గుంటూరులో ముగ్గురు బాలికలు అదృశ్యమవడంతో కలకలం రేగింది.
హైదరాబాద్: గుంటూరులో ముగ్గురు బాలికలు అదృశ్యమవడంతో కలకలం రేగింది. లేఖారెడ్డి, దివ్య, యశస్వి అనే బాలికలు ఈనెల 14న గుంటూరులో అదృశ్యమయ్యారు. తర్వాతి రోజు వీరు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో దిగినట్టు పోలీసులు గుర్తించారు. ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్ నుంచి వీరు బయటకు వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీరితో ముగ్గురితో పాటు మరో యువతి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ఈ యువతే వీరిని గుంటూరు నుంచి ఇక్కడకు తీసుకువచ్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ముగ్గురు బాలికలు ఇంటి నుంచి వచ్చేటప్పుడు పెద్దమొత్తంలో బంగారం, డబ్బు తీసుకుని వచ్చినట్టు తెలుస్తోంది. వీరి అదృశ్యంపై గుంటూరు అర్బన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. దిల్ షుఖ్ నగర్ కు చెందిన యశస్వి గుంటూరులో చదువుకుంటోందని పోలీసులు తెలిపారు. వీరి ఆచూకీ కోసం తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ ముగ్గురి కోసం గుంటూరు, హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.