రైతు కుటుంబాల్లో ‘పిడుగు’ | Three members died due to thunderbolt | Sakshi
Sakshi News home page

రైతు కుటుంబాల్లో ‘పిడుగు’

Published Mon, Oct 28 2013 1:22 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

Three members died due to thunderbolt

కర్నూలు(రూరల్), న్యూస్‌లైన్: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగు పాటుకు ఆదివారం ముగ్గురు మృతి చెందారు. కర్నూలు మండలం ఆర్.కె.దుద్యాలకు చెందిన నరసింహ గౌడు(30) పశువుల మేత కోసం గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోని కర్నూలు-కడప కాలువ పక్కనున్న పొలానికివెళ్లాడు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భారీగా వర్షంతో పాటు పిడుగు పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు అతన్ని  కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఇతని భార్య పద్మావతితో పాటు ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు. అదేవిధంగా సి.బెళగల్ మండల పరిధిలోని కంబళదహాల్‌కు చెందిన కురువ మల్లేష్(బల్లయ్య) చిన్న కుమారుడు మల్లికార్జున(30) పిడుగుపాటుకు పొలంలోనే ప్రాణాలొదిలాడు.

సొంత గ్రామంలో సాగునీరు లేకపోవడంతో కొత్తకోట గ్రామ పరిధిలో మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని ఉల్లి, మిరప, పత్తి పంటలు సాగు చేశాడు. దినచర్యలో భాగంగా పొలం పనులకు వెళ్లగా మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పిడుగు పడి అక్కడికక్కడే మరణించాడు. ఇతనికి భార్య, ముగ్గురు కూతుళ్లు సంతానం కాగా..  కొద్దిరోజుల క్రితమే ఒక అమ్మాయి అనారోగ్యంతో మృతి చెందింది. కుటుంబానికి అండగా నిలవాల్సిన వ్యక్తి మరణించడంతో ఇక తమకు దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇక ఓర్వకల్లు మండలం చింతలపల్లెకు చెందిన మహిళా రైతు లక్ష్మీదేవి(43) గ్రామ సమీపంలోని వారి పొలంలో పనిచేస్తూ పిడుగుపాటుకు తీవ్ర గాయాలపాలైంది. గమనించిన స్థానికులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అయితే చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించింది. ఈమెకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు సంతానం. వ్యవసాయంలో భర్తకు అండగా నిలిచిన లక్ష్మీదేవి మృతితో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement