సందడి నుంచి శోక సంద్రంలోకి... | Three children died in Ballipadu | Sakshi
Sakshi News home page

సందడి నుంచి శోక సంద్రంలోకి...

Published Tue, Jan 20 2015 12:39 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

సందడి నుంచి శోక సంద్రంలోకి... - Sakshi

సందడి నుంచి శోక సంద్రంలోకి...

బల్లిపాడు (అత్తిలి) : సంక్రాంతి పండగకు అమ్మమ్మ ఇంటికి వచ్చి, సరదాగా గడిపిన ముగ్గురు చిన్నారులు చెరువులో పడి అనంతలోకాలకు వెళ్లిపోయారు. అప్పటి వరకు కుటుంబ సభ్యుల మధ్య ఆటపాటలతో గడిపిన వారు.. లేరన్న నిజం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ దుర్ఘటన అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. బల్లిపాడు గ్రామానికి చెందిన మీసాల దానయ్య, లక్ష్మీకాంతం దంపతులకు నలుగురు కుమార్తెలు. ఈ నలుగురికి వివాహాలు అయ్యాయి. మూడవ కుమార్తె కృష్ణవేణికి తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన వేల్పూరు రాంబాబుతో వివాహం అయింది. వీరికి ఇద్దరు మగపిల్లలు. నాల్గవ కుమార్తె భారతికి తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన కోటిచుక్కల నాగేంద్రకుమార్‌తో వివాహం అయింది.

వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
సంక్రాంతి పండగ సందర్భంగా కుమార్తెలను, మనమలను ఆహ్వానించడంతో మూడవ, నాల్గవ కుమార్తెలు, వారి పిల్లలు ఈనెల 16వ తేదీన అమ్మమ్మ గ్రామమైన బల్లిపాడుకు వచ్చారు. పండగ అనంతరం తిరిగి వారి స్వగ్రామాలకు సోమవారం వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. అయితే ఆదివారం సాయంత్రం రాంబాబు, కృష్ణవేణి దంపతుల చిన్న కుమారుడు మణికంఠ (7), నాగేంద్రకుమార్, భారతి దంపతుల కుమార్తెలు పావనిదుర్గ మహాలక్ష్మి (6), పల్లవి (4)లు ఆటలాడుకునే క్రమంలో కనిపించకుండా పోయారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో పిల్లలు కనిపించకపోవడంతో గ్రామంలోను, ఇతర గ్రామాలలోను వెదికారు. రాత్రి వరకు వెతికినా ఫలితం లేకపోవడంతో అర్ధరాత్రి అత్తిలి పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఎసై్స వి.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు.

సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో గ్రామంలో ఉన్న పంచాయతీ మంచినీటి చెరువులోకి నీళ్ల కోసం వెళ్లిన గ్రామస్తులకు తొలుత బాలిక మృతదేహం కనిపించడంతో, ఈ విషయాన్ని తప్పిపోయిన వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు వచ్చి చెరువులో వెతకగా మరో రెండు మృతదేహాలు లభించాయి. మృతిచెందింది తమ పిల్లలేనని గుర్తించిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి ఎసై్స సిబ్బందితో చేరుకుని వివరాలను స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి సేకరించారు. తణుకు సీఐ ఆర్.అంకబాబు సంఘటన ప్రదేశాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చేపలను  చూసేందుకు వెళ్లి...
స్థానిక శివాలయం ఎదురుగా ఉన్న మంచినీటి చెరువు రేవు వద్దకు ఎక్కువగా చేపలు వస్తుంటాయి. శివాలయం సెంటర్‌లో ఆడుకుంటూ రేవు వద్దకు చేరిన ముగ్గురు చిన్నారులు చేపలతో ఆడుకునేందుకు మెట్లపై నుంచి చెరువులోకి దిగే క్రమంలో జారిపడి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. చిన్నారులు చెరువులోకి దిగడాన్ని ఎవరూ చూడకపోవడంతో నీటిలో మునిగిపోయారని భావిస్తున్నారు.

ఘటనా స్థలానికి చేరుకున్న నాయకులు
చెరువులో పడి చిన్నారులు మృతిచెందారన్న వార్త తెలియడంతో పలువురు నాయకులు     ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల పండుస్వామి, సొసైటీ అధ్యక్షుడు ప్రగడ కోటసత్యం, దేవస్థానం మాజీ చైర్మన్ గారపాటి నాగేశ్వరరావు, ఆకుల నాగేశ్వరరావు, టీడీపీ మండలాధ్యక్షుడు కందుల సత్యనారాయణ, వైస్ ఎంపీపీ దిరిశాల భీమరాజు తదితరులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. ఈ విషయాన్ని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు సమాచారం అందించారు. దీంతో ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో మృతులు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఎంపీడీవో ఎస్.నిర్మలజ్యోతి ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.

గ్రామంలో
విషాద ఛాయలు
పండగ సందర్భంగా పుట్టింటికి వచ్చిన దానయ్య కుమార్తెలకు శోకం కలగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సోమవారం స్వగ్రామాలకు వెళ్లడానికి సిద్ధం చేసుకున్న తరుణంలో ఈ దారుణం జరగడంతో తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్యలు గుండెలవిసేలా విలపించారు. ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటున్న తల్లిదండ్రులు, తమ పిల్లలు లేరన్న వార్తను తట్టుకోలేక కన్నీరుమున్నీరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement