ప్రయాణికుల్లా వచ్చి..
Published Fri, Jul 15 2016 1:05 PM | Last Updated on Tue, Oct 30 2018 7:30 PM
ముగ్గురు సభ్యుల దొంగల ముఠా అరెస్టు
19 కాసుల బంగారు వస్తువులు స్వాధీనం
కడియం : ప్రయాణికుల్లా వచ్చి.. తోటి ప్రయాణికులను ఏమార్చి చోరీ చేయడం వారి నైజం. ఇలా చోరీకి పాల్పడిన ఇద్దరు మహిళలు సహా ముగ్గురి ముఠాను తూర్పు గోదావరి జిల్లా కడియం పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 19 కాసుల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను దక్షిణ మండలం డీఎస్పీ పురేటి నారాయణరావు గురువారం విలేకరులకు వివరించారు. రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన దొంతంశెట్టి సరోజినిదేవి ఈ నెల 5న కడియం మండలం బుర్రిలంకలో ఉన్న తన కుమారుడి ఇంటికి బయలుదేరింది. తాపేశ్వరంలో ఆటో ఎక్కి ద్వారపూడిలో దిగింది. అక్కడి నుంచి బస్సులో బుర్రిలంక చేరుకుంది. ఇంటి వద్ద బ్యాగ్ తెరిచిచూడగా, అందులోని 19 కాసుల బంగారు వస్తువులు, రూ.23 వేల నగదు మాయమైంది. దీంతో ఆమె కడియం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కడియం ఇన్‌స్పెక్టర్ ఎం.సురేష్ దర్యాప్తు చేపట్టారు.
తాపేశ్వరం–ద్వారపూడి మధ్య ఆటోలో ప్రయాణిస్తుండగానే వస్తువులు, నగదు చోరీకి గురైనట్టు గుర్తించారు. ఆటోలో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారని, వారితో ఓ చిన్నపాప ఉందని బాధితురాలు చెప్పిన వివరాలతో, నిందితులు గోకవరం ప్రాంతానికి చెందిన తెలకపాముల ముఠాల పని అయిఉంటుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ ముఠా సభ్యులు ఓ ఆటోను ఏర్పాటు చేసుకుని, అందులో ప్రయాణికుల్లా వెళుతూ, ఆ ఆటో ఎక్కిన సరోజినిదేవి వద్ద నగలు కాజేసినట్టు దర్యాప్తులో తేలింది. నిందితులైన గోకవరం ప్రాంతానికి చందిన బండి సుబ్రమణి, కాకర్ల పార్వతితోపాటు కిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నాగల లక్ష్మణబాబును పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద చోరీ సొత్తును పూర్తిగా రికవరీ చేయడంతో పాటు చోరీకి వినియోగించిన ఆటోను సీజ్ చేశారు. కేసును ఛేదించిన ఇన్‌స్పెక్టర్ సురేష్, ఎస్సై గౌరీనాయుడు, పీఎస్సై వేంకటేశ్వరరావు, హెచ్‌సీ సాంబశివరావు, ఇతర సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
Advertisement
Advertisement