
గుండె చెరువు
మంచినీటి కోసం చెరువులోకి దిగిన ముగ్గురిని, స్నానం చేస్తున్న ఓ విద్యార్థిని గంగమ్మ తల్లి తనలో కలిపేసుకుంది. జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ప్రమాదవ శాత్తూ చెరువుల్లో పడి నలుగురు మృతి చెందారు.
మంచినీటి కోసం చెరువులోకి దిగిన ముగ్గురిని, స్నానం చేస్తున్న ఓ విద్యార్థిని గంగమ్మ తల్లి తనలో కలిపేసుకుంది. జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ప్రమాదవ శాత్తూ చెరువుల్లో పడి నలుగురు మృతి చెందారు. అయినవారిని పోగొట్టు కున్న ఆయా కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
జి.వేమవరం (ఐ.పోలవరం) : తాగునీరు తెచ్చుకునేందుకు రక్షిత మంచినీటి చెరువుకు వెళ్లిన తల్లీ కూతురు మృత్యువాతపడ్డారు. ఐ.పోలవరం మం డలం జి.వేమవరం పంచాయతీ పరిధి కొడపలో ఈ ఘటన చోటుచేసుకుంది. పంచాయతీ అధికారులు నాలుగు రోజులుగా గ్రామంలో తాగు నీరు సరఫరా చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కోసం గ్రామానికి చెందిన పెనుమాళ దివ్య (25) తన పెద్ద కూతురు ప్రసన్న, చిన్న కూతురు పూజిత(4)తో కలసి మంగళవారం ఉదయం స్థానికంగా ఉన్న రక్షిత మంచినీటి వద్దకు వెళ్లింది. ఇద్దరు పిల్లలను గట్టుపై ఉంచి ముందుగా బిందెతో నీరు తీసుకుని ఒడ్డుకు వస్తుంది. ఇంతలో చిన్న కూతురు పూజిత ప్రమాదవశాత్తు మంచినీటి చెరువులోకి జారిపడింది.
కూతురిని రక్షిద్దామని దివ్య చెరువులోకి దిగింది. సుమారు పది అడుగుల లోతు వరకు నీరు ఉండడంతో తల్లీ కూతురు మునిగిపోయారు. కళ్లముందే తల్లి, చెల్లి చెరువులో మునిగిపోవడాన్ని గమనించిన పెద్దకుమార్తె ప్రసన్న కేకలు వేస్తూ గ్రామంలోకి పరుగులు తీసింది. గ్రామస్తులు అక్కడకు చేరుకునే సమయానికే తల్లీ కూతురు మరణించారు. ఉదయాన్నే కూలి పనికి దివ్య భర్త వెంకటేశ్వర్లుకు విషయం తెలియడంతో ఇంటికి చేరుకుని బోరున విలపించాడు. ఐ.పోలవరం ఎస్సై పాండుదొర సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం తీరును అడిగి తెలుసుకున్నారు. దివ్య, పూజిత మృతదేహాలకు ముమ్మిడివరం ప్రభుత్వాస్పత్రి వైద్యుడు మోహనరావుతో పోస్టుమార్టం చేయించి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. కేసు నమోదు చేస్తున్నట్టు ఎస్సై పాండుదొర తెలిపారు.
కూడా వస్తానని .. కడతేరిపోయాడు
కూనవరం (సీతానగరం) : ఉపాధి పనులకు వెళుతున్న తండ్రి, అన్నలతో పాటు తాను వస్తానని చెప్పిన ఇంటర్ విద్యార్థి చెరువులో పడి మృతి చెందాడు. కూనవరం గ్రామానికి చెందిన నండూరి ఏడుకొండలు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆయనతో పాటు పెద్ద కుమారుడు వెంకట్రాజు కూడా ఉపాధి పని కూలీలు. వారిద్దరూ మంగళవారం ఉదయం పనులకు వెళ్లారు. వారితో పాటు తాను కూడా చూసేందుకు వస్తానని ఇంటర్ చదువుతున్న చిన్న కుమారుడు రాము వెళ్లాడు. రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న పాతూరి వారి చెరువులో కొంత భాగం నీరు లేకపోవడంతో ఉపాధి పథకంలో మట్టిని తీసి బండ ఏర్పాటు చేస్తున్నారు. పది గంటలకు పని పూర్తి కావడంతో రాము, వెంకట్రాజు స్నానం చేసేందుకు చెరువులో దిగారు. రాము మునిగిపోతూ కేకలు వేయడంతో రక్షించేందుకు అన్న ప్రయత్నించాడు. ఆ క్రమంలో వారిద్దరూ మునిగిపోయారు. ఇది గమనించిన తోటి కూలీలు వెంకట్రాజును బయటకు లాగారు. రాము మాత్రం నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. గాలించగా మధ్యాహ్నం 12 గంటలకు మృతదేహం లభ్యమైంది. రాము మృతితో తల్లి లక్ష్మి, తండ్రి ఏడుకొండలు, చెల్లెలు దుర్గ ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికి అందివస్తాడనుకున్న కొడుకు విగతజీవుడు కావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.