బెదిరింపులు ! | Threats! | Sakshi
Sakshi News home page

బెదిరింపులు !

Published Wed, Feb 25 2015 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM

Threats!

సాక్షిప్రతినిధి, గుంటూరు : భూ సమీకరణకు నాలుగు రోజుల సమయం మిగిలింది. మొదటి నుంచి భూ సమీ కరణను వ్యతిరేకిస్తున్న తాడేపల్లి, మంగళగిరి రైతులు రాజధాని నిర్మాణానికి అంగీకార పత్రాలు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం బెదిరింపు ధోరణికి దిగింది. రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పి.నారాయణ మంగళవారం సాయంత్రం తుళ్లూరులో మీడియాతో మాట్లాడారు.
 
  రైతులు భూ సమీకరణకు ముందుకు రాకపోవడంతో భూ సేకరణ చేపట్టనున్నామని ప్రకటించారు. ఇకపై భూ సమీకరణ గడువు పొడిగింపు ఉండదన్నారు. ఇప్పటివరకు 24,200 ఎకరాలు సమీకరించామని, మిగిలిన రోజుల్లో రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంతా భూములు ఇస్తే భూ సేకరణకు వెళ్లాల్సిన పనిలేదని చెప్పారు. భూ సమీకరణకు అంగీకారపత్రాలు ఇచ్చిన రైతులకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహాలు ఉంటాయని, భూ సేకరణకు వెళితే అటువంటి లాభాలు ఉండవని పరోక్షంగా బెదిరించారు.
 
 భూ సేకరణలో రైతుకు పరిహారం ఒకసారే లభిస్తుందని, అదే భూ సమీకరణలో  రైతులు అభివృద్ధి చేసిన భూములు పొందడమే కాకుండా, రాజధాని నిర్మాణంలో ప్రతీ రైతు భాగస్వామి అవుతారని చెప్పారు. నిర్మాణ పనులు, ఇతర కాంట్రాక్టుల్లో భూ సమీకరణకు సహకరించిన వారికి ప్రాధాన్యం ఉంటుందని, రాజకీయం చేసే పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని, రైతులు ఆలోచించుకోవాలని సూచించారు. భూసేకరణ బూచి పేరుతో రైతుల్ని బెదిరించి మిగిలిన నాలుగు రోజుల్లో సమీకరణ వేగం పెంచాలనే భావనలో మంత్రి ఉన్నట్టు స్పష్టమౌతోంది. పంటలు పండే భూముల్ని రాజధాని నిర్మాణానికి ఎలా తీసుకుంటారని రైతు సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు రాజధాని గ్రామాల్లో ఆందోళనలు చేస్తున్నాయి.
 
 ఈ నేపథ్యంలోనే వివాదాస్పద భూ సేకరణ ఆర్డినెన్స్‌కు నిరసనగా సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే సోమవారం ఢిల్లీలో  నరేంద్ర మోదీ సర్కారుపై ఆందోళన ప్రారంభించారు.  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజునే జంతర్‌మంతర్‌లో ఆయన చేపట్టిన రెండు రోజుల ఆందోళనకు మద్దతుదారులు పెద్ద సంఖ్యలో  హాజరయ్యారు.
 
 ఆయనకు మద్దతుగా పెనుమాకలో రెండోరోజు రైతులు దీక్షలు చేపట్టారు. 30 మంది పాల్గొన్నారు. కొంత మంది రైతులు ఢిల్లీలో అన్నా హజారేను కలసి రాజధాని గ్రామాల్లో పండుతున్న పంటలు, అక్కడి పరిస్థితులను వివరించారు. వివాదాస్పద భూ సమీకరణపై ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమాలను పరిగణనలోకి తీసుకోకుండా మంత్రి భూ సేకరణ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నామని ప్రకటించారు.
 
 అయితే ఈ విధానం కూడా సక్రమమైంది కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఏదైనా పరిశ్రమ, ప్రాజెక్టుకు భూమిని తీసుకునేప్పుడు ఒకే విధానాన్ని అనుసరిం చాలని, కొంత విస్తీర్ణానికి సమీకరణ, మిగిలిన విస్తీర్ణానికి సేకరణ చేపట్టరాదనే నిబంధనలు ఉన్నాయని, రాజధాని నిర్మాణానికి భూమిని తీసుకునేప్పుడు ఒకే విధానాన్ని అనుసరించాలని చెబుతున్నారు. కొంత భూ సమీకరణ, మరి కొంత సేకరణ చేస్తే రైతులకు కలిగే ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయని, ఈ విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తే చట్టపరంగా చిక్కులు వచ్చే అవకాశం ఉందని న్యాయవాదులు చెబుతున్నారు.
 
 భూ సమీకరణ నిధులు
 భూ సేకరణకు..
 ప్రభుత్వం ఇప్పటి వరకు సేకరించిన 24,200 ఎకరాల్లో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు, రాజధాని నిర్మాణానికి పోను మిగిలిన భూమిని పరిశ్రమలకు విక్రయించి, ఆ వచ్చిన మొత్తాన్ని భూ సేకరణకు వినియోగించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే అభిప్రాయం వినపడుతోంది. ఈ విధానాల ద్వారా రైతులకు నష్టం కలిగిస్తున్న చంద్రబాబుకు చట్టపరంగా భవిష్యత్‌లో చిక్కులు తప్పవని న్యాయవాదులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement