పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డెక్కిన మహిళలు
చిత్తూరు అర్బన్: చిత్తూరులో ఓ మైనర్ బాలిక కనిపించకుండా పోయింది. నగరంలోని చామంతిపురానికి చెందిన ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈమె తండ్రి గల్ఫ్ దేశంలో పొట్టకూటి కోసం వెళ్లారు. తల్లి, అమ్మమ్మ వద్ద ఉంటున్న బాలిక ఆదివారం చికెన్ తీసుకొస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత బాలిక ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు కంగారుపడి, తెలిసినవాళ్ల ఇళ్ల వద్ద వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు చెప్పి సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆదివారం రాత్రి వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. మంగళవారం చిత్తూరు పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువయ్యిందని.. మహిళలు మిస్ అవుతున్నా, అఘాయిత్యాలు, అత్యాచారాలకు గురవుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు ప్రవర్తిస్తోందన్నారు. చిత్తూరులో కనిపించకుండాపోయిన బాలిక ఆచూకీ వెంటనే కనిపెట్టి, ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. బాలిక ఆచూకీ తెలియకపోవడంతో చామంతిపురం వాసులు మంగళవారం రాత్రి వన్‌టౌన్ స్టేషన్ వద్దకు చేరుకుని బాలిక వివరాలు చెప్పాలని నిరసన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment