తీసుకెళ్లి పెనమలూరు సమీపంలో హత్య చేశారు. ఈ కేసులో నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ఎంతగానో శ్రమపడాల్సి వచ్చింది.
గుడివాడకు చెందిన రేడియో జాకీ బి.లక్ష్మీసుజాత (23) 2007 ఫిబ్రవరి 10వ తేదీన గవర్నరుపేటలోని ఓ లాడ్జిలో దారుణ హత్యకు గురైంది. తాను పనిచేసే చానల్‌లో మేకప్‌మన్‌గా పనిచేసే చందు మరో యువకుడితో కలిసి ఆమెను దారుణంగా హత్య చేశాడు. తనను ప్రేమించడం లేదనే కోపంతో నమ్మకంగా లాడ్జికి తీసుకెళ్లి హత్య చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదివే ఆయేషామీరా 2007 డిసెంబర్ 27వ తేదీన దారుణహత్యకు గురైంది. ఆమె హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జాతీయ స్థాయి హక్కుల సంఘాలు సైతం ఇక్కడికి వచ్చి విచారణ నిర్వహించాయి. అనేక వివాదాలు, అనుమానాల నడుమ ఆయేషామీరా హత్య కేసులో పాత నేరస్థుడైన సత్యంబాబును నగర పోలీసులు అరెస్టు చేశారు.
కృష్ణలంక బాపనయ్యనగర్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని మీనాకుమారిపై అదే కాలేజీకి చెందిన సందీప్ 2008 ఏప్రిల్ 9వ తేదీన కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తన ప్రేమను నిరాకరించిందనే ఆగ్రహంతో మాట్లాడే నెపంతో ఇంటికి వచ్చిన సందీప్ ఆమెపై దాడి చేసి, తానూ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కోలుకోగా.. రెండేళ్లకు ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడం విషాదకరం. మీనాకుమారిపై దాడి జరిగిన వెంటనే అప్పటి నగర పోలీసు కమిషనర్ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడేవారిపై రౌడీషీట్లు తెరవాలంటూ అప్పట్లో పోలీసు కమిషనర్ జారీ చేసిన ఆదేశాలు వణుకు పుట్టించాయి. తరచు ఈవ్‌టీజింగ్ కేసుల్లో నిందితులుగా ఉన్న 50 మందిపై రౌడీషీట్లు తెరిచారు. మరో 100 మందిపై సస్పెక్ట్ షీటు తెరిచారు.
ఆపదలో ఆడబిడ్డ
Published Mon, Jan 20 2014 2:38 AM | Last Updated on Tue, Jun 4 2019 6:33 PM